Begin typing your search above and press return to search.

హాలీవుడ్ కూడా టాలీవుడ్ బాట ప‌డుతోంది!

సాధారణంగా తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు స్థానిక రౌడీలు .. గ్యాంగ్‌స్టర్ల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ `రణబాలి` చిత్రంలో విలనిజం హద్దులు చెరిపేసి గ్లోబల్ లెవెల్‌లో ఉండబోతోందని తెలుస్తోంది.

By:  Srikanth Kontham   |   25 July 2026 12:20 PM IST
హాలీవుడ్ కూడా టాలీవుడ్ బాట ప‌డుతోంది!
X

ప్ర‌స్తుతం టాలీవుడ్ ప్రాంతీయ హద్దులను చెరిపేస్తూ ప్రపంచ స్థాయి చిత్రాలను తెర‌కెక్కించ‌డానికి ఎంతో ఆస‌క్తిగా ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విదేశీ నటులు చిన్నపాటి అతిథి పాత్రల్లో లేదా డాన్సర్లుగా మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. టాలీవుడ్ దర్శక నిర్మాతల ఆలోచనా విధానం గ్లోబల్ రేంజ్‌కు వెళ్ళింది. దీనికి నిదర్శనంగా `రణబాలి` చిత్రం నిలుస్తోంది. ఈ చిత్రంలో హాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ప్రముఖ నటుడు అరంగేట్రం చేస్తుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్ సంపాదించుకున్న కల్ట్ హాలీవుడ్ మూవీ `ది మమ్మీ` ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ `రణబాలి` చిత్రంలో పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు. ఆయనలాంటి ఇంటర్నేషనల్ స్టార్ తెలుగు తెరపై విలన్‌గా కనిపించడం అంటే సాధారణ విషయం కాదు. టాలీవుడ్ మేకర్స్ ఆలోచనలు ఏ స్థాయిలో విస్తరిస్తున్నాయో? చెప్పడానికి ఈ కాంబినేషనే అతిపెద్ద ఉదాహరణ. హాలీవుడ్ విలన్ ఎంట్రీతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్నాయి.

సాధారణంగా తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు స్థానిక రౌడీలు .. గ్యాంగ్‌స్టర్ల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ `రణబాలి` చిత్రంలో విలనిజం హద్దులు చెరిపేసి గ్లోబల్ లెవెల్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. ఆర్నాల్డ్ వోస్లూ పోషించే పాత్ర కేవలం పేరుకు మాత్రమే కాకుండా కథను మలుపు తిప్పే అత్యంత క్రూరమైన పాత్రగా ఉండ నుందని సమాచారం. ఆర్నాల్డ్ స్క్రీన్ ప్రెజెన్స్, హావభావాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ‌ని టీమ్ ధీమా వ్య‌క్తంచేస్తుంది.

ఇలా హాలీవుడ్ నటులను తెలుగు సినిమాలకు రప్పించడం ద్వారా ఇక్క‌డి చిత్రాలకు గ్లోబల్ మార్కెట్‌లో తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. విదేశీ ప్రేక్షకులను కూడా తెలుగు సినిమాల వైపు ఆకర్షించడానికి ఇదొక అద్భుతమైన వ్యూహం. టాలీవుడ్ ఇప్పుడు భారతదేశాన్ని మాత్రమే కాకుండా హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్.. నటీనటులతో ప్రపంచ ప్రేక్షకులను టార్గెట్ చేస్తోంది. `రణబాలి` సినిమాతో ఈ ట్రెండ్ మరింత ఊపందు కుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరింది. ఒకవైపు తెలుగు హీరోల మాస్ ఇమేజ్, మరోవైపు హాలీవుడ్ విలన్ ఇంటెన్స్ యాక్షన్ కలబోత తెరపై ఎలా ఉండబోతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఈ సినిమా కోసం పెడుతున్న ఖర్చు, పడుతున్న తపన సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్తుంద్రి అనడంలో అతిశయోక్తి లేదు.

హాలీవుడ్ బాట పడుతున్న టాలీవుడ్ ప్రయాణంలో `రణబాలి` మైలురాయిగా నిలిచే ఛాన్స్ ఉంది. ఆర్నాల్డ్ వోస్లూ ఎంట్రీతో చిత్రం గ్లోబల్ సినిమాగా రూపాంతరం చెందుతోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఏ స్థాయికి ఎదిగిందో? చాటి చెప్పే చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.