అక్కడ ఇక్కడ గాడ్జిల్లాతో రాముడి ఫైట్..!
దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ 'రామాయణ'. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Ramesh Palla | 6 Aug 2026 1:38 PM ISTదేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ 'రామాయణ'. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. కొందరు ట్రోల్స్ చేస్తున్నప్పటికీ సినిమాకు ఉన్న బజ్ ను పెంచింది అనడంలో సందేహం లేదు. దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న విడుదల కాబోతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడి పాత్రలో కన్నడ స్టార్ యశ్ నటించారు. మొదటి పార్ట్ రామాయణ విడుదల నేపథ్యంలో మేకర్స్ పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు. రామాయణకు ఉన్న బజ్ నేపథ్యంలో సినిమాను ఇంగ్లీష్‌లోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగా ఇటీవల సినిమా యొక్క ఇంగ్లీష్ ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం రామాయణ సినిమాపై ఆసక్తి కనబర్చుతున్నారు అనేందుకు ఇంగ్లీష్ ట్రైలర్ వ్యూస్ నిదర్శనం అనేది చాలా మంది అభిప్రాయం.
రణ్‌బీర్ కపూర్ రామాయణ సినిమాలో...
ఇండియాలో నవంబర్ 6న విడుదల కాబోతున్న 'రామాయణ' సినిమాకు చిన్నా పెద్దా ఏ ఒక్క సినిమా పోటీగా నిలిచే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఆ రోజు పూర్తిగా రామాయణ సినిమాకు రాసి పెట్టినట్లుగానే పరిస్థితి ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ రోజే హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ గాడ్జిల్లా మైనస్ వన్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన 'గాడ్జిల్లా మైనస్ జీరో' సినిమా విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి బజ్ ఉంది. సాధారణంగానే గాడ్జిల్లా బ్యాక్‌డ్రాప్ సినిమాలకు మంచి ఆధరణ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కావడంతో అచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న సాంకేతిక నిపుణులు, నటీనటులు ఈ సినిమాలో నటించిన కారణంగా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ దక్కించుకోబోతుంది.
హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా మైనస్ జీరో...
ఐమాక్స్ వర్షన్‌లో రూపొందిన గాడ్జిల్లా మైనస్ జీరో సినిమాను సెప్టెంబర్ 26న 64వ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమా స్క్రీనింగ్ తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు గాను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలోనూ ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలనే చర్చలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయల మార్కెట్ పై గాడ్జిల్లా మైనస్ జీరో మేకర్స్ దృష్టి పెట్టారు అనేది బాక్సాఫీస్ వర్గాల అభిప్రాయం. ఆ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో మినిమం థియేటర్లను కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అదే జరిగితే రామాయణ సినిమాకు థియేటర్లు తగ్గడంతో పాటు ఓపెనింగ్స్ సైతం తగ్గుతాయనే అభిప్రాయంను బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రామాయణ వర్సెస్ గాడ్జిల్లా మూవీ...
హాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రామాయణ సినిమాను తీసుకు వెళ్లాలి అనుకున్న మేకర్స్‌కి గాడ్జిల్లా కారణంగా అవరోధం ఏర్పడే అవకాశాలు లేక పోలేదు. అక్కడ సైతం ఆ సినిమా ను ఎదుర్కొని థియేటర్లను దక్కించుకోవడం చాలా పెద్ద విషయంగా మాట్లాడుకుంటున్నారు. దాంతో ఓవర్సీస్‌తో పాటు ఇండియాలోనూ గాడ్జిల్లా సినిమా కారణంగా రామాయణ సినిమాకు పెద్ద ఇబ్బంది తప్పదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రామాయణ సినిమా విడుదల తేదీ చివరి నిమిషంలో మార్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న కారణంగా చివరి నిమిషం వాయిదా ఉండదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దాంతో గాడ్జిల్లా వర్సెస్ రామాయణ పోరు తప్పక పోవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం.
