Begin typing your search above and press return to search.

వేల ఏళ్ల ఆత్మకు వెండితెర రూపం: `రామాయణ` వెనుక నితేశ్ తివారీ గ్రేట్ విజన్!

భారతీయ సాంస్కృతిక మూలాల్లో.. ప్రతి గుండె సప్పుడులో వేల ఏళ్లుగా సజీవంగా నిలిచిన ఏకైక కావ్యం రామాయణం.

By:  Sivaji Kontham   |   19 July 2026 10:00 AM IST
వేల ఏళ్ల ఆత్మకు వెండితెర రూపం: `రామాయణ` వెనుక నితేశ్ తివారీ గ్రేట్ విజన్!
X

భారతీయ సాంస్కృతిక మూలాల్లో.. ప్రతి గుండె సప్పుడులో వేల ఏళ్లుగా సజీవంగా నిలిచిన ఏకైక కావ్యం రామాయణం. కాలం మారినా, తరాలు మారినా అందులోని మానవీయ విలువలు ఎప్పటికీ చిరస్థాయిగానే ఉంటాయి. ఈ పురాణేతిహాసాన్ని నేటి తరం అంతర్జాతీయ సినీ ప్రమాణాలకు అనుగుణంగా వెండితెరపై ఆవిష్కరించే సదుద్దేశంతో.. చిత్ర నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా `రామాయణ` ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఈ దృశ్య కావ్యం అధికారిక ప్రస్థానాన్ని చాటుతూ ఢిల్లీ వేదికగా నిర్వహించిన `ప్రథమ సంకల్ప` వేడుక.. కేవలం ఒక సినిమా ఈవెంట్‌లా కాకుండా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే ఒక పవిత్రమైన ముందడుగులా సాగింది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నితేశ్ తివారీ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు, ఈ సినిమా కేవలం గ్రాఫిక్స్ హంగులతో కూడిన విజువల్ వండర్ మాత్రమే కాదని స్పష్టం చేశాయి. రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేటిత‌రం జెన్-జి ప్రేక్షకులకు అర్థమయ్యేలా మార్చాల్సిన అవసరం ఒక దర్శకుడిగా తనకు రాలేదని.. ఎందుకంటే అది ఇప్పటికే విశ్వజనీనమైన ఆమోదం పొందిన కథ అని ఆయన విశ్లేషించారు. ఒక క్రియేట‌ర్‌గా తనపై ఉన్న ఏకైక బాధ్యత ఏంటంటే.. తరతరాలుగా భారతీయులు పూజించే ఈ పవిత్ర గాథను ఎలాంటి తడబాటు లేకుండా సంపూర్ణ నిజాయితీతో.. ప్రామాణికతతో.. అత్యున్నత గౌరవంతో తెరపై రీక్రియేట్ చేయడమేనని ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

ఈ మహా కావ్యాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి కేవలం కథనంపైనే కాకుండా సినిమాకు సంబంధించిన ప్రతి విభాగాన్ని అత్యంత పకడ్బందీగా తీర్చిదిద్దినట్లు దర్శకుడి మాటలను బట్టి అర్థమవుతోంది. స్క్రిప్ట్ రచన, నటీనటుల ఎంపిక, ప్రొడక్షన్ డిజైన్, సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ప్రతి ఒక్క ఫ్రేమ్ కోసం చిత్ర‌బృందం ఎంతగానో నిమ‌గ్న‌మై పనిచేసింది. రామాయణానికి ఉన్న పౌరాణిక వారసత్వ విలువ తగ్గకుండా చూస్తూనే.. నేటి తరం థియేటర్లలో కోరుకునే అత్యున్నత సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించాలనే సంకల్పం ఈ భారీ సినిమా మేకింగ్ వెనుక స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి నిపుణులతో కలిసి పనిచేయడం తన కెరీర్‌లోనే ఒక మరువలేని ప్రయాణమని దర్శకుడు పేర్కొన్నారు.

సాంకేతిక హంగుల విషయానికి వస్తే...ఈ చిత్రం భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సమర్పణలో, అంతర్జాతీయ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ డిఎన్‌ఈజి (DNEG), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీనికి మరింత అదనపు బలాన్ని చేకూరుస్తూ ఆస్కార్ అవార్డు విజేతలైన హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జిమ్మర్, భారతీయ సంగీత విద్వాంసుడు ఏ.ఆర్. రెహమాన్ కలిసి స్వరాలు అందిస్తుండటం విశేషం. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా..ఈ పౌరాణిక గాథలోని నిగూఢమైన భావోద్వేగాలను, మానవత్వాన్ని. వేల ఏళ్లుగా ఈ కథను బతికించిన అసలైన ఆత్మను ప్రేక్షకులు థియేటర్లలో అనుభూతి చెందేలా ఈ కాంబినేషన్ మ్యాజిక్ చేయబోతోంది.

ఈ `ప్రథమ సంకల్ప` కార్యక్రమంతో భారతదేశం నుండి ప్రపంచ వ్యాప్త వేదికపైకి `రామాయణ` ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం అధికారిక థియేట్రికల్ ట్రైలర్ 24 జూలై 2026న డిజిటల్ వేదికలపై విడుదల కానుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ దృశ్య కావ్యం మొదటి భాగం `రామాయణ: పార్ట్ 1` దీపావళి 2026 పండుగ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా.. భారతీయ సినిమా ప్రతిష్టను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడానికి ఈ చిత్రం సిద్ధమవుతోంది.