రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ ప్రత్యేకతలు!
తాజాగా విడుదలైన బిహైండ్-ది-సీన్స్ ఫుటేజ్‌లో చూపించిన ప్రతీ సన్నివేశం ఒక సరికొత్త మేకింగ్ శైలిని ప్రతిబింబిస్తోంది.
By: Srikanth Kontham | 17 Oct 2026 7:00 PM ISTరామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ .. ప్రొడక్షన్ విలువలతో ఓ అద్భుత ప్రపంచాన్ని మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైగా సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ సంఖ్య కేవలం పబ్లిసిటీ కోసం చెప్పింది కాదు. ఒక పౌరాణిక కథను గ్లోబల్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా? అంతర్జాతీయ స్థాయిలో మలచడానికి దర్శకుడు నితీష్ తివారీ ఏ రేంజ్లో స్కెచ్ వేశారో అద్దం పడుతోంది.
సాధారణంగా పాన్-ఇండియా యాక్షన్ ప్రాజెక్ట్‌కి వందల మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పనిచేస్తుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా 10000 మంది ప్రతిభావంతులు ఒకే సినిమా కోసం పనిచేస్తున్నారంటే? అది వెండితెరపై సృష్టించబోయే దృశ్యకావ్యం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయోచ్చు. హాలీవుడ్‌లోని ఆస్కార్ విజేత వీఎఫ్ఎక్స్ కంపెనీ డీఎన్ఈజీ భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అయోధ్య నగరం వైభవం, లంకానగరం భయంకర నిర్మాణాలు, దండకారణ్యం, సముద్రంపై వారధి నిర్మాణం వంటి ప్రతీ లొకేషన్‌ను సీజీఐ , రియలిస్టిక్ సెట్స్‌తో అత్యంత ప్రామాణికంగా తీర్చి దిద్దారు.
తాజాగా విడుదలైన బిహైండ్-ది-సీన్స్ ఫుటేజ్‌లో చూపించిన ప్రతీ సన్నివేశం ఒక సరికొత్త మేకింగ్ శైలిని ప్రతిబింబిస్తోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా సూర్యోదయ వేళ పర్వత శిఖరంపై నిలబడటం, యశ్ పోషిస్తున్న రావణుడి పాత్ర శివుడి విగ్రహం ముందు ఉగ్ర రూపంతో తాండవ నృత్యం చేయడం.. ఇంద్రుని వజ్రాయుధం మెరుపులు, జటాయువు యొక్క లైఫ్-సైజ్ డిజైనింగ్ అన్నీ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు అద్దం పడుతున్నాయి. ఏఐ ...అధునాతన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి పాత్రల మూవ్‌మెంట్స్‌ను ప్రాణప్రతిష్ట చేసినట్లు స్పష్టమవుతోంది.
ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఆశ్చర్యపరిచే మరొక ప్రధాన అంశం సీతాదేవి క్యారెక్టరైజేషన్. సాయిపల్లవి పోషిస్తున్న సీత పాత్రను సాంప్రదాయ రూపంలోనే కాకుండా రాక్షస మూకలతో భీకరంగా పోరాడే యోధురాలి అవతారంలో చూపించడం విప్లవాత్మక మార్పు. పౌరాణికంగా లభ్యమయ్యే కొన్ని ప్రాచీన రామాయణ వెర్షన్లలోని సీతాదేవి శౌర్యాన్ని స్పూర్తిగా తీసుకుని అధునాతన స్టంట్ కొరియోగ్రఫీ, 3D వీఎఫ్ఎక్స్ మిళితంతో ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను నితీష్ తివారీ డిజైన్ చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
దర్శకుడు నితీష్ తివారీ గతంలో దంగల్, చిచోరే వంటి చిత్రాలతో ఎమోషన్స్, క్యారెక్టర్ ఆర్క్లను తెరపై అద్భుతంగా పండించగలరని నిరూపించుకున్నారు. ఇప్పుడు అదే ఎమోషనల్ డెప్త్‌కు భారీ క్యాన్వాస్‌ను జోడించారు. ఇందులో తండ్రీకొడుకుల బంధం ఉంది.. అండర్డాగ్ తిరుగుబాటు ఉంది. వీరోచితమైన ప్రేమకథ ఉంది అని ఆయన వ్యాఖ్యానించడం చూస్తుంటే అద్భుతమైన వీఎఫ్ఎక్స్ మాత్రమే గాక.. ప్రేక్షకులను కట్టిపడేసే నికరమైన కథనం కూడా ఈ విజువల్ వండర్‌లో భాగం కానుందని తెలుస్తోంది.
ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్ - ఏఆర్ రెహమాన్‌ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో తోడవుతుండటంతో 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా విజువల్ అండ్ సౌండ్ అనుభూతిలో నూతన రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ కథల శక్తిని అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌పై ప్రపంచస్థాయి వీఎఫ్ఎక్స్ విజువల్స్‌తో చాటి చెప్పే దిశగా నితీష్ తివారీ డిజైన్ చేసిన రామాయణ సరికొత్త చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని భారీ అంచనాలున్నాయి.
