అప్పుడు ప్రభాస్‌తో.. ఇప్పుడు అల్లు అర్జున్‌తో?
అయితే ఇప్పుడు రమ్యకృష్ణ అలాంటి మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 16 Aug 2025 6:30 PM ISTబాహుబలి సినిమాలో శివగామిగా నటించిన రమ్యకృష్ణకు ఆ సినిమా తెచ్చిపెట్టిన స్టార్‌డమ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు రమ్య. మాహిష్మతి సామ్రాజ్యాన్ని తన మాటతో శాసించిన రమ్యకృష్ణకు ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఏది పడితే అది ఒప్పుకోకుండా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి మరీ సినిమాలను ఎంపిక చేసుకున్నారు.
ఏఏ22లో పవర్‌ఫుల్ పాత్ర కోసం
అయితే ఇప్పుడు రమ్యకృష్ణ అలాంటి మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. ఏఏ22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ పాత్ర చాలా పవర్‌ఫుల్ గా ఉంటుందని, ఆ పాత్రకు రమ్య అయితేనే న్యాయం చేస్తారని పట్టుబట్టి మరీ అట్లీ ఆమెను ఒప్పించారని తెలుస్తోంది.
హీరోయిన్లుగా పలువురి పేర్లు
ఇప్పటికే బడ్జెట్ పరంగా ఏఏ22 అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే ఇప్పుడు క్యాస్టింగ్ విషయంలో కూడా అంచనాలను మించుతోంది ఈ సినిమా. ఆల్రెడీ దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, రష్మిక, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే కూడా సినిమాలో నటించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఈ హీరోయిన్లలో ఇప్పటివరకు ఇద్దరి పేర్లు మాత్రమే అఫీషియల్ గా బయటికి రాగా మిగిలినవి రోజుకో లీకు రూపంలో వస్తున్నాయి.
బన్నీకి తల్లిగా శివగామి?
ఇక రమ్యకృష్ణ పాత్ర విషయానికొస్తే ఏఏ22లో రమ్య, బన్నీకి తల్లిగా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే నిజమైతే బన్నీ, రమ్య కలిసి చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. అట్లీ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే రమ్య ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుందని సమాచారం. ఆల్రెడీ ముంబై షెడ్యూల్ ను ఫినిష్ చేసిన అట్లీ తర్వలోనే నెక్ట్స్ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు.
రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో..
వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి 2026లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అట్లీ చూస్తున్నారట. సినిమాకు సంబంధించిన ముప్పాతిక భాగం షూటింగ్ అయినా పూర్తయ్యాకే రిలీజ్ డేట్ విషయంలో డెసిషన్ తీసుకోవాలని అప్పటివరకు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా షూటింగ్ ను పూర్తి చేయాలని మేకర్స్ డిసైడయ్యారట. పుష్ప2 తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.
