సినిమా రాకముందే తీర్పు.. విజయ్‌కే ఎందుకింత?
విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే చాలు.. కంటెంట్ కన్నా ముందు ఒకరకమైన వైబ్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోతోంది.
By: M Prashanth | 8 Oct 2026 7:23 PM ISTవిజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే చాలు.. కంటెంట్ కన్నా ముందు ఒకరకమైన వైబ్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోతోంది. అసలు సినిమా ఎలా ఉందనేది థియేటర్లలోకి రాకముందే ఓ వర్గం నెటిజన్లు ఒక తీర్పు ఇచ్చేస్తున్నారు. లేటెస్ట్ గా జరిగిన 'రణబలి' ట్రైలర్ లాంచ్ లో నిర్మాత రవిశంకర్ ఇదే విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ట్రైలర్ కూడా చూడకముందే బ్రిటిష్ కాలం నాటి కథలు ఇప్పుడు ఆడుతాయా? అంటూ కామెంట్స్ చేయడం ఏంటని ఆయన నిలదీశారు.
కంటెంట్ చూశాక నచ్చకపోతే విమర్శించండి కానీ, ముందే ఎందుకు నెగెటివ్ గా వెళ్తున్నారని ఆయన అడిగిన ప్రశ్న ఆలోచించాల్సిన విషయమే. నిజానికి విజయ్ కెరీర్ లో వరుసగా కొన్ని ఫ్లాపులు పడటంతో, ఆ రిజల్ట్స్ తాలూకు బ్యాగేజ్ కొత్త సినిమాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చిన్న అప్డేట్ లేదా పోస్టర్ వచ్చినా సరే, పాత రిజల్ట్స్ ను గుర్తుచేస్తూ దారుణంగా ఓ వర్గం వారు ట్రోల్ చేస్తున్నారు. దీంతో కొత్త సినిమా కంటెంట్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోకముందే, పాత ఫ్లాపుల ముద్ర దానిపై పడిపోయి ఆ ప్రాజెక్ట్ కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
అయితే నిర్మాత రవిశంకర్ ఇక్కడే విజయ్ వ్యక్తిగతం గురించి కూడా ఓపెన్ అయ్యారు. ఏడెనిమిదేళ్లుగా అతనితో జర్నీ చేస్తున్నామని, విజయ్ రియల్ లైఫ్ లో చాలా మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చారు. ఎవరి గురించీ చెడుగా మాట్లాడడని, సినిమా తప్ప అతనికి మరో ప్రపంచం లేదని క్లారిటీ ఇచ్చారు. అయినా సరే సోషల్ మీడియాలో అతను ఏ చిన్న పని చేసినా దాన్ని కావాలనే నెగెటివ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారని వాపోయారు.
విజయ్ దేవరకొండ కాన్ఫిడెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని పర్సనల్ ఇమేజ్, ఆన్ స్క్రీన్ ఇమేజ్ రెండూ తరచుగా మిక్స్ అయిపోతున్నాయి. గతంలో ఇచ్చిన ఏదైనా స్టేట్ మెంట్, పాత ఇంటర్వ్యూ లేదా ఏదైనా వివాదం.. ఇవన్నీ కూడా అతని తర్వాతి సినిమా వరకు నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. స్టార్ హీరోలందరికీ నెగెటివిటీ కామన్ అయినా, విజయ్ విషయంలో ఓ వర్గం వారి కామెంట్స్ ఇంకాస్త ఎక్కువ వైరల్ అవుతున్నాయి. అందుకే రణబలి కంటెంట్ ను చూడకముందే స్టోరీపై తీర్పులు ఇచ్చేయడం నిర్మాతను బాగా హర్ట్ చేసింది.
'రణబలి' టీమ్ మాత్రం తమ కంటెంట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ కథను చెక్కడానికి ఏకంగా రెండేళ్లు సమయం తీసుకున్నారు. ఇక విజయ్ అయితే ఇందులోని గుర్రపు స్వారీ ఎపిసోడ్స్ కోసం వంద రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇన్ని వందల గంటల కష్టాన్ని మాటలతో కాకుండా థియేటర్లలో తమ వర్క్ తోనే సమాధానం చెప్పాలని టీమ్ గట్టిగా ఫిక్స్ అయింది.
విజయ్ పై ఉన్న ఈ రకమైన ముద్రను చెరిపేయాలంటే పక్కాగా బౌన్స్ బ్యాక్ అవ్వడం ఒక్కటే మార్గం. అక్టోబర్ 16న భారీ అంచనాలతో రణబలి థియేటర్లలోకి అడుగుపెడుతోంది. సినిమా చూసిన తర్వాత నచ్చితే మెచ్చుకోండి, బాగోలేకపోతే విమర్శించండి కానీ ముందే హీరోపై ఉన్న కోపంతో సినిమాను పక్కన పెట్టేయొద్దన్నది నిర్మాత ఫైనల్ రిక్వెస్ట్. మరి సినిమా అవుట్ పుట్ ఆడియెన్స్ అంచనాలను ఎంతవరకు టచ్ చేస్తుందో చూడాలి.
