బ్లాక్ బస్టర్ 'ధురంధర్'.. రామాయణ గట్టి సవాల్ విసురుతుందా?
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.
By: M Prashanth | 3 April 2026 12:09 PM ISTసోషల్ మీడియా ప్రస్తుతం భారీ చర్చకు దారి తీస్తున్న విషయం ఏంటంటే.. బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 చిత్రం జోరు కొనసాగుతున్న వేళ.. ఆ సినిమాకు వసూళ్ల విషయంలో రాబోయే అప్ కమింగ్ మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణ గట్టి పోటీ ఇస్తుందా లేదా అన్నదే. ప్రస్తుతం ఆ అంశంపై అటు సినీ వర్గాల్లో ఇటు నెట్టింట అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 19న విడుదలైన ఆ చిత్రం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. రెండో వారం పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ కలెక్షన్ల వేగం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఆ సినిమా, రూ.2000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.
జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఆ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కావడం కూడా ప్లస్ అయింది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ మరో భారీ ప్రాజెక్ట్ రామాయణ’పై అందరి దృష్టి పడింది. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు.
నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పని చేయడంతో విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండనున్నాయని తెలుస్తోంది. మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి స్పందన రావడంతో రామాయణపై అంచనాలు మరింత పెరిగాయి. కథ, విజువల్స్, భావోద్వేగాలు ప్రేక్షకులతో గట్టిగా కనెక్ట్ అయితే ఆ సినిమా రూ.3000 కోట్ల మైలురాయిని చేరుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ధురంధర్ 2కు రామాయణ సవాల్ విసిరుతుందా.. బాక్సాఫీస్ సునామీని రామాయణ అధిగమించగలదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నిజానికి ధురంధర్ 2 పూర్తిగా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా.. రామాయణ ఒక పౌరాణిక మహాకావ్యం ఆధారంగా తెరకెక్కుతోంది. అందువల్ల రెండు సినిమాల టార్గెట్ ప్రేక్షక వర్గాలు కొంతవరకు వేర్వేరు కావచ్చు. కానీ కంటెంట్ బలంగా ఉండి, విజువల్ గ్రాండియర్ ఆకట్టుకుంటే రామాయణ గ్లోబల్ స్థాయిలో భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందనే చెప్పాలి. ముఖ్యంగా భారతీయ సంస్కృతి, పురాణాలపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తి.. ఆ సినిమాకు అదనపు బలం కావచ్చు. మొత్తానికి ధురంధర్ 2 ప్రస్తుతం బాక్సాఫీస్ షేక్ చేస్తుంటే, రాబోయే రామాయణ ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.
