Begin typing your search above and press return to search.

బ్రిటీషర్ల బ్యాక్ డ్రాప్ అంటేనే రిస్కా..

ఈ తరహా కథల్లో ఈ మధ్య బాగా హిట్ అయిన వాటిలో ఆర్ఆర్ఆర్ ఒకటి. అందులో బ్రిటీషర్లపై పోరాటం ఉన్నా కూడా రాజమౌళి అసలు కథను ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న ఎమోషన్ చుట్టూనే తిప్పారు.

By:  M Prashanth   |   14 Oct 2026 8:45 AM IST
బ్రిటీషర్ల బ్యాక్ డ్రాప్ అంటేనే రిస్కా..
X

మన మేకర్స్ కు ఈమధ్య పీరియాడిక్ కథల మీద ఇష్టం గట్టిగానే పెరిగింది. ముఖ్యంగా తెల్లదొరల కాలం నాటి బ్యాక్ డ్రాప్ తీసుకుంటే ఎలివేషన్లకు మంచి స్కోప్ ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఈ ఫార్ములా బాక్సాఫీస్ దగ్గర అందరికీ ఒకేలా వర్కౌట్ అవ్వడం లేదు. కథలోని ఎమోషన్ కనెక్ట్ అయితేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా రణబాలి రూపంలో సరిగ్గా అదే బ్రిటీష్ కాలం నాటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ తరహా కథల్లో ఈ మధ్య బాగా హిట్ అయిన వాటిలో ఆర్ఆర్ఆర్ ఒకటి. అందులో బ్రిటీషర్లపై పోరాటం ఉన్నా కూడా రాజమౌళి అసలు కథను ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న ఎమోషన్ చుట్టూనే తిప్పారు. అందుకే ఆ ప్రాజెక్ట్ వెయ్యి కోట్లకు పైగా కొల్లగొట్టింది. కానీ మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి విషయానికి వస్తే సీన్ రివర్స్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాగానే ఆడినా భారీ బడ్జెట్ వల్ల ఇతర భాషల్లో ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాకపోవడంతో లాభాల లెక్కలు తారుమారయ్యాయి.

ఇక కోలీవుడ్ నుంచి వచ్చిన ప్రయోగాల లెక్కలు చూస్తే పరిస్థితి ఇంకోలా ఉంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్ లో తెల్లవాళ్ల సైన్యంలో పనిచేసి వాళ్లకే ఎదురుతిరిగే పాయింట్ తీసుకున్నారు. కలెక్షన్ల పరంగా అది యావరేజ్ గానే నిలిచింది. విక్రమ్ తంగలాన్ లో అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నాటి నేపథ్యానికి జానపద కథను జోడించారు. విజువల్స్ పరంగా సినిమా మెప్పించినా భారీ నిర్మాణ ఖర్చును మాత్రం వెనక్కి తీసుకురాలేకపోయింది. ఒకే కాలం నాటి కథలైనా ఫలితాలు మాత్రం ఎవరివి వాళ్లవే.

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కేసరి చాప్టర్ 2 లో కొంచెం కొత్తగా ట్రై చేశారు. జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత బ్రిటీష్ అధికారులను కోర్టులో నిలదీసే పాయింట్ తీసుకున్నారు. యాక్షన్ కంటే కోర్టు డ్రామాకే ప్రాధాన్యం ఇవ్వడంతో అదీ మోస్తరు రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. ఆగస్టు 16 1947 అనే మరో సినిమాలో స్వాతంత్య్రం వచ్చిన విషయమే తెలియని ఊరి కథను చూపించారు. పాయింట్ కొత్తగా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ నిలబడలేకపోయింది.

ఇన్ని రకాల రిజల్ట్స్ చూసిన తర్వాత ఇప్పుడు రణబాలి మేకర్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారనే ఆసక్తి ట్రేడ్ లో కనిపిస్తోంది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ 1876 నాటి కరువు పరిస్థితులను మెయిన్ థీమ్ గా తీసుకున్నారు. అప్పటి బ్రిటీష్ ఆఫీసర్ రిచర్డ్ క్యారెక్టర్ ను స్ఫూర్తిగా తీసుకుని ఇందులో థియోడర్ హెక్టర్ అనే విలన్ పాత్రను డిజైన్ చేశారు. ఆ దారుణమైన పాలనను ఒక లోకల్ వీరుడు ఎదిరిస్తే ఎలా ఉంటుందనే ఆల్టర్నేట్ హిస్టరీ కాన్సెప్ట్ తో రాబోతున్నారు.

ట్రైలర్ గమనిస్తే యాక్షన్ కు తోడుగా రణబాలి, జయమ్మల మధ్య సాగే ఎమోషనల్ బాండింగ్ సినిమాకు కోర్ పాయింట్ లా కనిపిస్తోంది. యాక్షన్ మాత్రమే కాకుండా ఫోక్‌లోర్ టచ్ కూడా ఇవ్వడం ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చింది. ఈ బ్రిటీష్ బ్యాక్ డ్రాప్ సెంటిమెంట్ రౌడీ హీరోకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.