Begin typing your search above and press return to search.

లాస్ ఏంజెల్స్ ప్రివ్యూలో భార‌తీయ స‌మాజం విలువ‌ గౌర‌వం పెంచిన స్టార్!

భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ అత్యంత భారీత‌నంతో తెరకెక్కిన చిత్రం `రామాయణం: పార్ట్ 1`.

By:  Sivaji Kontham   |   28 Oct 2026 3:09 PM IST
లాస్ ఏంజెల్స్ ప్రివ్యూలో భార‌తీయ స‌మాజం విలువ‌ గౌర‌వం పెంచిన స్టార్!
X

భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ అత్యంత భారీత‌నంతో తెరకెక్కిన చిత్రం `రామాయణం: పార్ట్ 1`. హాలీవుడ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లోని`డేవిడ్ గెఫెన్ థియేటర్`లో ఈ మూవీ అంతర్జాతీయ ప్రీమియర్ అట్టహాసంగా జరిగింది. శ్రీరాముడి పాత్రలో నటించిన బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా మెరిసిన సాయి పల్లవి, రావణాసురుడిగా కనిపించిన యష్, దర్శకుడు నితేష్ తివారీ - నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ రెడ్ కార్పెట్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయ సనాత‌న ఇతిహాసాన్ని గ్లోబల్ ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లే దిశగా రణ్‍బీర్ కపూర్ అంకితభావం, అత‌డి సంభాషణలు ఈ వేడుకలో ప్రధానంగా హైలైట్ అయ్యాయి.

ఈ అంతర్జాతీయ ప్రీమియర్ లో రణ్‍బీర్ కపూర్ వేష‌ధార‌ణ‌..రాయల్ లుక్.. ప్రవర్తనా శైలి ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసాయి. వెండి రంగు మిల‌మిల‌ల‌ జాకెట్, బ్లాక్ ట్రౌజర్స్‌తో సంప్రదాయభరితమైన భారతీయ శైలిని హాలీవుడ్ రెడ్ కార్పెట్‌పై చాటిచెప్పారు. శ్రీరాముడి లాంటి పవిత్రమైన .. బాధ్యతాయుతమైన పాత్రను పోషించడం తన నటనా ప్రయాణంలో అత్యున్నతమైన గౌరవంగా భావిస్తున్నానని, ఈ కథను కేవలం ఒక సినిమాగా కాకుండా తరతరాల సంస్కృతికి ప్రతిరూపంగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని రణ్‍బీర్ వ్యాఖ్యానించ‌డం.. అతడిలోని పరిణతిని చాటాయి.

ఈ ప్రీమియ‌ర్ షోలో రణ్‍బీర్ కపూర్ సరసన సీతాదేవిగా నటించిన సాయి పల్లవి ఎరుపు -గులాబీ రంగు జర్దోజీ చీరలో సాంప్రదాయ సౌందర్యంతో మెరిసిపోగా.. రావణాసురుడిగా నటించిన యష్ ప్రత్యేకంగా రూపొందించిన రావణ బ్రోచ్‌తో బ్లాక్ వెల్వెట్ సూట్‌లో కనిపించారు. జాడా పింకెట్ స్మిత్, జోనాథన్ స్కాట్ వంటి హాలీవుడ్ ప్రముఖులు హాజర‌వ్వ‌డం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ వేడుకలో రణ్‍బీర్, సాయి పల్లవి, యష్‌ల మధ్య ఉన్న పరస్పర గౌరవం, ఫ్రెండ్లీ బాండింగ్ వేడుకకు ప్రత్యేక కళను తీసుకువచ్చాయి.

సాంకేతికంగా ఈ చిత్రం ప్రపంచ స్థాయి ఫాంటసీ బ్లాక్‌బస్టర్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా రూపుదిద్దుకుంది. హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మర్ -ఎ.ఆర్. రెహమాన్ సంయుక్తంగా సంగీతాన్ని అందించగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత సంస్థ డిఎన్ఇజి విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను నిర్వహించింది. సుమారు 3 గంటల 15 నిమిషాల నిడివితో 3డి - ఐమ్యాక్స్ ఫార్మాట్లలో రూపొందిన ఈ విజువల్ వండర్, అంతర్జాతీయ వీక్షకులను సైతం విజువల్ స్కేల్, ఇంటెన్స్ పెర్ఫామెన్సెస్‌తో కట్టిపడేయ‌నుంది.

నవంబర్ 5న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో భారీగా విడుదలవుతున్న ఈ చిత్రంపై అంతర్జాతీయంగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సీతాప‌తి శ్రీరాముడిగా ర‌ణ‌బీర్ అభిన‌యం.. న‌మిత్- నితేష్ తివారీల అసాధార‌ణ‌ విజన్ భారతీయ సినిమా స్థాయిని గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మరో ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయమేన‌న్న చ‌ర్చా సాగుతోంది. కేవ‌లం వారం రోజుల‌లోనే ఈ భారీ సినిమా ఫ‌లితం తేల‌నుంది.