Begin typing your search above and press return to search.

రామాయ‌ణం ముందుగా చూసేది మోదీనా!

ఈ నేపథ్యంలో రామాయణం చిత్రానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చిత్ర యూనిట్ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

By:  Srikanth Kontham   |   7 Aug 2026 2:19 PM IST
రామాయ‌ణం ముందుగా చూసేది మోదీనా!
X

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న `రామాయణం` పై అంచ‌నాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం దేశ‌మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. రామాయ‌ణం కావ‌డంతో రాజకీయ వృత్తాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇప్ప‌టికే హిందు సంఘాల నుంచి హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. రామాయ‌ణాన్ని ఏమాత్రం వ‌క్రీక‌రించినా ప‌రిణ‌మాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చ‌రించారు. గతంలో వచ్చిన కొన్ని పౌరాణిక చిత్రాలు వివాదాల్లో చిక్కుకోవడం, మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయనే ఆరోపణలు రావడం వంటి పరిణామాలు మేకర్స్‌ను ఆందోళనకు గురిచేశాయి.

ఈ నేపథ్యంలో రామాయణం చిత్రానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చిత్ర యూనిట్ అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అధికారిక సెన్సార్ బోర్డు పరిశీలనకు ముందే సినిమాను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారనే వార్తలు తాజాగా ప్రచారంలోకి వ‌స్తున్నాయి. భారతీయ సనాతన సంస్కృతికి, ఇతిహాసాలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో అద్భుత దృశ్యకావ్యాన్ని ప్రధాని మోదీ స్వయంగా వీక్షించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తే అది సినిమాకు మరింత విశ్వసనీయతను తెస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమాలో పాత్రల చిత్రణ, సంభాషణలు , సాంస్కృతిక విలువలు ఏమాత్రం బెరుకు లేకుండా సరిగ్గా వచ్చాయా లేదా అనే కోణంలో ఈ ప్రత్యేక ప్రదర్శనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇలాంటి భారీ చిత్రాలకు రాజకీయ పెద్దల ఆమోదం ... సానుకూల స్పందన కోరడం అనేది బాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. అధికారిక సెన్సార్‌షిప్‌కు ముందే ఇలాంటి ప్రదర్శనలు జరగడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సినిమా పట్ల ఉన్న బాధ్యతగా కొనియాడుతుంటే? మరికొందరు మాత్రం ఇది అనవసరమైన ముందస్తు రాజకీయ తనిఖీగా అభివర్ణిస్తున్నారు. ఏదేమైనా ఈ వార్త సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తుంది.

మొత్తానికి కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కుతున్న సివిలైజేషనల్ ఎపిక్‌ను దేశ ప్రజల ముందుకు తీసుకువచ్చే ముందు అన్ని రకాల వివాదాలకు చెక్ పెట్టాలని మేకర్స్ పక్కా ప్రణాళికతో ఉన్నారు. నవంబర్ 2026లో దీపావళి కానుకగా విడుదల కానున్న తొలి భాగంపై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ప్రదర్శన నిజంగానే సినిమా విజయావకాశాలను ప్రభావితం చేస్తుందా? అనేది చూడాలి. అలాగే ఈ షోను ఏపీలో కూడా కూట‌మి పెద్దలంతా కూడా ఒకేసారి వీక్షించే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా స‌నాత‌న ధ‌ర్మం కోసం పోరాటం చేసిన పవ‌న్ క‌ళ్యాణ్ రామాయ‌ణం చూసి త‌ప్ప‌క త‌న అభిప్రాయాన్ని పంచుకునే అవ‌కాశం ఉంది.