Begin typing your search above and press return to search.

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

భారతీయ చిత్రసీమలో బడ్జెట్, మార్కెట్ పరిమాణం.. ప్రీ-రిలీజ్ వ్యాపారంలో స‌రికొత్త‌ అధ్యాయం మొదలైంది.

By:  Sivaji Kontham   |   3 Nov 2026 11:40 PM IST
రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?
X

భారతీయ చిత్రసీమలో బడ్జెట్, మార్కెట్ పరిమాణం.. ప్రీ-రిలీజ్ వ్యాపారంలో స‌రికొత్త‌ అధ్యాయం మొదలైంది. ఒకవైపు నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన‌ మైథాలాజికల్ ఎపిక్ `రామాయణ: పార్ట్ 1` భారీ ప్రీబిజినెస్ తో చ‌ర్చ‌ల్లో నిల‌వ‌గా, మరొకవైపు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ - సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ `కింగ్` ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్‌ను సొంతం చేసుకోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ రెండు భారీ ప్రాజెక్ట్‌లు విడుదలకు ముందే నమోదు చేసిన ప్రీ-రిలీజ్ వ్యాపార లెక్కలు భారతీయ సినిమా మార్కెట్ ఏ స్థాయికి చేరిందో స్పష్టంగా చెబుతున్నాయి.

నిర్మాణ వ్యయం - విజువల్ స్కేల్ పరంగా చూస్తే రెండు సినిమాల బడ్జెట్లు ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉన్నాయి. `రామాయణ`రెండు భాగాల ప్రాజెక్ట్ కోసం ఏకంగా 4000 కోట్లు వెచ్చిస్తుండగా..కేవలం పార్ట్-1 నిర్మాణ వ్యయమే 1000 కోట్ల నుండి 1100 కోట్ల (వాస్త‌వ లెక్క‌) వరకు ఉందని అంచనా. ఇక షారూఖ్ ఖాన్ `కింగ్` చిత్రం మొదట 300 కోట్ల అంచనాతో ప్రారంభమైనా.. నిర్మాణ దశలో 400 కోట్లకు పెరిగింది. ప్రచారం సహా మార్కెటింగ్ కోసం మరో 50 కోట్లు -కథానాయకుడి పారితోషికంతో కలిపి `కింగ్` టోట‌ల్ బ‌డ్జెట్ దాదాపు 550 కోట్లకు చేరుకుంది.

ప్రీ-రిలీజ్ బిజినెస్ గణాంకాలను పరిశీలిస్తే `రామాయణ` బ‌డ్జెట్ కి త‌గ్గ‌ట్టే వ్యాపారం చేసింద‌ని సాన్ సిల్క్ పేర్కొంది. థియేట్రికల్ పంపిణీ, డిజిటల్ స్ట్రీమింగ్ (OTT), మ్యూజిక్ హక్కులతో కలిపి `రామాయణ: పార్ట్ 1` విడుదలకు ముందే రూ. 1130 కోట్ల రికార్డు బిజినెస్ చేసింది. మరోవైపు క్రిస్మస్ (24 డిసెంబర్ 2026) కానుకగా రానున్న `కింగ్` థియేట్రిక‌ల్‌, నాన్థియేట్రికల్, డిస్ట్రిబ్యూషన్ డీల్స్ ద్వారా మొత్తం రూ.665 కోట్ల బిజినెస్ సాధించింది. ఇది దాదాపు రామాయ‌ణ బిజినెస్ లో స‌గం. విశేషమేమిటంటే.. ఈ రెండు భారతీయ (హిందీ) చిత్రాల థియేట్రికల్ హక్కులు చెరో రూ.250 కోట్లకు అమ్ముడుపోయాయి.

డిజిటల్ - బిజినెస్ వర్గాల రికవరీ అంశంలో రెండు చిత్రాల వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి. `కింగ్` చిత్రానికి సంబంధించి విదేశీ హక్కులను ఫార్స్ ఫిల్మ్స్ సంస్థ 175 కోట్ల మినిమమ్ గ్యారెంటీ (ఎంజీ)కి దక్కించుకోగా, డిజిటల్ రైట్స్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ నుండి 150 కోట్లు, మ్యూజిక్ హక్కులకు 65 కోట్లు, శాటిలైట్ హక్కులకు 25 కోట్లు లభించాయి. అయితే, `కింగ్` ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు 425 కోట్ల రికవరీ సాధించాల్సి ఉంది. బాక్సాఫీస్ వద్ద లాభాల్లోకి రావాలంటే ఈ చిత్రం కనీసం 550 కోట్ల నెట్ లేదా 800 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

చివరగా.. ఈ రెండు ప్రాజెక్టులు సాధించాల్సిన బాక్సాఫీస్ టార్గెట్స్ భారతీయ చిత్రసీమ ప్రమాణాలను తిరగరాస్తున్నాయి. `కింగ్` సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే దేశీయంగా 400 కోట్ల నెట్ (500 కోట్ల గ్రాస్), విదేశాల్లో 150 కోట్ల నెట్ (300 కోట్ల గ్రాస్) సాధిస్తూ `జైలర్ 2`, `ఛావా` లాంటి చిత్రాలు సాధించిన‌ రూ. 800 కోట్ల బెంచ్‌మార్క్‌ను అందుకోవాలి. అదే సమయంలో రూ. 1130 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించిన `రామాయణ` తన భారీ బడ్జెట్‌ను తిరిగితెచ్చుకోవ‌డానికి భారీ ర‌న్ కొన‌సాగించాల్సి ఉంటుంది. ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచ స్థాయి మైలురాళ్లను నెలకొల్పాల్సి ఉంది. రామాయ‌ణ‌-1 ఇప్ప‌టికే (రిలీజ్ ముందే) 80కోట్లు పైగా ప్రీబుకింగుల ద్వారా రాబ‌ట్టింద‌న్న స‌మాచారం ఉంది.