Begin typing your search above and press return to search.

ఆ న‌లుగురు టాలీవుడ్ 'మినార్‌'లు: CM రేవంత్ రెడ్డి

తెలుగు చిత్ర పరిశ్రమ తరలివచ్చిన తర్వాత అది ఇక్కడ పటిష్టంగా వేళ్లూనుకోవడానికి దివంగత రామోజీరావు చేసిన కృషిని రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా స్మరించుకున్నారు.

By:  Sivaji Kontham   |   20 March 2026 9:28 AM IST
ఆ న‌లుగురు టాలీవుడ్ మినార్‌లు: CM రేవంత్ రెడ్డి
X

హైదరాబాద్ నగరం నేడు విశ్వవ్యాప్తంగా ఐటీ - ఫార్మా రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అయితే కేవలం ఈ రంగాలే కాకుండా భవిష్యత్తులో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ ఒక తిరుగులేని గ్లోబల్ హబ్‌గా ఎదగబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డ్స్ 2025-26 వేడుకలో పాల్గొన్న ఆయన సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఒకప్పుడు మద్రాసు (చెన్నై) కేంద్రంగా సాగుతున్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంలో నలుగురు మహానుభావుల కృషి వెలకట్టలేనిదని సీఎం పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు, కృష్ణ వంటి ప్ర‌ముఖులు తమ అకుంఠిత దీక్షతో టాలీవుడ్‌ను ఇక్కడ స్థాపించారని ఆయన కొనియాడారు. వారిని పరిశ్రమను కాపాడే `నాలుగు మినార్లు`గా అభివర్ణించడం విశేషం. చార్ `మినార్‌`లు ఎలానో ఆ న‌లుగురు సినీప్ర‌ముఖులు అలాంటి వారు అని కొనియాడారు.

తెలుగు చిత్ర పరిశ్రమ తరలివచ్చిన తర్వాత అది ఇక్కడ పటిష్టంగా వేళ్లూనుకోవడానికి దివంగత రామోజీరావు చేసిన కృషిని రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా స్మరించుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ ని నిర్మించి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా సినిమా షూటింగ్‌లకు హైదరాబాద్ ఒక గమ్యస్థానంగా మారిందని ఆయన వివరించారు. ఈ పునాదులే నేడు టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి కారణమయ్యాయని తెలిపారు.

కళాకారులను గౌరవించుకోవడంలో భాగంగా ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో పురస్కారాలను అందజేయడం తమ ప్రభుత్వానికి గర్వకారణమని సీఎం అన్నారు. కళలు , సంస్కృతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కళాకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గద్దర్ ఆశయాలకు అనుగుణంగా ఈ అవార్డుల ప్రదానం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను కేవలం ఒక ఆర్థిక నగరంగానే కాకుండా, కళలు- సినిమాకు ప్రధాన చిరునామాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారం అందించ‌డానికి అన్నివిధాలా సిద్ధంగా ఉంద‌ని.. టాలీవుడ్ శిఖరాలను అధిరోహించాలని.. ప్రపంచ సినీ పటంలో హైదరాబాద్ ముద్ర మరింత బలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.