అత్యాచారం చేసి చంపేస్తామని నటికి బెదిరింపులు!
సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి సినిమాల్లో నటించిన కన్నడ భామ, పొలిటీషియన్ దివ్య స్పందన అలియాస్ రమ్య, కన్నడ స్టార్ దర్శన్ ఫ్యాన్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు
By: Sravani Lakshmi Srungarapu | 28 July 2025 6:52 PM ISTసూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి సినిమాల్లో నటించిన కన్నడ భామ, పొలిటీషియన్ దివ్య స్పందన అలియాస్ రమ్య, కన్నడ స్టార్ దర్శన్ ఫ్యాన్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. గతంలో హీరోయిన్ పవిత్ర గౌడపై అసభ్యంగా కామెంట్స్ చేశాడనే రీజన్ తో రేణుకా స్వామి అనే అభిమానిని ఎంతో క్రూరంగా చంపి, హత్య చేశాడనే ఆరోపణలు దర్శన్ పై ఉన్న విషయం తెలిసిందే.
బెయిల్ పై బయటికొచ్చిన దర్శన్
రేణుకా స్వామిని తన మనుషులతో కొట్టించడం, హింసించడం లాంటివి సీసీటీవీ లో రికార్డవడంతో దర్శన్, ప్రస్తుతం ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే కొన్నాళ్ల కిందట దర్శన్ బెయిల్ మీద బయటికొచ్చి థాయ్‌లాండ్ ట్రిప్ ను ముగించుకుని వచ్చాడు. ఇక అసలు విషయానికొస్తే దర్శన్ ఫ్యాన్స్ తనను, తన పిల్లల్ని కూడా వదలకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, రేప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని నటి రమ్య ఆరోపించారు.
రమ్యకు బెదిరింపు మెసేజ్‌లు
రేణుకా స్వామికి, దర్శన్ ఫ్యాన్స్ కు ఎలాంటి తేడా లేదని, రోజూ కొంతమంది ఫ్యాన్స్, రేప్ చేసి చంపేస్తామని తనను వేధిస్తున్నారని, ఆడవాళ్లను వేధించడం ఓ అలవాటుగా మారిపోయిందని అన్నారు. ఇప్పటికే ఈ బెదిరింపులపై తాను తన లాయర్ ను కలిసి డిస్కస్ చేశానని, తనకు వచ్చిన బెదిరింపుల మెసేజ్‌లను పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని రమ్య వెల్లడించారు.
సోషల్ మీడియాను ఇలా వాడటం బాధాకరం
ఈ కామెంట్స్ మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తాయని చెప్పిన రమ్య, డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను ఇలా వాడటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్ లైన్ లో అత్యాచార బెదిరింపులు రావడం దారుణమని రమ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. రేణుకాస్వామి హత్య కేసుపై రమ్య ఓ పోస్ట్ పెట్టగా, ఆ పోస్ట్ పైనే దర్శన్ ఫ్యాన్స్ అసభ్యకరంగా స్పందించారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్ ను ఇన్‌స్టాలో షేర్ చేశారు రమ్య.
