రైల్వేల వెనుక బ్రిటిష్ వారి దోపిడీ.. రణబలి చాప్టర్ 2లో కఠిన నిజాలు!
సినిమా ప్రమోషన్స్ అనగానే పాటలు, ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే గుర్తుకొస్తాయి.
By: M Prashanth | 30 Sept 2026 6:50 PM ISTసినిమా ప్రమోషన్స్ అనగానే పాటలు, ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ విజయ్ దేవరకొండ నటిస్తున్న 'రణబలి' మేకర్స్ మాత్రం ప్రమోషన్ల కోసం ఒక సరికొత్త రూట్ ఎంచుకున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్ ట్రాక్ లో వెళుతోంది. ఇక సినిమాలోని కంటెంట్ ను చూపించే కంటే ముందు, ఆ కథ వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ రిలీజ్ చేసిన చిత్రబృందం, లేటెస్ట్ గా 'ది హిస్టరీ వి ఫర్‌గాట్' అంటూ రెండో చాప్టర్‌ను విడుదల చేసింది.
ఈ రెండో ఎపిసోడ్‌లో బ్రిటిష్ కాలం నాటి దోపిడీకి సంబంధించిన కఠినమైన నిజాలను హైలెట్ చేశారు. భారతదేశంలో రైల్వే వ్యవస్థను నిర్మించింది బ్రిటిష్ వారే అని పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం.. అయితే ఆ రైల్వేలను దేశ అభివృద్ధి కోసం కాకుండా, ఇక్కడి సంపదను దోచుకోవడానికే వాడారన్న అసలు నిజాన్ని విజయ్ దేవరకొండ ఈ వీడియోలో వివరించారు. పత్తి, ధాన్యం, సుగంధ ద్రవ్యాలు, బంగారం లాంటి వనరులను ఓడరేవులకు తరలించి అక్కడి నుంచి బ్రిటన్‌కు తీసుకెళ్లడానికే రైల్వే ట్రాక్‌లు వేశారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదే ఎపిసోడ్‌లో రష్మిక మందన్న కూడా ఆనాటి పరిస్థితుల గురించి మాట్లాడారు. ఈ సినిమా కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు, అప్పటి కాలం నాటి నిజాలు తెలుసుకుని తాను ఎంతగానో చలించిపోయినట్లు ఆమె తెలిపారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా బతుకుతున్న ఒక దేశం ఎలా దోపిడీకి గురైందో తెలుసుకున్నప్పుడు షాకింగ్ గా అనిపించిందని ఆమె పంచుకున్నారు.
భారతీయుల కష్టంతో, మన ట్యాక్స్ డబ్బులతోనే ఆ రైల్వే నెట్‌వర్క్ నిర్మించారన్న పాయింట్ ఈ వీడియోలో బలంగా ఎలివేట్ అయ్యింది. టాలీవుడ్‌లో ఇలాంటి ప్రమోషనల్ స్ట్రాటజీ చూడటం చాలా అరుదు. కేవలం బడ్జెట్ అంకెలు, హీరో ఎలివేషన్ల చుట్టూ తిరక్కుండా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కథకు ఉన్న సోల్‌ను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
దీనివల్ల అసలు సినిమా చూడకముందే ప్రేక్షకులకు ఆనాటి ప్రజల బాధలతో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. కంటెంట్ మీద మేకర్స్‌కు ఉన్న నమ్మకం ఈ డాక్యుమెంటరీ సిరీస్ ద్వారా కనిపిస్తోంది. సినిమా రిలీజ్‌కు ఇంకా సమయం ఉండటంతో ఈ సిరీస్‌ను పక్కా ప్లానింగ్‌తో వదులుతున్నారు. ఈ రెండో ఎపిసోడ్ చివర్లోనే, అక్టోబర్ 2న 'ది మెన్ వి ఫర్‌గాట్' పేరుతో మూడో చాప్టర్ రాబోతున్నట్లు కూడా ప్రకటించారు.
ఇలా ప్రేక్షకులను 1878 నాటి ప్రపంచంలోకి తీసుకెళ్తూ, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం వాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఒక పీరియాడిక్ డ్రామాకు కావాల్సిన పర్ఫెక్ట్ బేస్ ఈ ఎపిసోడ్లతో క్రియేట్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. హీరో క్రేజ్‌తో సంబంధం లేకుండా కేవలం కథలోని ఇంటెన్సిటీతో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ వేసిన ఈ ప్లాన్ వర్కవుట్ అయితే మంచి ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ.
