నటుడిగా నా జీవితానికి ఒక ప్రత్యేక అర్థాన్నిచ్చింది: విజయ్ దేవరకొండ
డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ.. తాను పుట్టి పెరిగిన రాయలసీమ నేల రుణం ఈ సినిమా ద్వారా తీర్చుకున్నానని భావిస్తున్నట్లు తెలిపారు.
By: Sivaji Kontham | 23 Oct 2026 10:04 PM ISTవిజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రశ్మిక మందన్న నాయికగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం `రణబాలి`. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్ ఉత్సాహంలో చిత్రయూనిట్ అనంతపురంలో `రణబాలి రణభేరి` పేరిట భారీ విజయయోత్సవ వేడుకను నిర్వహించింది.
రణబాలి సాధించిన విజయంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొదట్లో కొన్నిచోట్ల మిక్స్డ్ టాక్ వచ్చినా సాయంత్రానికి వసూళ్లు పుంజుకుని విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని తెలిపారు. తమ బ్యానర్లో వచ్చిన `డియర్ కామ్రేడ్`, `ఖుషి` చిత్రాల కంటే ఇది పెద్ద విజయమని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి ఊహించని స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయని చెప్పారు. అలాగే షూటింగ్ వల్ల ఈవెంట్‌కు రాలేకపోయిన హీరోయిన్ రశ్మిక మందన్న, సోషల్ మీడియా ద్వారా `జయమ్మ` పాత్రపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు.
డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ.. తాను పుట్టి పెరిగిన రాయలసీమ నేల రుణం ఈ సినిమా ద్వారా తీర్చుకున్నానని భావిస్తున్నట్లు తెలిపారు. చరిత్రలో మరుగున పడిన ఒక గొప్ప ఘట్టాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించడం ఎంతో సవాలుతో కూడుకున్నదని చెప్పారు. కొందరు నెగిటివిటీ వ్యాప్తి చేయడానికి చూసినా మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నిరూపితమైందన్నారు. సీమ యాసను గతంలో చిరంజీవి, బాలకృష్ణ ఎంత సులువుగా పలికారో, విజయ్ దేవరకొండ కూడా అదే స్థాయిలో చెప్పి మెప్పించారని కొనియాడారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తెలుగు నేల గొప్పతనాన్ని, తెలంగాణ ఆవేశాన్ని, ఆంధ్ర ఆప్యాయతను, రాయలసీమ విశిష్టతను గుర్తు చేసుకున్నారు. తాను చదువుకున్న రాయలసీమలోనే 'రణబాలి' చిత్రీకరణ జరగడం, కొత్తచెరువు ప్రాంతంలో తాను సినిమాలు చూసిన థియేటర్లలోనే ఇప్పుడు తన సినిమా హౌస్‌ఫుల్స్‌తో నడవడం ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు.
ఈ సినిమాను ఒక నటుడిగా కాకుండా, ఈ నేల కథను ప్రపంచానికి చెప్పాలనే బాధ్యతతో చేశానని విజయ్ తెలిపారు. ఒక పెద్దాయన వచ్చి `మా వీరుల కథ చెప్పావు బిడ్డా` అని తన చేయి పట్టుకుని అభినందించినప్పుడు కలిగిన తృప్తి ఏ అవార్డు లేదా డబ్బు ఇవ్వలేదని అన్నారు. ప్రేక్షకులు `రణబాలి`ని ఇలా అక్కున చేర్చుకోవడం నటుడిగా తన జీవితానికి ఒక ప్రత్యేక అర్థాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
తెలుగు ప్రేక్షకులు తనపై గత పదేళ్లుగా చూపిస్తున్న ప్రేమ ఈ మధ్యకాలంలో మరింతగా పెరిగిందని, విజయవంతమైన `రణబాలి` చిత్రాన్ని అందించినందుకు దర్శకుడు రాహుల్‌కు భవిష్యత్తులో మరింత పేరు వస్తుందని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజలు అందిస్తున్న అపూర్వ ఆదరణకు, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన వేదికపై నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
