Begin typing your search above and press return to search.

50 శాతం రెండో భాగం షూట్ పూర్తి.. నితీష్ తివారీకి స్ఫూర్తి ఈ తెలుగు ద‌ర్శ‌కుడు!

మొదటి భాగం విడుదల కాకుండానే సీక్వెల్ షూటింగ్‌ను సగానికి పైగా పూర్తి చేయడం వెనుక బలమైన నిర్మాణ వ్యూహాలు ఉన్నాయని దీనిని బ‌ట్టి అర్థ‌మైంది.

By:  Sivaji Kontham   |   6 Aug 2026 1:06 PM IST
50 శాతం రెండో భాగం షూట్ పూర్తి.. నితీష్ తివారీకి స్ఫూర్తి ఈ తెలుగు ద‌ర్శ‌కుడు!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ ఫ్రాంచైజీ సినిమాల నిర్మాణ శైలి వేగంగా మారుతోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం` రెండో భాగం షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయిందని కథానాయకుడు రణబీర్ కపూర్ వెల్లడించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రామాయణంలో ఉన్న అత్యంత భారీ నిడివి ఉండే మహోన్నత కథను సరిగ్గా చెప్పాలంటే 10 భాగాల సినిమా అవసరమవుతుందని... కానీ దానిని రెండు భాగాలకు సైజ్ త‌గ్గించి తీసుకురావడం పెద్ద సవాల్‌లాంటిద‌ని అత‌డు పేర్కొన్నారు. మొదటి భాగం విడుదల కాకుండానే సీక్వెల్ షూటింగ్‌ను సగానికి పైగా పూర్తి చేయడం వెనుక బలమైన నిర్మాణ వ్యూహాలు ఉన్నాయని దీనిని బ‌ట్టి అర్థ‌మైంది.

ఈ తరహా `బ్యాక్-టు-బ్యాక్ షూటింగ్` లేదా `సైమల్టేనియస్ ప్రొడక్షన్` ఫార్ములాకు భారతదేశంలో పునాది వేసింది దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన `బాహుబలి: ది బిగినింగ్` చిత్రీకరణ సమయంలోనే `బాహుబలి 2: ది కన్‌క్లూజన్`కు సంబంధించిన దాదాపు 30 నుండి 40 శాతం కీలక సన్నివేశాలను పూర్తి చేశారు. ఆ తర్వాత కేజీఎఫ్ ఫ్రాంచైజీ విషయంలో కూడా ప్రశాంత్ నీల్ మొదటి భాగం షూట్ చేస్తున్నప్పుడే `కేజీఎఫ్ 2`కు కావలసిన దాదాపు 15-20 శాతం సన్నివేశాలను పూర్తి చేసుకున్నారు. అలాగే సుకుమార్ `పుష్ప: ది రైజ్` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే `పుష్ప 2: ది రూల్`కు సంబంధించిన కొంత భాగాన్ని (దాదాపు 10-15 శాతం) చిత్రీకరించారు. `దురంధ‌ర్` విష‌యంలో పార్ట్ 2 మెజారిటీ చిత్రీక‌ర‌ణను ఆదిత్యాధ‌ర చాలా ముందు చూపుతో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే ఇప్పుడు `రామాయణం` ఏకంగా 50 శాతం సీక్వెల్ షూటింగ్‌ను మొదటి భాగం ప్రదర్శనకు ముందే పూర్తి చేసి ఈ ఫార్ములాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు మేక‌ర్స్‌.

ఆర్థిక విశ్లేషణ కోణంలో చూస్తే... ఈ విధానం వల్ల నిర్మాణ వ్యయం భారీగా తగ్గుతుంది. ఒకే భారీ సెట్ వేసినప్పుడు, రెండు భాగాలకు కావలసిన సన్నివేశాలను ఒకేసారి చిత్రీకరించడం వల్ల ప్రొడక్షన్ డిజైన్ ఖర్చులు దాదాపు 30-40 శాతం ఆదా అవుతాయి. నటీనటుల డేట్లు, సాంకేతిక నిపుణుల కాలింగ్ షీట్లు, కెమెరా- విఎఫ్‌ఎక్స్ పరికరాల అద్దెలు మళ్లీ మళ్లీ కేటాయించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా పాత్రల శారీరక రూపం.. హెయిర్ క‌ట్ .. వయస్సు ప్రతిబింబించే తీరు మారకుండా నటీనటులలో ఒకే రకమైన కంటిన్యుటీని కాపాడటానికి ఈ పద్ధతి అద్భుతంగా తోడ్పడుతుంది.

అయితే భారీ ఫ్రాంచైజీలను ఈ రీతిలో ప్లాన్ చేయడం దర్శకులకు, నిర్మాతలకు అతిపెద్ద సవాలు. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రీ-ప్రొడక్షన్ దశలోనే రెండు భాగాల స్క్రిప్ట్‌లు, స్టోరీ బోర్డ్‌లు నూటికి నూరు శాతం సిద్ధంగా ఉండాలి. నటీనటుల నుంచి సుదీర్ఘమైన బల్క్ డేట్లను ఒకేసారి రాబట్టాల్సి ఉంటుంది. ఏ నటుడు ఏ భాగానికి సంబంధించి ఏ కాస్ట్యూమ్‌లో నటిస్తున్నారో క్లారిటీ ఇచ్చే పక్కా షెడ్యూలింగ్ వ్యూహం దర్శకుడికి ఉండాలి. నితేష్ తివారీ -నమిత్ మల్హోత్రాల బృందం `రామాయణం` కోసం హాలీవుడ్ స్థాయి విఎఫ్‌ఎక్స్ స్టూడియోలైన DNEG సేవలను వాడుకుంటూ.. ఈ సమగ్ర ప్లానింగ్‌ను ముందే సిద్ధం చేసుకోవడం వల్లే ఇది సాధ్యమైంది.

చివరగా.. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో లేదో తెలియకుండానే రెండో భాగాన్ని 50 శాతం పూర్తి చేయడం అనేది కొంత ఆర్థికపరమైన రిస్క్‌తో కూడుకున్నదే. కానీ రామాయణం వంటి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన... విలువలనిచ్చే యూనివ‌ర్శ‌ల్‌ కథలకు ఆ రిస్క్ చాలా తక్కువ. మొదటి భాగం సృష్టించే హైప్.. రెండో భాగానికి మరింత పెద్ద మార్కెట్‌ను తెచ్చిపెడుతుంది. పైగా విఎఫ్‌ఎక్స్ పోస్ట్-ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం లభిస్తుంది. ఆ రకంగా చూస్తే.. మునుముందు రోజుల్లో భారతీయ చిత్రసీమలో మల్టీ-పార్ట్ విజువల్ వండర్లకు ఈ సైమల్టేనియస్ షూటింగ్ విధానమే ప్రామాణికంగా మారనుంది.