Begin typing your search above and press return to search.

కొత్త ప్లాన్స్ రెడీ చేసుకుంటున్న రానా!

ప్ర‌భాస్ న‌టించిన `బాహుబ‌లి` సినిమాతో ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్న రానా ఆ క్రేజ్‌ని మాత్రం వాడుకోలేక‌పోయాడు.

By:  Ravindar Gorantla   |   16 March 2026 1:00 AM IST
కొత్త ప్లాన్స్ రెడీ చేసుకుంటున్న రానా!
X

ప్ర‌భాస్ న‌టించిన `బాహుబ‌లి` సినిమాతో ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్న రానా ఆ క్రేజ్‌ని మాత్రం వాడుకోలేక‌పోయాడు. ఓ ప‌క్క ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో బాక్సాఫీస్ పై దండ‌యాత్ర చేస్తుంటే రానా మాత్రం సైలెంట్ అయిపోయాడు. సాయి ప‌ల్ల‌వితో క‌లిసి చేసిన `విరాట‌ప‌ర్వం` త‌రువాత రానా నుంచి సోలో హీరోగా ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా రాలేదు. ఆరోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన రానా మ‌ళ్లీ న‌టించ‌డంమొద‌లు పెట్టారు.

అయితే ఈ సారి కొత్త ప్లాన్స్‌తో రెడీ అవుతుండ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. రానా `విరాట‌ప‌ర్వం` త‌రువాత సినిమాలు చేశారు కానీ అవి పూర్తి స్థాయి హీరోగా చేసిన‌వి కాదు. నిఖిల్ హీరోగా న‌టించిన `స్పై`లో నారా కేవ‌లం గెస్ట్ క్యారెక్ట‌ర్‌లో మాత్ర‌మే క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేశారు. ఆ త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా, అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో రూపొందిన `వెట్ట‌యాన్‌`లో విల‌న్‌గా క‌నిపించారు. మిరాయ్‌, పరాశ‌క్తి వంటి చిత్రాల్లో అతిథి పాత్ర‌ల్లో మాత్ర‌మే మెరిసారు.

ఇక దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా, భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా రూపొందిన పీరియ‌డ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `కాంత‌`లో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించి నిరాశ‌ప‌రిచారు. గ‌డిచిన కొన్నేళ్లుగా సినిమాల్లో క‌నిపించ‌డం కంటే చిన్న సినిమాలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు అండ‌గా నిలుస్తూ వాటిని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తూ బిజినెస్ సైడ్ చాలా యాక్టీవ్ అయిపోయారు. గార్గి, ప‌రేషాన్‌, కీడాకోలా, 35 చిన్న క‌థ కాదు, జిగ్రా, కొత్త‌ప‌ల్లిలో ఒక‌ప్పుడు, ప్రేమంటే వంటి సినిమాల‌కు ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

అయితే ఇప్పుడు సినిమాల్లో న‌టించ‌డం కంటే ఫిల్మ్ బిజినెస్‌, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు అండ‌గా నిలుస్తూ రిలీజ్ చేయ‌డం పైనే రానా ఫోక‌స్ పెడుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా మ‌ల్టీపుల్ బ్రాండ్‌ల‌పై భారీగా ఇన్వెస్ట్ చేయాల‌నే ప్లాన్‌లో రానా ఉన్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇటీవ‌ల రానా కొన్ని సినిమాలు సైన్ చేసినా అవి ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్‌కు వెళ్ల‌క‌పోవ‌డం, తేజా స‌జ్జ‌తో క‌లిసి చేయాల‌నుకున్న సినిమా కూడా ప‌ట్టాలెక్క‌క‌పోవ‌డంతో రానా ఫోక‌స్ బిజినెస్‌పై ప‌డిన‌ట్టుగా చెబుతున్నారు.

తండ్రి సురేష్ బాబు త‌ర‌హాలో కంటెంట్ బేస్డ్ సినిమాల‌కు అండ‌గా నిలుస్తూ కొత్త కొత్త టాలెంట్‌ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. మ‌రీ ముఖ్యంగా చిన్న సినిమాలని ప్రోత్స‌హిస్తూ మ‌రిన్ని కాన్సుప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని, త‌ద్వారా మంచి సినిమాల‌ని ఇండ‌స్ట్రీకి అందించాల‌నే ప్లాన్‌లో రానా ఉన్నార‌ని, అంతే కాకుండా ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఐలైన్ స్టూడియోస్‌ని ప్రారంభించ‌డం తెలిసిందే. దీంతో క‌లిసి ప‌ని చేయ‌బోతున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అందులో భాగంగానే ఇటీవ‌ల ఐలైన్ స్టూడియో ప్రారంభోత్స‌వంలో రానా పాల్గొన్నార‌ని చెబుతున్నారు.