Begin typing your search above and press return to search.

రికార్డులే రికార్డులు: మ్యూజిక్ రైట్స్‌తో కోట్లు కొల్లగొడుతున్న భారీ ప్రాజెక్ట్‌లు!

భారతీయ చిత్ర పరిశ్రమలో సినిమాల డిజిటల్, శాటిలైట్ హక్కులతో పాటు ఆడియో (మ్యూజిక్) రైట్స్‌కు విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది.

By:  Sivaji Kontham   |   4 Aug 2026 5:00 AM IST
రికార్డులే రికార్డులు: మ్యూజిక్ రైట్స్‌తో కోట్లు కొల్లగొడుతున్న భారీ ప్రాజెక్ట్‌లు!
X

భారతీయ చిత్ర పరిశ్రమలో సినిమాల డిజిటల్, శాటిలైట్ హక్కులతో పాటు ఆడియో (మ్యూజిక్) రైట్స్‌కు విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఒకప్పుడు నామమాత్రపు ధరలకు అమ్ముడయ్యే మ్యూజిక్ ఆల్బమ్‌లు.. నేడు ఓటీటీలు, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల పోటీతో వందల కోట్ల బిజినెస్ సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు తమ ఆడియో హక్కుల ద్వారా నాన్-థియేట్రికల్ రెవెన్యూలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ.. చిత్ర నిర్మాణ వ్యయంలో పెద్ద మొత్తాన్ని విడుదలకు ముందే రాబడుతున్నాయి.

ఈ క్రమంలో అత్యధిక ఆడియో హక్కుల ధరలు దక్కించుకున్న చిత్రాలలో టాప్ 10లో ఉన్న వాటి గురించి చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల‌ రణబీర్ కపూర్ నటించిన `రామాయణం` ఫ్రాంఛైజీ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యం రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ. 75 కోట్ల భారీ ధరకు ఆడియో హక్కులు అమ్ముడయ్యాయి. దీని తర్వాత ధురంధర్ 2 అత్యంత భారీ ధర దక్కించుకుని రెండవ స్థానాన్ని కైవసం చేసుకోగా.. తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ నటిస్తున్న `కింగ్` చిత్రం ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `కింగ్` సినిమా ఆడియో హక్కులను దక్కించుకోవడానికి సోనీ మ్యూజిక్, టీ-సిరీస్, సరేగమ వంటి దిగ్గజ సంస్థలు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆఖరికి రూ. 50 కోట్ల రికార్డు ధరకు ఒక ప్రముఖ లేబుల్ ఈ ఆల్బమ్‌ను సొంతం చేసుకుంది. ఒకే ఒక్క భాగానికి (సింగిల్ ఫిల్మ్) గాను ఈ స్థాయిలో రూ. 50 కోట్లు పలకడం నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో సరికొత్త సంచలనంగా నిలిచింది. సచిన్-జిగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది.

కేవలం బాలీవుడ్ చిత్రాలే కాకుండా దక్షిణ భారత (సౌత్) సినిమాలు కూడా ఆడియో రైట్స్ బిజినెస్‌లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 చిత్రాలతో పాటు రాక్ స్టార్ అనిరుధ్ సంగీతం అందించిన రజనీకాంత్ `జైలర్`, దళపతి విజయ్ `గోట్`, జూనియర్ ఎన్టీఆర్ `దేవర` వంటి సౌత్ పాన్-ఇండియా చిత్రాలు రూ. 25 కోట్ల నుండి రూ. 35 కోట్ల రేంజ్‌లో ఆడియో హక్కుల ద్వారా సంచలన లాభాల్ని అందించాయి.

భారతీయ చలనచిత్ర వాణిజ్యంలో అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ ఆడియో డీల్స్‌ను పరిశీలిస్తే.. రామాయణం ఫ్రాంఛైజీ (రూ. 75 కోట్లు), ధురంధర్ 2, కింగ్ (రూ. 50 కోట్లు) తొలి మూడు స్థానాల్లో నిలవగా.. వాటి తర్వాత ఆర్ఆర్ఆర్ (రూ. 25-30 కోట్లు), దేవర, పుష్ప 2, జైలర్, గోట్, కల్కి 2898 ఏడి, సలార్ చిత్రాలు నిలిచాయి. నాణ్యమైన సంగీతం, పాన్-ఇండియా అప్పీల్ ఉన్న సినిమాలకు ఆడియో మార్కెట్‌లో ఈ డిమాండ్ మునుముందు రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.