నేడు ఈడీ విచారణకు రానా దగ్గుబాటి!
నేడు హీరో రానా దగ్గుబాటిని విచారించనున్నారు. మరికొద్ది సేపట్లో రానా దగ్గుబాటి ఈడీ కార్యాలయానికి చేరుకోబోతున్నట్లు సమాచారం.
By: Madhu Reddy | 11 Aug 2025 10:46 AM ISTబెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో సినీ పరిశ్రమ నుండి దాదాపు 29 మంది సెలబ్రిటీలపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీని ఆధారంగానే ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. అందులో భాగంగానే ఇప్పటికే ప్రకాష్ రాజ్ , విజయ్ దేవరకొండ వంటి స్టార్ సెలబ్రిటీలను విచారించిన అధికారులు.. నేడు హీరో రానా దగ్గుబాటిని విచారించనున్నారు. మరికొద్ది సేపట్లో రానా దగ్గుబాటి ఈడీ కార్యాలయానికి చేరుకోబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ విచారణలో మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపట్టిన ఈడీ.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా సదరు యాప్ ల నుంచి తీసుకున్న లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ని కూడా తీసుకురావాలని హీరో రానా దగ్గుబాటికి ఆదేశాలు జారీ చేశారట. ప్రస్తుతం ఈ బ్యాంకు స్టేట్మెంట్ తో ఈడీ విచారణకు హాజరుకానున్న రానా దగ్గుబాటి.. విచారణలో ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రానా దగ్గుబాటిని ఈడీ అధికారులు ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు..? ఆ ప్రశ్నలకు రానా ఎలాంటి సమాధానం ఇవ్వనున్నారు? అనే విషయం ఇప్పుడు ఉత్కంఠ గా మారింది. ఇకపోతే ఆగస్టు 13వ తేదీన మంచు వారసురాలు మంచు లక్ష్మీ కూడా ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
ఇదిలా ఉండగా ఇదివరకే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రకాష్ రాజ్ ఈడీ అధికారుల ముందు హాజరైన విషయం తెలిసిందే. ఇకపై తాను ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని, హానికరమైన వ్యాపారాల ప్రమోషన్ల విషయంలో అసలు జోక్యం చేసుకోనని విచారణ అనంతరం మీడియాతో తెలిపిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ కూడా పలు కామెంట్లు చేశారు. తాను ఎలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయలేదని, తాను ప్రమోషన్ చేసింది కేవలం గేమింగ్ యాప్ లను మాత్రమేనని, అన్ని అనుమతులు, లీగల్ గా కొనసాగుతున్న గేమింగ్ యాప్ ప్రమోషన్ లో మాత్రమే తాను పాల్గొన్నానని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. అయినా సరే విచారణకు హాజరయ్యి పూర్తిగా సహకరిస్తానని,గత 6వ తేదీన విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ.. మీడియా ముందు ఈ విషయాలను స్పష్టం చేశారు. ఇకపోతే మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన తెలిపారు.అందరి విచారణలు పూర్తయిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది..
ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా 29 మంది సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అంతేకాదు 19కి పైగా బెట్టింగ్ యాప్ యజమానులపై కూడా సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. వీరందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు విచారణకు హాజరై పలు విషయాలు తెలియజేస్తున్నట్లు సమాచారం.
