Begin typing your search above and press return to search.

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

‘రామాయణ’లో రావణుడు–జటాయువు పోరాట సన్నివేశం 4K వీడియో ఆన్‌లైన్‌లో లీక్ కావడం చర్చనీయాంశమైంది. యష్ నటన, విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రశంసలు వస్తుండగా, సీతగా సాయి పల్లవి హావభావాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఈ సన్నివేశాన్ని పైరసీ చేయవద్దని చిత్ర బృందం, అభిమానులు కోరుతున్నారు.

By:  Sivaji Kontham   |   20 Nov 2026 11:09 PM IST
రామాయణ క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!
X

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణ` బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే థియేటర్లలో ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న రావణుడు వర్సెస్ జటాయువు ఫైట్ సీన్ ఇప్పుడు నెట్టింట లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఒక‌ యూట్యూబ్ ఛానెల్ లో 4కే క్వాలిటీలో అప్లోడ్ అయిన ఈ వీడియో క్లిప్ పై నెటిజన్లు ర‌క‌రకాలుగా స్పందిస్తున్నారు.

ఈ సీన్ లో డీఎన్ఈజీ - ప్రైమ్ ఫోకస్ సంస్థలు అందించిన విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిని మించి ఉన్నాయని సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా జటాయువు ఎంట్రీ... పుష్పక విమానం విజువల్స్, రావణుడి పాత్రలో యష్ నటన అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్లో జటాయువు మరణించే సన్నివేశం చూసి కన్నీళ్లు ఆగలేదని... సినిమా విజయానికి ఈ ఒక్క ఎపిసోడ్ ప్రధాన కారణమని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఇదే సీన్‌లో సీత పాత్రలో నటించిన సాయి పల్లవి హావభావాలపై సోషల్ మీడియాలో విమర్శలు పోటెత్తుతున్నాయి. రావణుడు అపహరిస్తున్నప్పుడు.. జటాయువు తన కోసం ప్రాణత్యాగం చేస్తున్న సమయంలో సీత చాలా ప్రశాంతంగా... ఎలాంటి భయం లేకుండా ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఒక సీజీఐ పక్షి (జటాయువు) పలికించిన ఎమోషన్స్ కూడా సాయి పల్లవి ముఖంలో కనిపించలేదని.. ఆ పాత్రకు ఆమె న్యాయం చేయలేకపోయిందని కామెంట్ సెక్షన్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఈ కీలక సన్నివేశం ఆన్ లైన్ లో లీక్ అవ్వడంపై చిత్ర యూనిట్ స‌హా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఆరున్నరేళ్ల పాటు శ్రమించి రూపొందించిన ఈ మాస్టర్ పీస్ సీన్ ను ఇలా పైరసీ చేసి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ను చెడగొట్టవద్దని కోరుతున్నారు. ఏది ఏమైనా `రామాయణ`లోని ఈ హైలైట్ ఎపిసోడ్ అటు విజువల్ వండర్ గా ప్రశంసలు అందుకుంటూనే.. ఇటు నటీనటుల పర్ఫార్మెన్స్ పై చర్చకు దారితీస్తోంది. రామాయ‌ణం -1 ఇప్ప‌టికే 15 రోజుల్లో1600 కోట్లు వ‌సూలు చేసి 2000 కోట్ల క్ల‌బ్ వైపు దూసుకెళుతోంది. నితీష్ తివారీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విష‌యం తెలిసిందే.