Begin typing your search above and press return to search.

రాముడు (X) రాక్ష‌సుడు: పోస్టర్‌ దుమారానికి స‌ర్వం సిద్ధం

నితేష్ తివారీ దర్శకత్వంలో పురాణేతిహాసం `రామాయణం` రెండు భాగాలుగా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   15 Jan 2026 11:12 PM IST
రాముడు (X) రాక్ష‌సుడు: పోస్టర్‌ దుమారానికి స‌ర్వం సిద్ధం
X

నితేష్ తివారీ దర్శకత్వంలో పురాణేతిహాసం `రామాయణం` రెండు భాగాలుగా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. రణబీర్ కపూర్ లార్డ్ రాముడిగా, యష్ రావణుడిగా న‌టిస్తుండ‌గా, సాయిప‌ల్ల‌వి సీతాదేవి పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌లో ఇది ఒక‌టి. ఇంత‌కుముందు విడుద‌లైన టైటిట్ టీజ‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు మొదటి పోస్టర్ రాక కోసం అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు.

తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. మేకర్స్ మార్చి 2026లో మొదటి అధికారిక క్యారెక్టర్ పోస్టర్‌లను రిలీజ్ చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంది. 27 మార్చి 2026న, అంటే రామ నవమి రోజున‌ పోస్టర్‌లను విడుదల చేయ‌నున్నారని తెలుస్తోంది. శ్రీ‌రాముడి జ‌న్మ‌దినోత్స‌వాన్ని ఎంచుకోవడం అనేది భార‌త‌దేశ‌ ప్ర‌జ‌ల‌ భావోద్వేగంతో ముడిప‌డిన‌ది. సాంస్కృతికంగా అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన సంద‌ర్భంగా దీనిని చూస్తారు. అందుకే శ్రీ‌రామ‌న‌వ‌మి స‌రైన తేదీ అని భావిస్తున్నారు. రాబోవు పోస్టర్‌ల‌లో రణబీర్ కపూర్ లార్డ్ రాముడిగా రూపాంతరం చెందే పోస్ట‌ర్లు, యష్ బలీయమైన రావణుడి లుక్, సీతాదేవిగా సాయిపల్ల‌వి (మొదటి అధికారిక లుక్) లుక్‌ల‌ను రివీల్ చేస్తార‌ని భావిస్తున్నారు.

రామాయ‌ణం-మొదటి భాగం చిత్రీకరణ 2025 చివరిలో పూర్తయింది. ప్రస్తుతం చిత్ర‌ బృందం విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్‌.ఎక్స్) పై ఎక్కువగా దృష్టి సారించింది. వీటిని డి.ఎన్.ఇ.జి అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తోంది. నిర్మాతలు 2026 వేసవి నాటికి తుది ఎడిట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రెండు భాగాలకు సంబంధించిన‌ విడుదల తేదీల‌ను ఇప్ప‌టికే ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. పార్ట్ 1 ని దీపావళి 2026కి రిలీజ్ చేయాల‌ని భావించ‌గా, పార్ట్ 2 ని దీపావళి 2027న విడుద‌ల చేయాల‌నేది ప్లాన్.

ఈ చిత్రానికి లెజెండ‌రీ స్వరకర్త ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. రెహమాన్ .. హాలీవుడ్ మాస్ట్రో హాన్స్ జిమ్మెర్ తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రంతో జిమ్మెర్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నారు.