రామాయణం మొదటి భాగం ముగింపు ఇదే
అయితే రామాయణం మొదటి భాగం ఎక్కడితో ఎండ్ అవుతుంది? అనేదానికి ఇప్పుడు సమాధానం వచ్చింది. సీతను వెతుకుతూ వెళ్లిన శ్రీరాముడికి జటాయువు జాడ చెప్పే సన్నివేశంతో మొదటి భాగం ముగుస్తుంది.
By: Sivaji Kontham | 31 Aug 2025 11:35 AM ISTదాదాపు 4000 కోట్ల బడ్జెట్‌తో `రామాయణం` రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్ కపూర్, సాయిపల్లవి, సన్నీడియోల్, రవి దూబే, యష్ సహా పలువురు అగ్ర తారలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. కాస్టింగ్ కోసం, వీఎఫ్ఎక్స్ - కాస్ట్యూమ్స్ కోసం భారీ మొత్తంలో బడ్జెట్ ఖర్చవుతోంది.
శరవేగంగా మొదటి భాగం చిత్రీకరణను పూర్తి చేసి వచ్చే ఏడాది దీపావళి నాటికి రిలీజ్ చేయాలనేది ప్లాన్. నితీష్ తివారీ దీనికోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇప్పటివరకూ చాలాసార్లు రామాయణం తెరకెక్కింది. కానీ ఇంత భారీ బడ్జెట్ ఎప్పుడూ కేటాయించలేదు. ఈసారి రణబీర్ కపూర్ రామాయణం పూర్తిగా హాలీవుడ్ సాంకేతికతతో అద్భుతమైన టెక్నిక్ తో రూపొందుతోంది. అవతార్, 300, గ్లాడియేటర్ రేంజులో సాంకేతికంగా విజువల్ మాయాజాలాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. దీనికోసం ఇంత పెద్ద బడ్జెట్ ని కేటాయించామని నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రా వెల్లడించారు.
అయితే రామాయణం మొదటి భాగం ఎక్కడితో ఎండ్ అవుతుంది? అనేదానికి ఇప్పుడు సమాధానం వచ్చింది. సీతను వెతుకుతూ వెళ్లిన శ్రీరాముడికి జటాయువు జాడ చెప్పే సన్నివేశంతో మొదటి భాగం ముగుస్తుంది. జటాయువు పాత్రకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ అందిస్తుండడం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇక రెండో భాగంలో ఆ తర్వాత కథ మొదలవుతుంది. వానరాల సాయంతో రావణ లంకపై శ్రీరాముడి దాడి, సీతను తన రాజ్యానికి తిరిగి తీసుకురావడం, అగ్ని పరీక్ష చేయించడంతో కథ ముగుస్తుంది.
నిజానికి అవతార్ కోసం విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ని ఏ స్థాయిలో ఉపయోగించారో దానికి మించిన వీఎఫ్ఎక్స్ మాయాజాలం ఉపయోగించడానికి ఆస్కారం కల్పించే కథ `రామాయణం`లో ఉంది. శ్రీరాముడి దివ్యమైన రంగు- రూపాన్ని, ఆంజనేయుడి తోకను ఉపయోగించుకుని `అవతార్` కథను జేమ్స్ కామెరూన్ వర్కవుట్ చేయగా, ఇప్పుడు ఏకంగా శ్రీరాముడి చరిత్రను ఉపయోగించుకుని సినిమా తీస్తున్నాడు నితీష్ తివారీ. అందుకే రామాయణం కథను విజువల్ వండర్ గా నిలబెడతాడని అందరూ ఆశిస్తున్నారు.
రామాయణం కథను ప్రపంచానికి ఆవిష్కరించడమే ధ్యేయంగా రెండు భాగాల సిరీస్ కోసం రూ.4000 కోట్ల బడ్జెట్ ని కేటాయించామని ఘనంగా ప్రకటించారు నిర్మాత నమిత్ మల్హోత్రా. ఇంత పెద్ద బడ్జెట్‌తో అవతార్ ని మించిన గొప్ప మ్యాజిక్ చేస్తారనే ఆశిద్దాం. దాదాపు 2000 కోట్ల (237 మిలియన్ల అమెరికన్ డాలర్లు) బడ్జెట్ తో నిర్మించిన అవతార్ -1 చిత్రం దాదాపు 13000 కోట్లు వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన `రామాయణం` కథను సినిమా రూపంలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అంత పెద్ద వసూళ్లను సాధించాలని ఆకాంక్షిద్దాం.
