Begin typing your search above and press return to search.

రామాయణ వర్సెస్ గాడ్జిల్లా: క్లాష్‌కి బ్రేక్ వేసిన ఐమాక్స్ స్క్రీన్ల కొరత!

సినిమా ప్రియుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించిన రెండు భారీ చిత్రాల బాక్సాఫీస్ పోరుకు తాత్కాలికంగా తెరపడింది.

By:  Srikanth Kontham   |   27 Oct 2026 4:31 PM IST
రామాయణ వర్సెస్ గాడ్జిల్లా: క్లాష్‌కి బ్రేక్ వేసిన ఐమాక్స్ స్క్రీన్ల కొరత!
X

సినిమా ప్రియుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించిన రెండు భారీ చిత్రాల బాక్సాఫీస్ పోరుకు తాత్కాలికంగా తెరపడింది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న పౌరాణిక చిత్రం `రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్`- జపనీస్ మాన్స్టర్ చిత్రం `గాడ్జిల్లా మైనస్ జీరో` చిత్రాలు ఒకే సారి విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే భారత్‌లో `గాడ్జిల్లా మైనస్ జీరో` విడుదల వాయిదా పడటంతో బిగ్ బాక్సాఫీస్ క్లాష్ కు బ్రేక్ ప‌డింది.

ఈ వాయిదా వెనుక కారణం భారతదేశంలో ఉన్న పరిమిత ఐమాక్స్ స్క్రీన్ల కొరత అని విశ్లేషకులు చెబుతున్నారు. నవంబర్ 6న విడుదల కావాల్సిన గాడ్జిల్లా చిత్రం ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్లను సాధించడంలో పోటీని ఎదుర్కొంది. అదే వారాంతంలో ఐమాక్స్ వెర్షన్‌లో రానున్న `రామాయణ` సినిమాపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉండటంతో దిగ్గజ థియేటర్ నెట్‌వర్క్‌లు రామాయణకే ప్రాధాన్యతనివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రీమియం ఐమాక్స్ ప్రాపర్టీస్‌లో గాడ్జిల్లా చిత్రానికి రోజుకు ఒకే ఒక్క షో మాత్రమే లభించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిని అధిగమించేందుకు భారత పంపిణీ బాధ్యతలను చూస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ గాడ్జిల్లా విడుదల తేదీని వాయిదా వేసి మంచి సంఖ్యలో స్క్రీన్లు లభించే అనుకూలమైన వేరొక తేదీకి మార్చాలని యోచిస్తోంది.

ప్రీమియం స్క్రీన్ల కొరత రాబోయే రోజుల్లో హాలీవుడ్, అంతర్జాతీయ చిత్రాలకు కొత్త సవాలుగా మారుతోంది. డిసెంబర్‌లో `అవెంజర్స్: డూమ్స్‌డే`, `డ్యూన్: పార్ట్ త్రీ` వంటి భారీ చిత్రాలు ఇప్పటికే ఐమాక్స్ స్క్రీన్లను బుక్ చేసుకోవడంతో గాడ్జిల్లా లాంటి చిత్రాలు విడుదల తేదీల విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

తకాషి యమజాకి దర్శకత్వంలో తెరకెక్కిన `గాడ్జిల్లా మైనస్ జీరో` చిత్రం 2023లో ఘనవిజయం సాధించిన `గాడ్జిల్లా మైనస్ వన్` కు సీక్వెల్‌గా వస్తోంది. జపాన్‌లో నవంబర్ 3న ఉత్తర అమెరికాలో నవంబర్ 6న విడుదల కానున్న ఈ సినిమా ఐమాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి జపనీస్ చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పడం విశేషం.

ఏది ఏమైనా? `గాడ్జిల్లా మైనస్ జీరో` వాయిదా పడటంతో `రామాయణ` సినిమాకు భారతదేశంలో ఐమాక్స్ స్క్రీన్ల పరంగా మార్గం సుగమమైంది. ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్ల కోసం బిగ్ బడ్జెట్ సినిమాలు పోటీపడుతున్న తరుణంలో భారతీయ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్‌లో థియేటర్ల కొరత ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో ఈ పరిణామం నిరూపిస్తోంది.