Begin typing your search above and press return to search.

'రామాయ‌ణం'లో సీత పాత్ర‌: విమ‌ర్శ‌ల‌న్నిటికీ సాయిప‌ల్ల‌వి ధీటైన జ‌వాబు ఇదేనా?

నితీష్ తివారీ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణం` ట్రైలర్ విడుదలయ్యాక సోషల్ మీడియాలో సీతాదేవి పాత్రపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

By:  Sivaji Kontham   |   30 July 2026 11:38 PM IST
రామాయ‌ణంలో సీత పాత్ర‌: విమ‌ర్శ‌ల‌న్నిటికీ సాయిప‌ల్ల‌వి ధీటైన జ‌వాబు ఇదేనా?
X

నితీష్ తివారీ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణం` ట్రైలర్ విడుదలయ్యాక సోషల్ మీడియాలో సీతాదేవి పాత్రపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ చిత్రంలో జనక మహారాజు కుమార్తెగా నటిస్తున్న సాయి పల్లవి ఎంపికపై హిందీ బెల్ట్‌తో పాటు నెటిజనుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సాయి పల్లవి తన హుందా అయిన నటన, ఆహార్యం, సహజ సౌందర్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతి షాట్‌లోనూ ఈ మ‌ల‌యాళ భామ‌ చూపించిన అభినివేశం, శాంతం వీక్షకులను మెప్పించడమే కాకుండా...ఊహించని విధంగా ఆమె కరవాలం (ఖడ్గం) దూసే సన్నివేశం ట్రైలర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సోషల్ మీడియా వేదికలైన రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో సాయి పల్లవి ఎంపికకు విశేష ఆదరణ లభిస్తోంది. పౌరాణిక పాత్రలకు కేవలం బాహ్య ఆకర్షణ లేదా గ్లామర్ మాత్రమే కొలమానం కాదని... గ్రేస్, గాంభీర్యం, అద్భుతమైన నటనా నైపుణ్యం ఉన్న సాయి పల్లవి సీత పాత్రకు నూటికి నూరు శాతం సరిపోతుందని చాలామంది సమర్థిస్తున్నారు. ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మెటిక్ ఫిల్టర్ల మైకంలో ఉండే ట్రోలర్లకు ఆమె సహజమైన అందం, నటనతోనే సమాధానం చెప్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

ఇదే సమయంలో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన `ది ఒడిస్సీ` చిత్రంలో జెండయా , లుపిటా న్యోంగోల కాస్టింగ్ ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి నెగెటివిటీయే ఎదురైందని... కానీ మూవీ విడుదలయ్యాక వారు తమ అభినయంతో విమర్శకుల నోళ్లు మూయించారని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. `రామాయణం`లో కూడా సాయి పల్లవి తన పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరచడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరొకవైపు ఈ కాస్టింగ్‌పై విమర్శలు చేసే వర్గం కూడా తమ వాదనలను వినిపిస్తోంది. రామాయణ ఇతిహాసాల ప్రకారం సీతాదేవి అత్యంత సౌందర్యవతి అని... సాయి పల్లవి లుక్స్ కంటే ఇతర కథానాయికల స్క్రీన్ ప్రెజెన్స్ మెరుగ్గా ఉండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ మోడరన్ లుక్‌కి... సాయి పల్లవి ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ శైలికి అసలు జోడీ కుదరడం లేదని పెదవి విరుస్తున్నారు. అయితే రామానంద్ సాగ‌ర్ తెర‌కెక్కించిన `రామాయ‌ణం` బుల్లితెర సీరియ‌ల్ లో సీత‌గా న‌టించిన సీనియ‌ర్ న‌టి దీపిక చిక్లియా ఇంత‌కుముందు సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు వంద‌శాతం కితాబిచ్చినా.. ఒక క‌ర్లీ హెయిర్ అమ్మాయి సీత‌గా న‌టిస్తుంద‌ని తాను భావించ‌లేద‌ని, అయితే సాయిప‌ల్ల‌వి ఉత్త‌మ న‌టి అని కితాబిస్తూ, పూర్తి సినిమా చూసాకే సీత‌గా స‌రిపోతుందా లేదా? అనేది చెబుతాన‌ని అన్నారు. ప్ర‌స్తుతం ట్రైల‌ర్ లో సీత లుక్ పై దీపిక ఇంకా స్పందించ‌లేదు.

ఏది ఏమైనా.. కేవలం పైకి క‌నిపించే రూప‌ లావణ్యం కంటే నటుల అభినయ సామర్థ్యమే సినిమా ఆత్మను నిలబెడుతుందని మెజారిటీ ప్రేక్షకులు భావిస్తున్నారు. ట్రైలర్‌లో కనిపించిన ఆ కొన్ని సన్నివేశాలే సాయి పల్లవి ప్రతిభకు అద్దం పడుతుండగా... థియేటర్లలో ఆమె నటనాభినివేశం - నాట్య కౌశలం నెగెటివ్ కామెంట్స్ అన్నింటికీ పూర్తిస్థాయిలో చెక్ పెడతాయో లేదో వేచి చూడాలి.