ఆ సంఘటనను నా లైఫ్ లో మర్చిపోలేను
సినిమాలు, సినీ ఆర్టిస్టుల జీవితాలు ఎప్పుడూ అనుకున్న విధంగా ఉండవు. సినిమాల కోసం వారెంతో కష్టపడాల్సి వస్తుందనే సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 11 Dec 2025 10:00 PM ISTసినిమాలు, సినీ ఆర్టిస్టుల జీవితాలు ఎప్పుడూ అనుకున్న విధంగా ఉండవు. సినిమాల కోసం వారెంతో కష్టపడాల్సి వస్తుందనే సంగతి తెలిసిందే. కొన్ని సార్లు కష్టాలు మాత్రమే కాదు, ఎన్నో సమస్యలు, ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆర్టిస్టులు తమ ఇబ్బందుల్ని అదే సమయంలో బయటపెట్టకపోయినా సందర్భమొచ్చినప్పుడు అవి బయటికొస్తూ ఉంటాయి.
అలాంటి ఓ సందర్భాన్ని రీసెంట్ గా రానా దగ్గుబాటి వెల్లడించారు. రానా ఓ వైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంటున్నారు. అంతేకాకుండా తనవద్దకు వచ్చిన మంచి కథలను ఎంపిక చేసుకుని నిర్మాతగానూ రాణిస్తూ కెరీర్లో ముందుకెళ్తున్న రానా, ఎవరైనా తమ సినిమా ఈవెంట్లకు గెస్టుగా పిలిస్తే హాజరై సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పి వస్తుంటారనే సంగతి తెలిసిందే.
రీసెంట్ గా ఓ సినీ ఈవెంట్ లో పాల్గొన్న రానా తన లైఫ్ లో జరిగిన ఓ మర్చిపోలేని సంఘటనను షేర్ చేసుకున్నారు. రానా, విష్ణు విశాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అరణ్య మూవీ షూటింగ్ ను ఎక్కువగా అడవిలోనే చేశారు. ఆ షూటింగ్ టైమ్ లో కొన్ని సీన్స్ ను ఏనుగులతో చేయాల్సి ఉండటంతో ఏనుగులుండే ప్రాంతంలోనే షూట్ చేశామని, షూటింగ్ కు ముందే అక్కడి వాళ్లు సాయంత్రానికి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారన్నారు రానా.
అడవి అంత భయంకరంగా ఉంటుందని అప్పుడే తెలిసింది కానీ ఒకరోజు షూటింగ్ లేట్ అవడం వల్ల రాత్రి వరకు అక్కడే ఉండాల్సి వచ్చిందని, సడెన్ గా అక్కడి వారంతా గబా గబా వెళ్లిపోతుండటం చూసి ఏమైందని చూస్తే ఏనుగులు తమ వైపుకే రావడం చూశానని, దీంతో అందరూ ఏనుగులకు కనిపించకుండా మూడు గంటల పాటూ చెట్ల వెనుక దాక్కుని ఎలాంటి శబ్ధం చేయకుండా ఉన్నామని, అడవి అంత భయంకరంగా ఉంటుందని తనకు అప్పుడే తెలిసిందని రానా చెప్పుకొచ్చారు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా అడివిని, ఏనుగులను కాపాడే పాత్రలో నటించి మెప్పించగా, మంచి మెసేజ్ తో రూపొందిన అరణ్యకు ఆడియన్స్ నుంచి కూడా మంచి ప్రశంసలొచ్చాయి. రానా విషయానికొస్తే రీసెంట్ గా కాంత మూవీలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
