తెలివిగా భక్తి కథలపై పడ్డారు..'హనుమాన్ అంశ్' మేకర్స్ మరో ప్రయత్నం!
ఈసారి మహాకవి గోస్వామి తులసీదాస్ జీవిత చరిత్ర.. ఆయన అన్వేషించిన భక్తి మార్గం - ఆధ్యాత్మిక పరివర్తన ప్రధానాంశాలుగా`రాంబోలా` అనే సినిమా తెరకెక్కుతోంది.
By: Sivaji Kontham | 16 Sept 2026 9:00 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో భక్తి - ఆధ్యాత్మికత నేపథ్యంలో వస్తున్న సినిమాల ట్రెండ్ మళ్లీ ఊపందుకుంటోంది. ప్రేక్షకులను కట్టిపడేసే దేవుళ్ల కథలను ఎంచుకోవడంలో మేకర్స్ ఇప్పుడు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇదే కోవలో `హనుమాన్ అంశ్` వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఆ సినిమా దర్శకుడు విశాల్ చతుర్వేది - ప్రముఖ నిర్మాత మహావీర్ జైన్ మరో ప్రతిష్టాత్మక డివోషనల్ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈసారి మహాకవి గోస్వామి తులసీదాస్ జీవిత చరిత్ర.. ఆయన అన్వేషించిన భక్తి మార్గం - ఆధ్యాత్మిక పరివర్తన ప్రధానాంశాలుగా`రాంబోలా` అనే సినిమా తెరకెక్కుతోంది. శ్రీ నీబ్ కరౌరి బాబా కథ ఆధారంగా రూపొందిన `హనుమాన్ అంశ్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి 200 కోట్ల క్లబ్‌లో చేరి ఒక చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ విజయం అందించిన ఉత్సాహంతో ఇప్పుడు భారతీయ సన్యాస పరంపరలోని మరో గొప్ప చారిత్రక పురుషుడి కథను వెండితెరకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.
`రాంబోలా` చిత్రానికి విశాల్ చతుర్వేది స్వయంగా రచన - దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి మహావీర్ జైన్, విశాల్ చతుర్వేది, అమిత్ ఉపాధ్యాయ్, రాఘవేంద్ర సింగ్ సంయుక్తంగా ముందుకు వచ్చారు. మహావీర్ జైన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా తులసీదాస్ సాహిత్యం భారతీయ సంస్కృతిపై.. సమాజంపై చూపిన శాశ్వత ప్రభావాన్ని కళ్లకు కట్టేలా ఆవిష్కరించనున్నారు.
మహావీర్ జైన్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ప్రస్తుతం వరుసగా సంథింగ్ కొత్త విషయం ఉన్న ప్రాజెక్ట్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా కార్తీక్ ఆర్యన్ హీరోగా మృగదీప్ సింగ్ లాంబా దర్శకత్వంలో `నాగ్‌జిల్లా`..., ఆయుష్మాన్ ఖుర్రానా - శర్వరి జోడీగా సూరజ్ బర్జాత్యా తెరకెక్కిస్తున్న `యే ప్రేమ్ మోల్ లియా` చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అలాగే గ్లోబల్ స్పిరిచ్యువల్ లీడర్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ జీవితంలోని ఒక కీలక ఘటన ఆధారంగా విక్రాంత్ మెస్సే ప్రధాన పాత్రలో నటిస్తున్న `వైట్` సినిమా కూడా ఈ లైనప్‌లో ఉంది.
ఇలా వరుస వైవిధ్యమైన... ఆసక్తికరమైన చిత్రాలను నిర్మిస్తున్న ఈ బ్యానర్‌లో తెరకెక్కనున్న `రాంబోలా` చిత్రంపై సినీ వర్గాల్లో- ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తులసీదాస్ జీవిత ప్రయాణాన్ని అత్యంత భావోద్వేగభరితంగా.. దృశ్యకావ్యంగా మలచనున్న ఈ చిత్రం డివోషనల్ జోనర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
