Begin typing your search above and press return to search.

లాంగ్ ర‌న్ కోసం రామాయ‌ణ మేక‌ర్స్ కొత్త స్ట్రాట‌జీ

ఇటీవల ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో భారీ సినిమాల పరిస్థితి చూస్తే, అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌కు రావడం కంటే వాయిదా పడటమే ఎక్కువగా కనిపిస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   23 May 2026 6:00 PM IST
లాంగ్ ర‌న్ కోసం రామాయ‌ణ మేక‌ర్స్ కొత్త స్ట్రాట‌జీ
X

ఇటీవల ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో భారీ సినిమాల పరిస్థితి చూస్తే, అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్‌కు రావడం కంటే వాయిదా పడటమే ఎక్కువగా కనిపిస్తోంది. షూటింగ్ ఆలస్యం, విజువల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్స్, బిజినెస్ లెక్కలు, థియేటర్ల సమస్యలు.. ఇలా అనేక కారణాలతో పెద్ద సినిమాలు ఒక్కోసారి నెలలు, మరికొన్ని సార్లు సంవత్సరాల పాటు కూడా వెనక్కి వెళ్తున్నాయి.

అలాంటి పరిస్థితుల్లో ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ‌ మాత్రం అందరికీ షాకిచ్చేలా ఒక కొత్త నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. మొదట దీపావళి కానుకగా నవంబర్ 7న రిలీజ్ చేయాలని భావించిన ఈ సినిమాను ఇప్పుడు వారం ముందుగానే, అంటే అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వాయిదాల కాలంలో ఒక భారీ పాన్ ఇండియా సినిమాను ముందుగానే రిలీజ్ చేయాలనే ఆలోచన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నిర్ణయం వెనుక పూర్తిగా ఒక భారీ మార్కెటింగ్ గేమ్ ప్లాన్ పనిచేస్తోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సాధారణంగా దీపావళి లాంటి పెద్ద పండగ సీజన్‌లో సినిమాలు రిలీజ్ చేస్తే తొలి వీకెండ్ కలెక్షన్లు భారీగా ఉంటాయి. కానీ రామాయణ టీమ్ మాత్రం ఆ లెక్కను మరింత ముందుకు తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది. పండగకు వారం ముందు రిలీజ్ చేస్తే మొదటి వారంలోనే అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ ద్వారా భారీ వసూళ్లు సాధించవచ్చని, ఆ తర్వాత వచ్చే దీపావళి సెలవుల్లో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఒకే రిలీజ్‌తో రెండు భారీ వీకెండ్లను క్యాష్ చేసుకునే స్ట్రాటజీ ఇది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో దీపావళి సీజన్‌కు ఉండే బాక్సాఫీస్ బ‌లాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్ రూపొందించారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

మ‌రో ఆసక్తికరమైన విషయ‌మేంటంటే.. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమాపై అసాధారణ స్థాయి నమ్మకంతో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సాధారణంగా పెద్ద సినిమాలు తొలి మూడు రోజుల కలెక్షన్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటాయి. కానీ రామాయణ విషయంలో మాత్రం లాంగ్ రన్‌పైనే అసలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్ బలంగా ఉంటే మౌత్ టాక్ ద్వారా రెండో వారంలో కూడా క‌లెక్ష‌న్లు పెరుగుతాయని, పండగ టైమ్ కు ఆ హైప్ మరింత వ్యాపిస్తుంద‌ని మేకర్స్ నమ్ముతున్నారట. అందుకే ఓపెనింగ్స్ కోసం కాకుండా సస్టెయినబుల్ బాక్సాఫీస్ రన్ కోసం ముందుగానే రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇది కేవలం ఒక రిలీజ్ ప్లాన్ మాత్రమే కాకుండా కంటెంట్‌పై ఉన్న కాన్ఫిడెన్స్‌కు సంకేతంగా కూడా ఇండస్ట్రీ వర్గాలు చూస్తున్నాయి.

నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ఇతిహాస సినిమాలో రాముడిగా ర‌ణ్‌బీర్ క‌పూర్, సీతగా సాయి ప‌ల్ల‌వి, రావణుడిగా య‌ష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను సృష్టించింది. అందుకే రామాయ‌ణ‌ను కేవలం ఒక సినిమాగా కాకుండా, ఇండియన్ బాక్సాఫీస్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే పాన్ ఇండియా ఈవెంట్‌గా ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రీపోన్ వార్తలతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.