నా వల్ల కాదని అడ్వాన్స్‌లు వెనక్కి ఇచ్చాను
బాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో భల్లాలదేవుడిగా రానాకి మంచి క్రేజ్ దక్కింది. బాహుబలి 2 తర్వాత రానా పాన్ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు.
By: Ramesh Palla | 19 Feb 2026 11:00 PM ISTతెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన రానా దగ్గుబాటి కెరీర్ గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది. నటుడిగా మంచి విజయాలు వచ్చిన సమయంలో వెంట వెంటనే ఆయన సినిమాలు చేయడం లేదు, నిర్మాతగా అప్పుడప్పుడు చిన్న సినిమాలను విడుదల చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక టాక్ షో లతో టాలీవుడ్ హీరోల్లో తన శైలి చాలా విభిన్నం అని నిరూపించుకున్నాడు. ఇలా రానా చాలా వైవిధ్యభరితమైన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు అనడంలో సందేహం లేదు. అయితే నటుడిగా ఎందుకు రానా ఎక్కువ కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు, మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సినిమాలు ఎక్కువ చేయక పోవడానికి కారణం ఏంటి అని సామాన్య ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అందుకు కారణం తన అనారోగ్య సమస్యలు అని రానా తాజాగా ఒక టాక్ షో లో క్లారిటీ ఇచ్చాడు. తాను తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు రానా చెప్పుకొచ్చాడు.
చాప్టర్ 2 టాక్ షో లో హీరో రానా
హీరోయిన్ రియా చక్రవర్తి ఈ మధ్య కాలంలో మొదలు పెట్టిన టాక్ షో చాప్టర్ 2 లో రానా పాల్గొన్నాడు. ఇటీవలే ఆ రానా పాల్గొన్న చాప్టర్ 2 ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. అప్పటి నుంచి రానా గురించి చాలా తెలియని విషయాలు జనాలకు తెలిశాయి. రానాను పదేళ్లుగా చూస్తున్నాను అంటూ రియా చక్రవర్తి చెప్పుకొచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ముంబై కి ఒక హాట్ గై వచ్చాడని బాలీవుడ్ లో చర్చ జరిగేదని రియా చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో రానాకు మంచి క్రేజ్ ఉండేదని, ఆయన చేసిన సినిమాల వల్లే కాకుండా లుక్ కారణంగా, పరిచయాల కారణంగా రానా తల్చుకుంటే చాలా పెద్ద సినిమాలు, ఎక్కువ సంఖ్యలో చేసే అవకాశం ఉండేది. కానీ రానా ఆచితూచి అన్నట్లుగా సినిమాలు ఎంపిక చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌కి దూరం కావడానికి పూర్తిగా అనారోగ్య సమస్యలు అంటూ స్వయంగా రానా ఈ టాక్ షో లో తెలియజేశాడు.
రియా చక్రవర్తి హోస్ట్‌గా టాక్ షో...
బాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో భల్లాలదేవుడిగా రానాకి మంచి క్రేజ్ దక్కింది. బాహుబలి 2 తర్వాత రానా పాన్ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు. హీరోగా లేదా విలన్‌గా ఏదో ఒక రకంగా ఫుల్ బిజీగా రానా ఉంటాడు అనుకున్నారు. కానీ ఆ సమయంలో రానా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అంతే కాకుండా గుండె సంబంధించిన సమస్యలు, కంటి సమస్యలు ఇలా పలు అనారోగ్య సమస్యల కారణంగా ఏకంగా ఏడాది పాటు అమెరికాలో ఉండి అత్యంత కష్టమైన ట్రీట్‌మెంట్‌ను తీసుకోవాల్సి వచ్చిందని రానా చెప్పుకొచ్చాడు. అనారోగ్య సమస్యల కారణంగా తీసుకున్న ఆహారం, ఇతర అలవాట్ల కారణంగా నా లుక్ మొత్తం మారి పోయింది. దాంతో అప్పటికే తీసుకున్న అడ్వాన్స్ లను తిరిగి ఇచ్చి, ఇప్పట్లో సినిమాలను చేయడం తన వల్ల కాదని వారికి చెప్పినట్లు రానా అన్నాడు.
కాంత సినిమాతో రానా రీ ఎంట్రీ
గతంలో మాదిరిగా నేను ఇకపై హాట్ గై గా కనిపించడం సాధ్యం కాదు, కనుక నాతో సినిమా అంటే రిస్క్ అనే ఉద్దేశంతో నిర్మాతలు అందరికీ అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో వచ్చిన చాలా సబ్జెక్ట్ లు నా ఫిజిక్ కి సంబంధించిన కథలు ఉన్నాయి. అందుకే సినిమాలను కాస్త హోల్డ్‌లో పెట్టినట్లు రానా షో లో పేర్కొన్నాడు. ఏడాది తర్వాత ఇండియాకు వచ్చిన సమయంలో నన్ను చూసి చాలా మంది షాక్ అయ్యారు. రానా పూర్తిగా కోలుకుని తిరిగి సినిమాలతో బిజీ అయ్యేందుకు సిద్ధం అయ్యాడు. గత ఏడాది కాంత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మరో వైపు కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రానా మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా పాన్ ఇండియన్ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీగానే ఉన్నాడు. ఇన్నాళ్ల గ్యాప్ ను రానా ఫిల్ చేసేందుకు ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాదిలో రానా నుంచి సినిమాలు మాత్రమే కాకుండా సిరీస్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
