Begin typing your search above and press return to search.

భార‌తీయ పురాణేతిహాసం 'రామాయ‌ణం'తో 'ది ఒడిస్సీ పోలిక‌ల‌ డిబేట్

గ్రీకు పురాణ కథ `ది ఒడిస్సీ`.... భారతీయ పురాణేతిహాసం `రామాయణం` ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రాచీన ఇతిహాసాలుగా నిలిచాయి.

By:  Sivaji Kontham   |   25 July 2026 9:53 AM IST
భార‌తీయ పురాణేతిహాసం రామాయ‌ణంతో ది ఒడిస్సీ పోలిక‌ల‌ డిబేట్
X

గ్రీకు పురాణ కథ `ది ఒడిస్సీ`.... భారతీయ పురాణేతిహాసం `రామాయణం` ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రాచీన ఇతిహాసాలుగా నిలిచాయి. వేర్వేరు సంస్కృతులు, భౌగోళిక ప్రాంతాలలో క‌థాంశం ఉన్నా.. ఈ రెండు కావ్యాల ఒరిజినల్ కథాంశాల మధ్య ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. ధర్మం, భక్తి, విరహం, చెడుపై మంచి సాధించే విజయం వంటి సార్వ‌జ‌నీన‌ అంశాలు ఈ రెండింటిలోనూ ప్రధానంగా కనిపిస్తాయి.

మొదటి ప్రధాన పోలిక సుదీర్ఘమైన వనవాసంలేదా ప్రయాణం- ఇల్లు వదిలి వెళ్లడం. రామాయణంలో శ్రీరాముడు తండ్రి మాట కోసం 14 సంవత్సరాల పాటు అయోధ్యను వదిలి అరణ్యవాసానికి వెళ్తాడు. అలాగే `ఒడిస్సీ`లో నాయకుడైన ఒడిసియస్ ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత తన సొంత రాజ్యమైన ఇథాకాకు తిరిగి చేరుకోవడానికి 10 సంవత్సరాల సుదీర్ఘమైన.. ర‌క‌ర‌కాల‌ ఆటంకాలతో కూడిన సముద్ర ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇద్దరు నాయకులు కూడా తమ స్వగృహాలకు, రాజభోగాలకు దూరమై ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తారు.

రెండవ కీలక పోలిక `పవిత్రమైన భార్యాభర్తల బంధం మరియు విరహం`. రామాయణంలో సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు.. లంకలోని అశోకవనంలో ఎంతటి ఒత్తిడులు ఎదురైనా రాముడిపై ఉన్న ప్రేమతో పాతివ్రత్యాన్ని కాపాడుకుంటుంది. ఒడిస్సీలో ఒడిసియస్ భార్య పెనెలోప్ కూడా తన భర్త తిరిగి రాకకోసం 20 ఏళ్లు ఎదురుచూస్తుంది. రాజ్య సింహాసనాన్ని, తనను దక్కించుకోవడానికి ప్రయత్నించిన వందలాది మంది రాకుమారులను తన తెలివితేటలతో తిరస్కరిస్తూ...ఒడిసియస్ పై తన నిష్కల్మషమైన ప్రేమను, విశ్వసనీయతను నిలబెట్టుకుంటుంది.

మూడవ పోలిక `నాయకుల విల్లు ఎక్కుపెట్టే ఘట్టం`. సీతాదేవి స్వయంవరంలో శివుని ధనస్సును విరిచి శ్రీరాముడు తన పరాక్రమాన్ని నిరూపించుకుని సీతను వివాహం చేసుకుంటాడు. ఒడిస్సీ ముగింపులో కూడా పెనెలోప్ ఒక పోటీని పెడుతుంది. ఒడిసియస్ పాత విల్లుకు నారి సంధించి...12 గొడ్డళ్ల కన్నుల గుండా బాణం వేయగలిగిన వారికే తనని ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రకటిస్తుంది. బెగ్గ‌ర్ వేషధారణలో వచ్చిన ఒడిసియస్ మాత్రమే ఆ విల్లును ఎక్కుపెట్టి తన శత్రువులను సంహరిస్తాడు. ఈ రెండు ఇతిహాసాలలో `విల్లు` అనేది నాయకుడి గుర్తింపుకు, శక్తికి ప్రతీకగా నిలుస్తుంది.

చివరగా ఈ రెండు కథలు ``దైవిక జోక్యం- చెడుపై మంచి సాధించిన విజయాన్ని`` చాటిచెబుతాయి. రామునికి హనుమంతుడు, సుగ్రీవుడు.. దేవతల సహాయం లభిస్తే... ఒడిసియస్‌కు జ్ఞాన దేవత అయిన `అథీనా` ప్రతిదశలోనూ మార్గదర్శనం చేస్తుంది. చివరికి శ్రీరాముడు రావణుడిని అంతమొందించి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తే...ఒడిసియస్ తన రాజ్యాన్ని ఆక్రమించాలని చూసిన దుష్టులను మట్టుబెట్టి తన కుటుంబాన్ని, రాజ్యాన్ని దక్కించుకుంటాడు. ఈ విధంగా భౌగోళిక సరిహద్దులు దాటి మానవ భావోద్వేగాలు, విలువలు ఒక్కటేనని ఈ రెండు ఇతిహాసాలు నిరూపిస్తాయి. నోల‌న్ `ది ఒడిస్సీ` సినిమా రాక, సాధించిన అఖండ విజ‌యం.. ఇప్పుడు భార‌తీయ సినిమా క‌థ‌ల భ‌విష్య‌త్ ను కూడా దిశానిర్ధేశ‌నం చేస్తోంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.