'రామాయణ' ఇంగ్లీష్ ట్రైలర్.. ఇక ప్రపంచంపై దండయాత్ర మొదలు!
భారతీయ చలనచిత్ర రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే సరికొత్త అధ్యాయం ఆరంభమైంది.
By: Sivaji Kontham | 5 Aug 2026 11:47 PM ISTభారతీయ చలనచిత్ర రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే సరికొత్త అధ్యాయం ఆరంభమైంది. సాధారణంగా భారతీయ చిత్రాలు ఇతర దేశాల భాషల్లోకి అనువాదం కావడం డిజిటల్ యుగంలో సాధారణమే అయినా.. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో, విజువల్ వండర్‌గా రూపొంది నేరుగా ఆంగ్లంలో ప్రదర్శనకు సిద్ధమవడం సంచలనాత్మకమైన మార్పు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం `రామాయణ` రూపంలో ఈ అరుదైన ఫీట్ సాధ్యమవుతోంది. ఈ ప్రయత్నంతో గ్లోబల్ బాక్సాఫీస్‌పై భారతీయ సినిమా దండయాత్ర అధికారికంగా మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ భారీ విజువల్ స్పెక్టకిల్ ఆంగ్ల ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారతదేశం నుంచి ఇకపై వరల్డ్ క్లాస్ సినిమాలు వరుసగా రాబోతున్నాయనే బలమైన భరోసాని ఈ చిత్రం ఇస్తోంది. `రామాయణ` వేసిన ఈ గ్లోబల్ బాటను అనుసరిస్తూ భవిష్యత్తులో రాబోతున్న `వారణాసి`, `డ్రాగన్`, `కల్కి 2898 ఏడి 2`, రాకా వంటి భారీ ప్రాజెక్టులు కూడా నేరుగా ఆంగ్లంలోకి అనువాదమై ప్రపంచవ్యాప్తంగా విసృత స్థాయిలో విడుదలవుతాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే ఈ ఇంగ్లీష్ ట్రైలర్‌లో ఉపయోగించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డబ్బింగ్ సాంకేతికతపై సోషల్ మీడియాలో విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్‌లోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, పాత్రల పెదవుల కదలికలకు సరిగ్గా సరిపోయేలా ఏఐ ద్వారా చేసిన లిప్-సింక్ విధానం చాలా బాగుందని కొందరు సాంకేతిక నిపుణులు-నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ తరహా గ్లోబల్ అప్పీల్ సినిమాను రూ. 5000 కోట్ల క్లబ్ వైపు తీసుకెళ్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అంతర్జాతీయ ఆంగ్ల వీక్షకుల నుంచి కొన్ని నిర్మాణాత్మక విమర్శలు కూడా వస్తున్నాయి. కేవలం ఏఐ పరిజ్ఞానంతో డబ్బింగ్ చెప్పించడం వల్ల సంభాషణల్లో ఉండాల్సిన సహజమైన భావోద్వేగాలు లోపించాయని వారు అభిప్రాయపడుతున్నారు. హాలీవుడ్ లేదా గ్లోబల్ ఆడియన్స్‌ను మానసికంగా కనెక్ట్ చేయాలంటే ఏఐ వాయిస్‌కు బదులుగా ప్రామాణిక యుకే లేదా యుఎస్ వాయిస్ ఆర్టిస్టులతో ప్రొఫెషనల్‌గా మళ్లీ డబ్బింగ్ చెప్పించాలని చిత్రబృందానికి సూచిస్తున్నారు.
మొత్తానికి ఏఐ డబ్బింగ్ సాంకేతికత పరంగా నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టినా.. భావోద్వేగాలను పండించడంలో ఉన్న చిన్నపాటి లోపాలను సరిదిద్దాలని నెటిజన్లు కోరుతున్నారు. సాంకేతికతను, సహజత్వంతో మేళవించి ముందుకు వెళితే `రామాయణ` చిత్రం అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని స్పష్టమవుతోంది.
