Begin typing your search above and press return to search.

'రామాయ‌ణం'లో సీత పాత్ర‌కు సాయిప‌ల్ల‌వి స‌రైన ఆప్ష‌న్ కాదా?

క్రిస్టోఫ‌ర్ నోలాన్ 'ది ఒడిస్సీ' చిత్రంలో కాస్టింగ్‌తో పోల్చిన‌ప్పుడు నితీష్ తివారీ 'రామాయ‌ణం'లో పాత్ర‌ధారుల ఎంపిక స‌రైన‌దేన‌ని అంగీక‌రించ‌వ‌చ్చు... ఎందుకు అంటే..

By:  Sivaji Kontham   |   19 July 2026 11:17 AM IST
రామాయ‌ణంలో సీత పాత్ర‌కు సాయిప‌ల్ల‌వి స‌రైన ఆప్ష‌న్ కాదా?
X

క్రిస్టోఫ‌ర్ నోలాన్ 'ది ఒడిస్సీ' చిత్రంలో కాస్టింగ్‌తో పోల్చిన‌ప్పుడు నితీష్ తివారీ 'రామాయ‌ణం'లో పాత్ర‌ధారుల ఎంపిక స‌రైన‌దేన‌ని అంగీక‌రించ‌వ‌చ్చు... ఎందుకు అంటే.. నోల‌న్ తాను ఎంచుకున్న చారిత్ర‌క‌, పౌరాణిక నేప‌థ్యం ఉన్న సినిమా కోసం కేవ‌లం ప్ర‌తిభ‌, వారి వ‌య‌సు ఆధారంగానే న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకున్నార‌ని అర్థ‌మ‌వుతుంది. గ్రీకుపురాణాల్లో ట్రోజ‌న్ వార్, ఆ త‌ర్వాత జ‌రిగే క‌థ‌కు క‌చ్ఛితంగా యువ‌కులైన హాలీవుడ్ స్టార్ల ఎంపిక కాకుండా, ఒడిస్సియ‌స్ లాంటి క‌థానాయ‌కుడి పాత్ర‌కు మ్యాట్ డామ‌న్ లాంటి మిడిల్ ఏజ్డ్ న‌టుడని ఎంపిక చేసుకున్నారు. అత‌డికి స‌రిజోడుగా స‌హ‌చ‌రిగా ఎంపిక చేసుకున్న అన్నే హాథ‌వే పాత్ర‌ను చూసినా త‌న వ‌య‌సు, ప్ర‌తిభ ఆధారంగానే ఈ ఎంపిక జ‌రిగింద‌ని అంచ‌నాకు రావ‌చ్చు.

ఒక పౌరాణిక‌- జాన‌ప‌ద నేప‌థ్యం, దానికి చారిత్ర‌క అంశాలు ముడిపెడుతూ ఒక సినిమా తీస్తున్నారు! అంటే పాత్ర‌ధారుల అభిన‌యం, ఆహార్యం స‌హా న‌ట‌న‌లో ప్ర‌తిదీ కీల‌కంగా మారుతుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే నోల‌న్ చారిత్ర‌క పాత్ర‌లైన ఒడిస్సియ‌స్, పెనెలోప్ పాత్ర‌ధారుల‌ను ఎంపిక చేసుకున్నారు. చివ‌రికి నోల‌న్ న‌మ్మ‌కాన్ని నిలబెడుతూ ఈ ఎమోష‌న‌ల్ రైడ్ లో ఒడిస్సియ‌స్ పాత్ర‌లో మ్యాట్ డామ‌న్, అత‌డి భార్య‌ ప‌నెలోప్ పాత్ర‌లో అన్నే హాథ‌వే జీవించారు. ప్రేక్ష‌కులు ఈ రెండు పాత్ర‌ల ప్ర‌వ‌ర్త‌న‌లు, న‌ట‌న‌ను చూసిన‌ప్పుడు అస్స‌లు వారు న‌టించార‌ని అనుకోరు. జీవించారు.. జీవితాన్ని తెర‌పై ఆవిష్క‌రించార‌ని అంగీక‌రిస్తారు. ఆ పాత్ర‌ల కోసం నోల‌న్ ప‌రిశోధ‌న కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

ముఖ్యంగా క‌థానాయ‌కుడు ఒడిస్సియ‌స్ భార్య‌ పెనెలోప్ పాత్ర‌లో న‌టించిన అన్నే హ‌థ‌వే పాత్ర‌కు సినిమాలో అత్యంత గొప్ప ప్రాధాన్య‌త ఉంది. యుద్ధానికి వెళ్లి తిరిగి రాని భ‌ర్త కోసం ఎన్నో సంవ‌త్స‌రాలు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూసే భార్య‌గా అన్నే న‌ట‌న అస‌మానం. త‌న‌ను బ‌ల‌వంతంగా పెళ్లాడేందుకు 100 మంది దుర్మార్గ‌పు రాజులు ఎదురు చూస్తున్నా.. వారంద‌రినీ త‌న తెలివితేట‌ల‌తో మ‌భ్య పెట్టి దూరంగా ఉంచ‌డంలో రాణి పెనెలోప్ (అన్నే) న‌ట‌న అస‌మానం. చివ‌రికి త‌న కుమారుడు, భ‌ర్త కూడా శీల ప‌రీక్ష పెట్టిన‌ప్పుడు ఆ ప‌రీక్ష‌లో కూడా పెనెలోప్ నెగ్గుతుంది.. థియేట‌ర్ లో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంటుంది. సీత‌కు అగ్నిప్ర‌వేశం చేయించిన‌ట్టు క్లైమాక్స్ లో పెనెలోప్ పాత్ర కూడా తీవ్ర‌మైన ప‌రీక్ష‌కు గుర‌వుతుంది. ఇది అగ్నిప‌రీక్ష కాక‌పోయినా.. త‌న‌ను త‌న‌వారే అనుమానిస్తే త‌న‌ను తాను ఎలా నిరూపించుకోవాలి? అనే అంత‌ర్గ‌త సంఘ‌ర్ష‌ణ‌తో న‌లిగిపోయే గొప్ప పాత్ర‌లో అన్నా హ‌థ‌వే జీవించారు.

ఇప్పుడు నితీష్ తివారీ 'రామాయ‌ణం'లో అంతే కీల‌క‌మైన పాత్ర సీతాదేవి పాత్ర‌. 'ది ఒడిస్సీ' చిత్రంలోని ఒడిస్సియ‌స్ పాత్ర‌ను మించిన ఎమోష‌న్స్ ని పండించిన పెనెలోప్ పాత్ర‌తో సీతాదేవి పాత్ర‌ను పోల్చ‌గ‌లం. రావ‌ణుడు అప‌హ‌రించిన సీతాదేవిని వెతుకుతూ అడ‌వులు కొండ‌లు కోన‌లు స‌ముద్రాల మీదుగా ప్ర‌యాణించే శ్రీ‌రాముడి క‌థ ప్ర‌పంచ దేశాల‌లో ప్రాచుర్యం పొందింది. ప‌విత్ర‌మైన సీతాదేవి పాత్ర‌కు అంతే గొప్ప చారిత్ర‌క సాంస్కృతిక నేప‌థ్యం, గుర్తింపు ఉన్నాయి. అందుకే నితీష్ తివారీ 'రామాయ‌ణం' చిత్రంలో సీతాదేవి పాత్ర‌లో న‌టిస్తున్న సాయిప‌ల్ల‌వి గురించి ఆన్ లైన్‌లో చాలా డిబేట్ ర‌న్ అవుతోంది. నిజానికి సీతాదేవి పాత్ర‌కు సాయిప‌ల్ల‌వి సరిపోద‌ని హిందీ బెల్ట్ లో కొంద‌రు విమ‌ర్శించారు. అయితే అలాంటి వారంద‌రికీ స‌మాధానం చెప్ప‌గ‌ల స‌మ‌ర్థ‌త ద‌క్షిణాది క్వీన్ సాయిప‌ల్ల‌వికి ఉంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే విడుద‌లైన గ్లింప్స్ లో సాయిప‌ల్ల‌వి ఆహార్యం ఎంతో హుందాగా ఉంద‌నే టాక్ వినిపించింది. మ‌రో ఐదు రోజుల్లో రామాయ‌ణం ట్రైల‌ర్ విడుద‌ల‌వుతోంది. ఈ ట్రైల‌ర్ తో సాయిప‌ల్ల‌వి సీత పాత్ర‌కు ఎంత‌గా యాప్ట్ అనేది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు.

చాలా సినిమాల‌ను త‌నదైన న‌ట‌న‌ అభిన‌యం, డ్యాన్సింగ్ ప్ర‌తిభ‌తో నిల‌బెట్టిన ఘ‌న‌త‌ను సాధించిన రియ‌ల్ నేచుర‌ల్ ట్యాలెంట్- సాయిప‌ల్ల‌వి. అందుకే ఇప్పుడు సీత పాత్ర‌లోను త‌న అభినివేశం ఏ ఇత‌ర జాన‌ప‌ద నాయిక‌లకు తీసిపోనిద‌ని అభిమానులు స‌మ‌ర్థిస్తున్నారు. రావ‌ణుడు త‌న‌ను చెర‌బ‌ట్టిన‌ప్పుడు ప‌లికించాల్సిన భావోద్వేగాలు కానీ, అడ‌వుల‌లో శ్రీ‌రాముడితో వ‌న‌వాస ప్ర‌యాణ ఉద్వేగం కానీ, రాక్ష‌స వ‌నంలో మౌన ముద్రలో.. ల‌వ‌కుశుల‌తో యోగి ఆశ్ర‌మంలో ఉద్విగ్న ప్ర‌యాణంలో... అగ్ని ప్ర‌వేశ ఘ‌ట్టంలో కానీ.. అన్నిచోట్లా త‌న ఆహార్యంతో మెప్పించాల్సి ఉంటుంది. సాయిప‌ల్ల‌వి ఈ ఛాలెంజ్ ని స్వీక‌రించిన ధైర్యానికి మెచ్చుకుని తీరాలి. త‌న ప్ర‌తిభ‌తో మెప్పించింది గ‌నుక‌నే నితీష్ తివారీ- య‌ష్- ర‌ణ‌బీర్ వంటి ఉద్ధండులు సాయిప‌ల్ల‌వ‌ని ఎంపిక చేసుకున్నారు. అన్నే హ‌థ‌వే స్థాయిలో సాయిప‌ల్ల‌వి నిరూపిస్తుంద‌ని కూడా అభిమానులు న‌మ్ముతున్నారు. పురాణ ఇతిహాస క‌థ‌కు తాను మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌న‌ని నిరూపించి అంద‌రి నోళ్లు మూయించాల్సిన బాధ్య‌త సాయిప‌ల్ల‌వికి ఉంది.