ఇప్పుడు వదలకపోతే.. పెళ్లి జరగదు.. నన్ను వదిలేయండి ప్లీజ్!
‘సింహాద్రి’లో ఎన్టీఆర్ సరసన ఐటమ్ సాంగ్ షూటింగ్ సమయంలో తన పెళ్లికి ఒక్కరోజే ఉందని, షూటింగ్ నుంచి విడిచిపెట్టాలని రాజమౌళిని వేడుకున్నానని నటి రమ్యకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆమె, దర్శకుడు కృష్ణవంశీతో విడాకులు తీసుకున్నారనే ప్రచారాన్ని ఖండించారు. వృత్తిపరమైన, కుటుంబ కారణాలతో చెన్నై, హైదరాబాద్‌లో వేర్వేరుగా ఉంటున్నామని, తమ బంధం బాగానే ఉందని స్పష్టం చేశారు.
By: Sivaji Kontham | 16 Nov 2026 5:00 PM ISTనటి రమ్యకృష్ణ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన సినీ జీవితానికి సంబంధించిన అరుదైన .. ఆసక్తికరమైన విషయాలను బహిరంగంగా షేర్ చేసుకున్నారు. ఆరోజుల్లో సెట్లో నటీమణులకు ఉండే అసౌకర్యాలు, ఆందోళనల గురించి కూడా ఓపెనయ్యారు. నేటి జనరేషన్ నటీమణులు అదృష్టవంతులు అని కూడా అన్నారు. ఇంకా చాలా విషయాలపై తాజా పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సినిమా `సింహాద్రి` చిత్రంలో ఎన్టీఆర్ సరసన చేసిన `చిన్నదమ్మే చీకులు కావాలా...?` ఐటమ్ సాంగ్ షూటింగ్ తాలూకు అనుభవాలను ఈ సీనియర్ నటి గుర్తుచేసుకున్నారు. బాహుబలికి ముందే రాజమౌళి చిత్రాల్లో తాను చేసిన ఈ ప్రత్యేక పాట తన కెరీర్లో ఎంత ముఖ్యమైనదో వెల్లడించారు.
ఈ పాట చిత్రీకరణ సమయంలోనే తన వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా సమాంతరంగా జరుగుతున్నాయని రమ్యకృష్ణ తెలిపారు. తన పెళ్లికి సరిగ్గా ఒక్క రోజు మాత్రమే సమయం ఉందనగా కూడా తాను సెట్లో ఎంతో బిజీగా షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చిందని రమ్యకృష్ణ ఉద్వేగభరితంగా చెప్పారు. సెట్లోని అందరికీ ఆ విషయం తెలుసని.. చివరికి తాను రాజమౌళి గారితో ``అసలు ఇప్పుడు ఈ షూటింగ్ వదలకపోతే.. నా పెళ్లి జరగదు, ప్లీజ్ నన్ను వదిలేయండి`` అని బ్రతిమలాడాల్సి వచ్చిందని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. ఆ క్షణాలు తన జీవితంలో ఎప్పటికీ మరుచిపోలేనని పేర్కొన్నారు.
దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకున్న తర్వాత కూడా నటిగా రమ్యకృష్ణ కెరీర్‌కు ఏమాత్రం బ్రేక్ పడలేదు. ఒకవైపు చెన్నైలో రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలతో పాటు.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగానే గడుపుతున్నారు. అయితే కొద్దికాలంగా కృష్ణవంశీకి, రమ్యకృష్ణకు మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఆ వార్తలన్నింటినీ రమ్యకృష్ణ అదే పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పూర్తిగా ఖండించారు. తాము విడాకులు తీసుకోలేదని.. ఇప్పటికీ భార్యాభర్తలుగానే ఉన్నామని స్పష్టతనిచ్చారు.
వృత్తిపరమైన వ్యవహారాలు.. కుటుంబ బాధ్యతలు.. ముఖ్యంగా తమ కుమారుడి చదువు నిమిత్తం తాము భార్యాభర్తలుగా వేర్వేరు నగరాలైన చెన్నై, హైదరాబాద్ లో నివసించాల్సి వస్తోందని.. తమ మధ్య బంధం మాత్రం ఎప్పుడూ చెక్కుచెదరలేదని రమ్యకృష్ణ చెప్పారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్నామని... ఈ ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ తప్పడం లేదని అన్నారు. ప్రస్తుతం తాము మంచి స్నేహితులుగా ఉంటున్నామని ఆనందంగా తెలిపారు.
ఇక ప్రస్తుత సినిమాల విషయానికొస్తే... రమ్యకృష్ణ 2026 సంవత్సరంలోనూ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాకా, డేవిడ్ రెడ్డి, లబ్బర్ పండు లాంటి చిత్రాలతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ సీనియర్ నటిగా బిజీ బిజీగా ఉన్నారు. వరుసగా భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న `జైలర్ 2` చిత్రంలో మరోసారి తనదైన నటనతో అలరించిన విషయం తెలిసిందే.
