Begin typing your search above and press return to search.

రణబాలి.. ఎక్కడ తేడా కొడుతోంది?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్ళయిన తర్వాత జంటగా నటించిన తొలి చిత్రం.. రణబాలి. విజయ్‌తో ‘ట్యాక్సీవాలా’, ఆపై నానితో ‘శ్యామ్ సింగరాయ్’ చేసి హిట్లు కొట్టిన రాహుల్ సంకృత్యన్ దీనికి దర్శకుడు.

By:  Garuda Media   |   8 Oct 2026 3:45 PM IST
రణబాలి.. ఎక్కడ తేడా కొడుతోంది?
X

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్ళయిన తర్వాత జంటగా నటించిన తొలి చిత్రం.. రణబాలి. విజయ్‌తో ‘ట్యాక్సీవాలా’, ఆపై నానితో ‘శ్యామ్ సింగరాయ్’ చేసి హిట్లు కొట్టిన రాహుల్ సంకృత్యన్ దీనికి దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఏకంగా వంద కోట్ల బడ్జెట్ పెట్టి ప్రొడ్యూస్ చేసింది. చరిత్ర నుంచి తీసుకున్న ఈ కథ కూడా బాగా ఎగ్జైట్ చేసేదే. కానీ ‘రణబాలి’కి ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ.. రిలీజ్ ముంగిట ఈ చిత్రానికి ఆశించిన హైప్ కనిపించడం లేదు. యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ చూసి అందరూ షాకవుతున్నారు. విజయ్ ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా తన గత చిత్రాలకు ఇక్కడ జోరుగా ప్రి సేల్స్ జరిగాయి. ‘కింగ్డమ్’ కూడా మంచి హైప్‌తో రిలీజైంది. కానీ ‘రణబాలి’ విషయంలో మాత్రం ప్రేక్షకుల ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు ఆశించిన హైప్ కనిపించడం లేదు. విడుదలకు ఇంకో వారమే సమయం ఉండగా.. సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పెద్దగా చర్చలు కనిపించడం లేదు.

బ్రిటిష్ కాలంలో రాయలసీమ ప్రాంతంలో వచ్చిన డొక్కల కరవు నేపథ్యంలో సాగే కథ ఇది. ఇక్కడి జనాలు తిండి లేక అల్లాడుతుంటే పండిన ధాన్యం అంతా ఢిల్లీకి తీసుకెళ్లి ఆకలి చావులకు కారణమైన బ్రిటిష్ దొర మీద పోరాడిన యోధుడి కథను ఇందులో చూపిస్తున్నాడు రాహుల్ సంకృత్యన్. కథ ఆసక్తి రేకెత్తించేది. రాహుల్ టేకింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు కాబట్టి సినిమాలో బలమైన కంటెంట్ ఉంటుందనే ఆశిస్తున్నారు. అయినా సినిమాకు అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. అందుకు ఎగ్జైటింగ్ ప్రోమోలు కట్ చేయకపోవడం ఒక కారణం కావచ్చు. టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా, ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. మరోవైపు టీం ప్రమోషన్లు కూడా సరిగ్గా చేయట్లేదనే అభిప్రాయాలున్నాయి. వివిధ భాషల నుంచి మీడియా ప్రతినిధులను పిలిపించుకుని.. ఆయా భాషల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు విజయ్, రష్మిక, రాహుల్. కానీ అందులో సినిమా గురించి సరిగా చెప్పుకోలేకపోయారు. హైప్ తెచ్చే కబుర్లేవీ అందులో లేకపోయాయి. ఎక్కువగా వ్యక్తిగత విషయాల చర్చ ఉండడంతో ఆ ఇంటర్వ్యూల పట్ల నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. విజయ్, రష్మిక బాగా ట్రోల్ అయ్యారు కూడా. ఇప్పటిదాకా అయితే ‘రణబాలి’ కంటెంట్‌ను సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లి, వారిలో సినిమా చూడాలన్న క్యూరియాసిటీ పెంచలేకపోయారన్నది వాస్తవం. ఈ రోజు రిలీజయ్యే ట్రైలర్ బాగుండి.. ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా బాగా చేస్తే రిలీజ్ టైంకి సినిమాకు అవసరమైన హైప్ రావచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.