Begin typing your search above and press return to search.

'ధురంధర్ 2' రికార్డులపై రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు!

రానా అభిప్రాయం ప్రకారం.. మనం ఇప్పటివరకు భారతీయ సినిమా సామర్థ్యంలో కేవలం గోరంత మాత్రమే చూశాం.

By:  Sivaji Kontham   |   8 May 2026 9:49 AM IST
ధురంధర్ 2 రికార్డులపై రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సుమారు దశాబ్ద కాలంగా అజేయంగా కొనసాగుతున్న `బాహుబలి 2: ది కన్‌క్లూజన్` రికార్డులను `ధురంధర్ 2` చిత్రం తిరగరాయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అసాధార‌ణ‌ విజయంపై నటుడు రానా దగ్గుబాటి స్పందిస్తూ.. ఇది భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్‌లో ఎదుగుతున్న తీరుకు, అద్భుత ప్ర‌యాణానికి నిదర్శనమని కొనియాడారు. పదేళ్ల తర్వాత ఒక భారతీయ చిత్రం ఈ స్థాయి రికార్డును నెలకొల్పడం పరిశ్రమకు సానుకూల ప‌రిణామ‌మని హర్షం వ్యక్తం చేశారు.

రానా అభిప్రాయం ప్రకారం.. మనం ఇప్పటివరకు భారతీయ సినిమా సామర్థ్యంలో కేవలం గోరంత మాత్రమే చూశాం. అన్వేషించాల్సింది ఇంకా చాలా ఉంది. భార‌త దేశం నుంచి వ‌స్తున్న వైవిధ్య‌మైన సినిమాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఆద‌ర‌ణ ద‌క్క‌డం గొప్ప ఎదుగుద‌ల‌ అని కొనియాడారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల భారతీయ చిత్రాలకు ఆద‌ర‌ణ పెరిగింది. ఇది మన టెక్నీషియన్లు , దర్శకులకు గర్వకారణమని ఆయన అన్నారు. భారీ వసూళ్లు సాధించే చిత్రాలే కాకుండా.. ఘాఢ‌మైన భావోద్వేగాలు ఉన్న క‌థ‌లు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయని రానా విశ్లేషించారు. మన స్థానిక కథల్లో ఉండే మానవీయ సంబంధాలే ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయని రానా నమ్ముతున్నారు.

బాహుబ‌లి లేదా దురంధ‌ర్ సినిమా ఏదైనా కానీ.. అద్భుత‌మైన భావోద్వేగాలు పండించ‌డం వ‌ల్ల విదేశీ ప్రేక్ష‌కుల‌కు కూడా చేరువ‌య్యాయ‌ని రానా విశ్లేషించారు. అమెరికన్ సంస్కృతిని, చ‌రిత్ర‌ను అక్క‌డి సినిమాల ద్వారా ప్ర‌పంచం తెల‌సుకుంటోంద‌ని, ఇప్పుడు భార‌తీయ సంస్కృతి సాంప్ర‌దాయాలు, మ‌న చ‌రిత్ర‌ను అమెరికా స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న సినిమాల‌తో ప‌రిచ‌యం చేయాల్సి ఉంద‌ని కూడా రానా అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్ప‌టికే మ‌న సినిమాల కార‌ణంగా మ‌న దేశ చ‌రిత్ర గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అవుతోంద‌ని సంతోషించారు. భారతీయ సంస్కృతిని, వీరగాథలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇది సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు.

బాహుబ‌లి, దురంధ‌ర్ లాంటి విజ‌యాలు భార‌త‌దేశం నుంచి స్టార్ల ప‌వ‌ర్ ని కూడా బ‌య‌టి ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసాయని .. ఒక చిత్రం అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించినప్పుడు ప్రపంచ దేశాల దృష్టి సహజంగానే మన మూలాలు, సంస్కృతి, పర్యాటక రంగంపై పడుతుంద‌న‌డంలో సందేహం లేదు. హాలీవుడ్ ప్రభావం వల్ల మనకు విదేశీయుల‌ చరిత్ర, సంస్కృతి తెలిసినట్లుగానే.. మన సినిమాల తో భారతీయ చరిత్రను గ్లోబల్ ఆడియన్స్‌కు అలవాటు చేయవచ్చన‌డంలో సందేహం లేదు. దీనివల్ల విదేశీయుల్లో మన దేశంపై గౌరవం.. మన చారిత్రక కట్టడాల పై కుతూహలం పెరుగుతుంది. త‌ద్వారా మ‌న దేశ‌ టూరిజం అభివృద్ధి చెందుతుంది.

దురంధ‌ర్ లాంటి పాన్ వ‌ర‌ల్డ్ విజయాలు భారతీయ ఫిల్మ్ మేకర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. పాశ్చాత్య ధోరణులను అనుకరించకుండా... మనదైన దేశీయ కథలను హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ - మేకింగ్ వాల్యూస్‌తో చెబితే ప్రపంచం బ్రహ్మరథం పడుతుందని `ధురంధర్ 2` నిరూపించింది. సినీప్ర‌ముఖుల అభిప్రాయం మేర‌కు.. మనదైన‌ గొప్ప చరిత్రను- సాంస్కృతిక వైవిధ్యాన్ని అంతర్జాతీయ వేదికపై సగర్వంగా నిలబెట్టడానికి ఈ బాక్సాఫీస్ రికార్డులు ఒక బలమైన పునాది అన‌డంలో సందేహం లేదు. భవిష్యత్తులో మరిన్ని భారతీయ కథలు ప్రపంచ సినిమా వేదిక‌పై సత్తా చాటుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.