Begin typing your search above and press return to search.

విజ‌య్ విశ్వ‌రూపం చూస్తారు: `ర‌ణ‌బాలి` ప్రీలీజ్‌లో చిత్ర‌ ద‌ర్శ‌కుడి వ్యాఖ్య‌లు!

విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `రణబాలి` ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

By:  Sivaji Kontham   |   14 Oct 2026 12:00 AM IST
విజ‌య్ విశ్వ‌రూపం చూస్తారు: `ర‌ణ‌బాలి` ప్రీలీజ్‌లో చిత్ర‌ ద‌ర్శ‌కుడి వ్యాఖ్య‌లు!
X

విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `రణబాలి` ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.ఈ చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను ఒక సముద్రంతో పోల్చారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రొడక్షన్ హౌస్ పెద్ద భాగంగా ఉందంటే కేవలం వ్యాపారం కాకుండా అందరితో మంచి అనుబంధం ఉండటమే కారణమని తెలిపారు. `అన్నం పరబ్రహ్మ స్వరూపం` అని పేర్కొంటూ, ఆకలి - అన్నం అనే అంశం చుట్టూ ఈ కథ ప్రారంభమైందని, ఆ ఆకలిని ఆయుధంగా మలుచుకుని పరాయి దేశాల వారు మనల్ని 250 ఏళ్ల పాటు పాలించారని వివరించారు.

మనకు తెలియకుండా మరుగున పడిన ఆ చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు తాను ఎంతో డిస్టర్బ్ అయ్యానని రాహుల్ వెల్లడించారు. మన చరిత్రను మనమే తెలుసుకుని ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో ఈ ప్రయాణం ప్రారంభమైందని.. తన బ్రదర్ ప్రమోద్ ఈ కథ గురించిన ఆలోచనను తనకు మొదటిగా చెప్పాడని తెలిపారు. సీమలో పుట్టిన తనకు పుట్టిన నేల మీద ఉన్న జ్ఞాపకాలతో ఒక సినిమా చేయాలన్న ఆలోచన వచ్చిందని, పిచ్చిపట్టినట్లు కదిలించే అలాంటి కథే `రణబాలి` రూపంలో దొరికిందని, ఈ ప్రాజెక్ట్ కోసం నాలుగేళ్లు గడిచిపోయాయని చెప్పారు.

ఈ చిత్రానికి అదృష్టవశాత్తు మంచి కాస్ట్ అండ్ క్రూ కుదిరారని రాహుల్ తెలిపారు. విజయ్ - రశ్మిక వివాహం గురించి ప్రస్తావిస్తూ, సినిమా షూటింగ్ జరిగే సమయంలో తమకు ఆ విషయం పూర్తిగా తెలియదని..అప్పటికే సెట్‌లో వీళ్ళిద్దరి పెళ్లి పోస్టర్ రిలీజ్ చేశామని సరదాగా తెలిపారు. ఈ చిత్రంలో విజయ్, రశ్మిక భార్యాభర్తలుగా నటించారని, జయమ్మ పాత్రలో రశ్మిక అద్భుతమైన నటన కనబరిచిందని... వారిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.

తన తొలి సినిమా `టాక్సీవాలా` హీరో అయిన విజయ్‌తోనే ఈ సినిమా చేయడం సంతోషంగా ఉందని రాహుల్ అన్నారు. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పడం కష్టమైనా.. రణబాలిగా విజయ్ నటనా విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూస్తారని, ఆయన నటన అద్భుతంగా ఉంటుందని కొనియాడారు. ఈ సినిమాకు `యుఎ` సర్టిఫికెట్ లభించిందని, పిల్లలందరూ కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూడాలని కోరారు.