Begin typing your search above and press return to search.

'రామాయ‌ణం' డిజిట‌ల్ ట్రైల‌ర్ ఆరోజే రిలీజ్

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న `రామాయణ` థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు (జూలై 18న) న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అత్యంత వైభవంగా జరిగింది.

By:  Sivaji Kontham   |   19 July 2026 10:00 AM IST
రామాయ‌ణం డిజిట‌ల్ ట్రైల‌ర్ ఆరోజే రిలీజ్
X

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న `రామాయణ` థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు (జూలై 18న) న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, సాయి పల్లవి వంటి టాప్ స్టార్లు హాజరైన ఈ వేడుకలో కేవలం మీడియా ప్రతినిధులు, విఐపి అతిథుల కోసం మాత్రమే ట్రైలర్‌ను ప్రత్యేకంగా స్క్రీన్ చేశారు. అయితే ఈరోజు ఈ ట్రైలర్ ఆన్‌లైన్‌లో కూడా రిలీజ్ అయిపోతుందేమో అని ఆశగా ఎదురుచూసిన సాధారణ ప్రేక్షకులకు చిత్ర యూనిట్ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చింది. ఈరోజు కేవలం ఆన్‌గ్రౌండ్ ప్రివ్యూ మాత్రమే జరిగిందని... పబ్లిక్ వీక్షణ కోసం డిజిటల్ ట్రైలర్‌ను ఇంకా రిలీజ్ చేయలేదని మేకర్స్ స్పష్టం చేశారు.

ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ మోస్ట్ అవైటెడ్ డిజిటల్ ట్రైలర్‌ను అధికారికంగా జూలై 24న యూట్యూబ్ సహా అన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతకంటే ముందుగా.. అంతర్జాతీయ వేదికపై ఈ సినిమా క్రేజ్‌ను చాటిచెప్పేందుకు చిత్ర యూనిట్ ఒక భారీ ప్లాన్ వేసింది. జూలై 23న అమెరికాలో జరగనున్న‌ ప్రతిష్టాత్మక `సాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2026` వేదికపై ఈ సినిమాకు సంబంధించిన గ్లోబల్ ఫస్ట్-లుక్ ప్రెజెంటేషన్‌ను అధికారికంగా ప్రదర్శించనున్నారు. ఆ తర్వాతి రోజే అంటే జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు ఈ విజువల్ స్పెక్టకిల్ ట్రైలర్ డిజిటల్ రూపంలో రాబోతోంది.

ఈ సినిమా ట్రైలర్ కి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి) ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు వేర్వేరు వెర్షన్ల ట్రైలర్లను క్లియర్ చేసింది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ `యు` సర్టిఫికేషన్ పొందిన ఈ రెండు ట్రైలర్లు కూడా దాదాపు 4 నిమిషాలకు పైగా సుదీర్ఘ రన్ టైమ్‌ను కలిగి ఉండటం విశేషం. సాధారణంగా సినిమాల ట్రైలర్లు రెండు నుండి రెండున్నర నిమిషాలు మాత్రమే ఉంటాయి. కానీ రామాయణం వంటి మహా కావ్యాన్ని ప్రెజెంట్ చేయడానికి నాలుగు నిమిషాల నిడివి అవసరమని భావించిన దర్శకుడు నితేశ్ తివారీ... ఆ మేరకు అద్భుతమైన కట్‌తో ఈ ట్రైలర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

`రామాయ‌ణ మొద‌టి భాగం` దీపావళి 2026 పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలు..ఆస్కార్ విజేతల సంగీతం..అగ్ర తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినిమా సరిహద్దులను దాటి గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. న్యూఢిల్లీ ఈవెంట్ లో ట్రైలర్ చూసిన మీడియా వర్గాల నుంచి వస్తున్న టాక్ ప్రకారం.. జూలై 24న డిజిటల్ ట్రైలర్ గనుక యూట్యూబ్‌లోకి వస్తే రికార్డుల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.