Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌లో త‌న‌ని చూసుకున్నాడా?

`బాహుబ‌లి` వంటి పాన్ ఇండియా మూవీతో ప్ర‌పంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న హీరో రానా ద‌గ్గుబాటి.

By:  Ravindar Gorantla   |   19 Feb 2026 11:09 AM IST
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌లో త‌న‌ని చూసుకున్నాడా?
X

`బాహుబ‌లి` వంటి పాన్ ఇండియా మూవీతో ప్ర‌పంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న హీరో రానా ద‌గ్గుబాటి. సినిమా కోసం బాడీ ప‌రంగా క‌ఠోరంగా శ్ర‌మించి మ్యాచో మ్యాన్ లుక్‌లో క‌నిపించి అంద‌రిని భ‌ల్లాల దేవ‌గా ఆక‌ట్టుకున్నారు. ఈ మూవీ తెలుగు సినిమా స్వ‌రూపాన్నే స‌మూలంగా మార్చేసి ప్ర‌పంచ య‌వ‌నిక‌పై స‌గ‌ర్వంగా నిల‌బెట్టింది. ఈ మూవీ త‌రువాత రానా క్రేజ్ ప‌తాక స్థాయికి చేరింది. అయితే ఆ స్థాయిలో మాత్రం త‌ను సినిమాలు చేయ‌లేక‌పోతున్నారు. పాన్ ఇండియా స్థాయి సినిమాల‌కు శ్రీ‌కారం చుట్టిన రానా క్ర‌మ క్ర‌మంగా సినిమాలు త‌గ్గిస్తూ వ‌స్తున్నారు.

దీనిపై రానా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక విష‌యాల్ని పంచుకున్నారు. అన్నింటిక‌న్నా ఆరోగ్యం ముఖ్య‌మ‌ని తెలిపారు. `నాకు ఆరోగ్య స‌మ‌స్య ఉంద‌ని తెలిసిన‌ప్పుడు షాక్ అయ్యాను. స‌ర్జ‌రీ కోసం యూఎస్ వెళ్లాను. కుటుంబాన్ని వదిలేసి అక్క‌డే కొన్ని రోజులు ఉన్నాను. నేను ఫ్యామిలీకి దూరంగా ఒంట‌రిగా ఉండ‌టం అదే తొలిసారి. నేనెవ‌రు? అన్న ప్ర‌శ్న‌కు అప్ప‌డే స‌మాధానం ల‌భించింది. అప్ప‌టి నుంచి జీవితాన్ని కొత్త‌గా చూస్తున్నా. ఆరోగ్య స‌మ‌స్య గురించి తెలిశాక అప్ప‌టికే అంగీక‌రించిన ప్రాజెక్ట్‌ల‌ని కొన్నింటిని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది.

వాటిలో రెజ్ల‌ర్ స్టోరీ కూడా ఒక‌టి. శ‌రీరాకృతిలో మార్పులు రావ‌డం వ‌ల్ల ఆ క‌థ‌ల‌కు నేను స‌రిపోన‌ని అర్థ‌మైంది. అందుకే తీసుకున్న అడ్వాన్స్‌ను నిర్మాత‌ల‌కు తిరిగి ఇచ్చేశా. యూఎస్ నుంచి భార‌త్‌కు వ‌చ్చేట‌ప్పుడు ఓ ఇమిగ్రేష‌న్ అధికారి న‌న్ను గుర్తుప‌ట్టి `కింగ్ భ‌ల్లాల దేవ‌` అని అన‌డం మ‌ళ్లీ `బాహుబ‌లి` రోజుల‌ని గుర్తు చేసింది` అంటూ ఆనందం వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

నా ఫ్రెండ్ వ‌రుణ్‌తేజ్ ఒక రోజు న‌న్ను ప‌రామ‌ర్శించ‌డానికి వ‌చ్చాడు. అత‌ను కూడా నాలాగే మంచి హైట్‌తో ఫిట్‌గా ఉంటాడు. ఆ రోజు న‌న్ను నేను అత‌డిలో చూసుకున్నా. నేను చేయాల్సిన సినిమాల‌ను వ‌రుణ్‌కు ఇచ్చేద్దామా? అనిపించింది` అని చెప్పుకొచ్చారు. `బాహుబ‌లి` త‌రువాత వ‌చ్చిన క్రేజ్‌ని రానా పూర్తి స్థాయిలో ఉప‌యోగించుకోలేద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. కార‌ణం ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌లే. ఆ కార‌ణంగానే ఆయ‌న సినిమాలు త‌గ్గించుకుంటూ వ‌స్తున్నారు.

గ‌త కొంత కాలంగా `విరాట‌ప‌ర్వం` త‌రువాత అంత యాక్టీవ్‌గా సోలో హీరోగా సినిమాలు చేయ‌డం లేదు. ర‌జ‌నీ `వేట్ట‌యాన్‌`లో విల‌న్‌గా న‌టించిన రానా ఆ త‌రువాత నిఖిల్ `స్పై`, తేజ స‌జ్జ `మిరాయ్‌`, దుల్క‌ర్ స‌ల్మాన్ `కాంత‌, శివ‌కార్తికేయ‌న్ `ప‌రాశ‌క్తి ` వంటి సినిమాల్లో కీల‌క అతిథి పాత్ర‌ల్లో మాత్ర‌మే మెరిసారు. నిర్మాత‌గా చిన్న సినిమాల‌కు అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. త్వ‌ర‌లో సెట్స్‌పైకి రానున్న `జై హ‌నుమాన్‌`లో రిష‌భ్ శెట్టితో క‌లిసి న‌టించ‌బోతున్నారు. త్వ‌ర‌లో దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది.