రామాయణంలో రాముడి కంటే రావణుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా?
రామాయణంలో శ్రీరాముడి కంటే రావణుడి పాత్రకే ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన ‘రామాయణం పార్ట్-1’ కూడా ఇదే ధోరణిలో సాగిందని కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రావణుడి గొప్పతనాన్ని చూపించడం తప్పు కాకపోయినా.. అతని అహంకారం, తప్పులను సమర్థిస్తూ శ్రీరాముడి ధర్మం, విలువలను పక్కన పెట్టడం ఎంతవరకు సరైనదనే చర్చ మొదలైంది. ప్రతినాయకుడి ఎలివేషన్ కంటే కథలోని అసలు సందేశానికి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.
By: Priya Chowdhary Nuthalapti | 7 Nov 2026 11:21 AM ISTభారతీయ సంస్కృతిలో రామాయణానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో తరాలుగా ప్రజలు శ్రీరాముడి కథను వింటూ పెరిగారు. రాముడు ఎన్నో తరాల వాళ్ళకి ఇన్స్పిరేషన్. కానీ ఇప్పటి సినిమాలు రామాయణంలో రాముడి కంటే రావణుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా అనే అసంతృప్తి ప్రేక్షకుల్లో ఈ మధ్య విడుదలైన రామాయణం పార్ట్ 1 కూడా ఇదే తరహాలో సాగిందని చాలా విమర్శలు కూడా వస్తున్నాయి.
నిజానికి రావణుడు కూడా రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్ర. అతను గొప్ప రాజు, మంచి పండితుడు, శివుడి భక్తుడు, శక్తివంతమైన యోధుడు. అయితే అతనిలో ఉన్న అహంకారం, కోపం, తప్పు నిర్ణయాలే చివరకు అతని పతనానికి కారణమయ్యాయి. అందుకే రావణుడి జీవితాన్ని తెరపై చూపించడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.
కానీ ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. ఒక ప్రతినాయకుడి గొప్పతనాన్ని చూపించే క్రమంలో హీరో అయిన శ్రీరాముడి విలువలను పక్కన పెట్టడం ఎంతవరకు సరైనది. అసలు రాముడు కన్నా రావణుడి క్యారెక్టర్ కి ఎలివేషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్.
ఇప్పటికే కొన్ని సినిమాల్లో సిగరెట్ తాగడం, అమ్మాయిలను వెంటపడటం వంటి తప్పు అలవాట్లను హీరోయిజంగా చూపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఖరికి రామాయణంలోని రావణుడి తప్పులను కూడా గొప్పతనంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రావణుడిని అర్థం చేసుకోవడం తప్పు కాదు. కానీ అతను చేసిన తప్పులను సమర్థించడం మాత్రం సరైన పద్ధతి కాదు.
రాముడి పాత్ర మనకు ఎన్నో గొప్ప విషయాలను చెబుతుంది. కానీ రాముడి పాత్రను ఎలివేస్ చేయడం మానేసి రావణుడు గొప్ప అని తెలియజేయడానికి మనవాళ్లు పడుతున్న తాపత్రయం చూస్తే.. నిజంగానే మన సినిమాల్లో ఎక్కడికి వెళుతున్నాయి అనే అనుమానం రాకమానదు.
