Begin typing your search above and press return to search.

ఆ విషయంలో రానా కంటే తోపు ఎవరు లేరట!

నిజానికి రానా కేవలం నటనకే పరిమితం కాకుండా, ఒక పక్కా కార్పొరేట్ మైండ్‌ సెట్‌తో ఆలోచిస్తారు.

By:  M Prashanth   |   17 March 2026 5:51 PM IST
ఆ విషయంలో రానా కంటే తోపు ఎవరు లేరట!
X

టాలీవుడ్ లో ఒక హీరోగా కంటే కూడా ఒక గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ లాగా రానా దగ్గుబాటి చేసే పనులు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. సాధారణంగా ఒక హీరో అంటే కేవలం షూటింగ్, డబ్బింగ్, ప్రమోషన్లకే పరిమితం అవుతారు. కానీ రానా రూటే వేరు. సినిమా ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అతను నిర్మించుకున్న నెట్‌వర్క్ చూస్తుంటే అగ్ర నిర్మాతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. సౌత్ ఇండియాలో మరే హీరోకి లేనన్ని పరిచయాలు, వ్యాపార సంబంధాలు కేవలం ఈ ‘భల్లాలదేవుడికి’ మాత్రమే సొంతమని ఫిలిం నగర్ టాక్.

నిజానికి రానా కేవలం నటనకే పరిమితం కాకుండా, ఒక పక్కా కార్పొరేట్ మైండ్‌ సెట్‌తో ఆలోచిస్తారు. నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి అంతర్జాతీయ సంస్థలతో డీల్స్ కుదుర్చుకోవడంలో రానా తర్వాతే ఎవరైనా. మార్కెటింగ్ స్కిల్స్ లో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా కమర్షియల్ ఐడియా వస్తే, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఏ ప్లాట్‌ఫారమ్‌లో ఉంచాలి అనే విషయంలో రానాకు ఉన్న క్లారిటీ మరెవరికీ ఉండదు.

రానా ఒక కథను నమ్మి సపోర్ట్ చేస్తే, అది కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందనే బలమైన నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. అందులో కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాలున్నాయి. ఇక రానా నటనకు గుడ్ బై చెప్పి పూర్తిస్థాయిలో నిర్మాతగా మారిపోతారనే వార్తల్లో కూడా వాస్తవం లేదు. ప్రస్తుతం చేతిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయి. అందులో ఒక కొత్త దర్శకుడితో అలాగే మరో సీనియర్ డైరెక్టర్ తో కూడా డిఫరెంట్ సినిమాలు లైన్లో పెడుతున్నాడు.

ఒకవైపు నటుడిగా బిజీగా ఉంటూనే, మరోవైపు తన ప్రొడక్షన్ పనులను చక్కబెడుతున్నారు. ఒక యంగ్ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం.. రానాకున్న నెట్‌వర్క్ ముందు దిగ్గజ నిర్మాతల కాంటాక్ట్స్ కూడా కొన్నిసార్లు సరిపోవట. అంతలా సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి మూలలో రానా తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా తమిళ, మలయాళ బాలీవుడ్ ఇండస్ట్రీల్లో రానాకున్న హోల్డ్ అద్భుతం. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేయడం, కొత్త టెక్నాలజీని టాలీవుడ్‌కు పరిచయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు.

లీడర్ కంటే ముందే రానా విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ పెట్టాడు. అలాగే బాహుబలి సినిమా నార్త్ లోకి వెళ్ళడానికి, కరణ్ జోహార్ ను రాజమౌళికి పరిచయం చేసింది కూడా రానానే. సురేష్ బాబు వారసుడిగా కాకుండా, తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడంలో రానా సక్సెస్ అయ్యారు. అందుకే ఏ పెద్ద సమస్య వచ్చినా లేదా భారీ ప్రాజెక్ట్ సెట్ అవ్వాలన్నా ఇప్పుడు చాలామంది చూపు రానా వైపే మళ్లుతోంది.

సినిమా మేకింగ్‌లో రానా చూపిస్తున్న ఈ మల్టీ టాలెంట్ భవిష్యత్తులో టాలీవుడ్ స్థాయిని మరిన్ని మెట్లు ఎక్కించేలా ఉంది. నటుడిగా మంచి పాత్రలు ఎంచుకుంటూనే, ఒక విజనరీ నిర్మాతగా పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి దగ్గుబాటి వారసుడు కేవలం వెండితెరపైనే కాదు, వెనుక ఉండి నడిపించే వ్యాపార ప్రపంచంలో కూడా అసలైన 'బాహుబలి' అనిపించుకుంటున్నారు. రానా మార్కెటింగ్ మేధస్సు ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.