Begin typing your search above and press return to search.

చిత్ర పరిశ్రమ దృష్టి అంతా ఉత్తరాంధ్రపైనే ఉంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. బతుకును జయించాలంటే గుండెల నిండా ఆత్మవిశ్వాసం, మన మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలని పేర్కొన్నారు.

By:  Sivaji Kontham   |   15 Oct 2026 9:28 AM IST
చిత్ర పరిశ్రమ దృష్టి అంతా ఉత్తరాంధ్రపైనే ఉంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
X

విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగిన `గరివిడి లక్ష్మి` ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి వేదికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర మట్టి వాసనలు, అక్కడి జీవన విధానం , జానపద కళల గొప్పతనాన్ని త‌న స్పీచ్‌లో అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రాంతీయ సంస్కృతిని వెండితెరకు సముచితంగా తీసుకువస్తున్న తరుణంలో ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. బతుకును జయించాలంటే గుండెల నిండా ఆత్మవిశ్వాసం, మన మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలని పేర్కొన్నారు. కాలం మారిన వైనాన్ని వివరిస్తూ.. మూడు దశాబ్దాల క్రితం శ్రీకాకుళం యాసను కేవలం హాస్యం కోసమే ఉపయోగించేవారని.. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర నుంచి వస్తున్న పాటలు- కథలు అంతర్జాతీయ స్థాయిలో ఆద‌రణ పొందుతున్నాయ‌ని .. మన యాసను, భాషను, సంస్కృతిని ప్రపంచం గౌరవిస్తోందని ఆయన గర్వంగా వెల్లడించారు.

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ దృష్టి అంతా ఉత్తరాంధ్రపైనే ఉందని, కథల్లో నైజం (జెన్యూనిటీ) కోసం ఇక్కడి ప్రాంతీయ సబ్జెక్ట్‌లను ఎక్కువగా ఎంచుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఇదే కోవ‌లో తెరకెక్కిన `గరివిడి లక్ష్మి` చిత్రం ఉత్తరాంధ్రలోని ప్రతి గ్రామంలోనూ అందరికీ సుపరిచితమైన ఒక రియల్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందిందని అభివర్ణించారు. ఇలాంటి అచ్చమైన పాత్రలు, వాటి వెనుక ఉన్న జానపద సంగీతం నేటి తరపు కళాకారులకు సరికొత్త స్థాయిని..అద్భుతమైన ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇలాంటి విభిన్నమైన, అంకితభావంతో కూడిన కథాంశాన్ని ఎంచుకుని ఉత్తరాంధ్ర మూలాలను వెండితెరకు పరిచయం చేసిన చిత్ర యూనిట్‌ను రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. దర్శకుడు గౌరి నాయుడు జమ్ము, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌- కృతిల‌తో పాటు ప్రధాన తారాగణంగా నటించిన ఆనంది, రాగ్ మయూర్ తదితరులందరి కృషి వెలకట్టలేనిదని ప్రశంసించారు. ఈ చిత్రం కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా, ప్రేక్షకులను లోతుగా భావోద్వేగానికి గురిచేసి ఆలోచింపజేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

ఈవెంట్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వేడుకలో ఎంతో ఉత్సాహంగా క‌నిపిస్తూ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేవలం ప్రసంగంతోనే ఆగిపోకుండా.. ప్రముఖ సింగర్ మంగ్లీతో కలిసి స్టేజ్‌పై సరదాగా జానపద పాటలు పాడుతూ ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగించారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు, కళలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ చక్కటి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలో తిలకించి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేదిక‌పై గ‌రివిడి ల‌క్ష్మి పేరుతో అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తున్నామ‌ని, వ‌చ్చే ఏడాది నుంచి ఉత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని చిత్ర నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ప్ర‌క‌టించ‌గా, ఈ అవార్డ్ వేడుక‌ల‌ను శ్రీ‌కాకుళంలో నిర్వ‌హించాల‌ని రామ్మోహ‌న్ కోరారు.