Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు పోరాట యోధుల వీర‌త్వం స్పూర్తితో!

ఈ సినిమా ఏ ఒక్క నిర్దిష్టమైన వ్యక్తి జీవిత చరిత్రను ప్రతిబింబించదని, రాయలసీమ మట్టిలో పుట్టిన విప్లవ వీరుల, పాళెగాళ్ల సాహసాలు, త్యాగాలు

By:  Srikanth Kontham   |   4 Oct 2026 4:04 PM IST
ఇద్ద‌రు పోరాట యోధుల వీర‌త్వం స్పూర్తితో!
X

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా `ర‌ణబలి` చిత్రంపై టాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 19వ శతాబ్దపు దక్షిణ భారతదేశ నేపథ్యంతో బ్రిటిష్ పాలన నాటి కరువు పరిస్థితులు .. ఆధిపత్యంపై సాగే పోరాటంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కథాంశంపై ప్రేక్షకుల్లో నడుస్తున్న రకరకాల ఊహాగానాలకు దర్శకుడు రాహుల్ సంకృత్యన్ క్లారిటీ ఇచ్చారు.

`రణబలి` చిత్రం రాయలసీమకు చెందిన స్వాతంత్ర‌ సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లేదా బుడ్డా వెంగల్ రెడ్డి వంటి చారిత్రక వ్యక్తుల జీవితాల ఆధారంగా రూపొందిన బయోపిక్ కాదని స్పష్టం చేశారు. ఈ సినిమా ఏ ఒక్క నిర్దిష్టమైన వ్యక్తి జీవిత చరిత్రను ప్రతిబింబించదని, రాయలసీమ మట్టిలో పుట్టిన విప్లవ వీరుల, పాళెగాళ్ల సాహసాలు, త్యాగాలు , వీరత్వ స్ఫూర్తిని పునాదిగా చేసుకుని డిజైన్ చేసిన కల్పిత కథ (ఫిక్షనల్ స్టోరీ) అన్నారు. ప్ర‌త్యేకంగా ఇద్ద‌రు పోరాట యోధుల వీర‌త్వం స్పూర్తిగా నిలిచింద‌న్నారు.

రాయలసీమ ప్రాంతం వీరులకు, పరాక్రమానికి నిలయమని పేర్కొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారిపై చూపిన పోరాట పటిమ, బుడ్డా వెంగల్ రెడ్డి వంటి వారు కరువు కాలంలో ప్రజల ఆకలి తీర్చడానికి చూపిన దాతృత్వం, ధైర్యం తమకు ఎంతో ప్రేరణనిచ్చాయన్నారు. వీరితో పాటు గాడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి వంటి ఎంతోమంది మరుగైపోయిన వీరుల పోరాట శైలి , నైతిక విలువలను అధ్యయనం చేసి `రణబలి` నాయకుడి పాత్రను తీర్చిదిద్దినట్లు వివరించారు.

కల్పిత కథ అయినా? ఆనాటి కాలాన్ని , రాయలసీమ సంస్కృతి, భావోద్వేగాలను అత్యంత సహజ సిద్ధంగా తెరపై ఆవిష్కరించేందుకు చిత్రబృందం ఎంతో పరిశోధన చేసింది. 1870ల కాలంలో బ్రిటిష్ పాలకులు సృష్టించిన కృత్రిమ కరువు, దానివల్ల అలమటించిన ప్రజల రక్షణ కోసం ఒక వీరుడు ఎలాంటి తిరుగుబాటు చేశాడనేది ఈ చిత్రంలో ప్రధానాంశంగా ఉండనుంది. నిజమైన చారిత్రక సంఘటనల తీవ్రతను కోల్పోకుండా, వర్తమాన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా లార్జర్ ద్యాన్ లైఫ్ ఎలిమెంట్స్‌తో కథను మలిచారు.

చారిత్రాత్మ‌క బయోపిక్ కాక‌పోయినా? విస్మరించబడిన యోధుల వీరత్వ స్ఫూర్తితో తెరకెక్కిన `రణబలి` ప్రేక్షకు లకు గొప్ప అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. తెలుగు తెరపై రాయలసీమ వీరుల పరాక్రమాన్ని మరో కోణంలో ఆవిష్కరించబోతున్న చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.