ప్రభాస్ 'ఆదిపురుష్' రికార్డును టచ్ చేయలేకపోయిన 'రామాయణం'!
బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న `రామాయణ్` సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తోంది.
By: Sivaji Kontham | 1 Aug 2026 10:22 AM ISTబాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'రామాయణ్' సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం గ్రాండ్ విజువల్స్.. అసాధారణ వీఎఫ్ఎక్స్ (VFX) .. భారీ మేకింగ్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. సోనీ అధికారిక ఛానెల్‌తో పాటు 'వరల్డ్ ఆఫ్ రామాయణ్' ఛానెల్‌లలో బహు భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ ట్రైలర్‌కు విశేష ఆదరణ లభించింది. అయినా రణబీర్ కి డెడికేటెడ్ ఫ్యాన్ బేస్ ఉన్నా ఈ చిత్రం ప్రభాస్ నటించిన `ఆదిపురుష్` మొదటి 24 గంటల వ్యూస్ రికార్డును 'రామాయణం' అధిగమించలేకపోయింది.
గణాంకాల ప్రకారం చూస్తే.. 'రామాయణ్' హిందీ ట్రైలర్ వర్షన్ మొదటి 24 గంటల్లో దాదాపు 36.4 మిలియన్ వ్యూస్ సాధించగా.. అన్ని భాషలు కలిపి సుమారు 45 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ రికార్డుతో ఆల్-టైమ్ మోస్ట్ వ్యూడ్ భారతీయ ట్రైలర్లలో 19వ స్థానంలో (విజయ్ `GOAT` తర్వాత) నిలిచింది. కానీ గతంలో ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ శ్రీరాముడిగా వచ్చిన `ఆదిపురుష్` ట్రైలర్ మొదటి రోజు ఏకంగా 74.2 మిలియన్ వ్యూస్ సాధించి ఆల్-టైమ్ చార్ట్‌లో 4వ స్థానంలో కొనసాగుతోంది. ఈ వ్యూస్ తేడాను చూస్తే... ప్రభాస్ నెలకొల్పిన రికార్డును టచ్ చేయడం రణబీర్ కపూర్‌కి సాధ్యపడలేదనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో మొదలైంది.
దీనిని ఏ కోణంలో చూడాలి? అనే ప్రశ్న తలెత్తినప్పుడు.. ప్రభాస్ స్టార్‌డమ్.. అతడికి ఉన్న సార్వజనీన క్రేజ్ ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రణబీర్ కపూర్ కంటే ముందే దేశవ్యాప్తంగా తిరుగులేని పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్‌ను శ్రీరాముడి పాత్రలో చూడాలనే ఉత్కంఠ అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. ఉత్తరాదిన అలాగే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ అత్యంత బలంగా పనిచేసింది. `ఆదిపురుష్` సమయానికి ప్రభాస్ ట్రైలర్ వస్తోందంటే దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఏర్పడిన ఊపిరాడనివ్వని ఎమోషన్, ఉత్కంఠ రణబీర్ `రామాయణ్` విషయంలో అంతటి స్థాయిలో కనిపించలేదని భావించవచ్చు.
ఇది కేవలం ఒక ప్రాంతానికో ఒక వర్గానికో పరిమితమైన విషయం కాదని... ప్రభాస్‌కి దేశవ్యాప్తంగా ఉన్న అసాధారణమైన మాస్ ఫాలోయింగ్‌కి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. యూట్యూబ్ రికార్డుల్లోనూ ప్రభాస్ తన ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తున్నాడు. భారతదేశంలో మొదటి 24 గంటల్లో అత్యధికంగా 113.2 మిలియన్ వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా ప్రభాస్ `సలార్` మొదటి స్థానంలో నిలవగా... 2వ స్థానంలో యశ్ KGF 2 (106.5 మిలియన్లు), 3వ స్థానంలో అల్లు అర్జున్ 'పుష్ప 2' (104.2 మిలియన్లు) ఉన్నాయి. ఈ జాబితాలో టాప్ స్థానాల్లో దక్షిణాది స్టార్ల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే వ్యూస్ రికార్డులలో 'ఆదిపురుష్' కంటే వెనుకబడినా..'రామాయణ్' చిత్రానికి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం మేకర్స్‌కి పెద్ద ఉపశమనం. మొదటి రోజు డిజిటల్ రికార్డుల కంటే థియేటర్లలో సాధించే విజయమే అసలైనదని నిరూపిస్తూ... ఈ సినిమా కంటెంట్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన నమ్మకం ఏర్పడింది. రణబీర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యశ్ (రావణుడు) ల కాంబినేషన్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ మహా దృశ్య కావ్యం 2026 దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. బాహుబలి, వారణాసికి ఎలాంటి పాజిటివ్ ప్రచార సాయం అందించారో. అదేవిధంగా ఒక భారతీయుడైన నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న గ్లోబల్ మూవీ `రామాయణం`కు కూడా అలాంటి పాజిటివ్ సహకారం అందరూ అందించాలని ఆశిద్దాం.
