Begin typing your search above and press return to search.

రామాయ‌ణ‌: వివాదాలు- విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా భారీ ఓపెనింగులపైనే ఆశ‌లు!

టీజ‌ర్, ట్రైల‌ర్ ద‌శ‌లో కొన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా కానీ... ఈ సినిమా విజువ‌ల్ గ్రాండియారిటీపై కొంత ఆస‌క్తి నెల‌కొంది.

By:  Sivaji Kontham   |   1 Nov 2026 12:13 PM IST
రామాయ‌ణ‌: వివాదాలు- విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా భారీ ఓపెనింగులపైనే ఆశ‌లు!
X

మోస్ట్ అవైటెడ్ `రామాయణం: రైడ్ ఆఫ్ ది లెజెండ్` విడుదలకు ఇంకో 4 రోజుల స‌మ‌య‌మే మిగిలి ఉంది. ర‌క‌ర‌కాల క్రిటిసిజ‌మ్ న‌డుమ కూడా రామాయ‌ణ క‌థ‌ను వెండితెర‌పై వీక్షించాల‌ని.. 5 న‌వంబ‌ర్ విడుద‌ల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ నటించిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీనిని ప్ర‌పంచ స్థాయిలో రూపొందించిన భార‌తీయ సినిమాగా చూడాల‌ని నిర్మాత‌లు న‌మిత్ మ‌ల్హోత్రా- య‌ష్ ప‌దే ప‌దే ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో అభ్య‌ర్థిస్తున్నారు.

టీజ‌ర్, ట్రైల‌ర్ ద‌శ‌లో కొన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా కానీ... ఈ సినిమా విజువ‌ల్ గ్రాండియారిటీపై కొంత ఆస‌క్తి నెల‌కొంది. దీంతో విడుదలకు ముందే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో భారీ ఓపెనింగులు సాధిస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. ముఖ్యంగా యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే 1- మిలియన్ డాల‌ర్ మార్కును దాటేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో నిర్వహించిన ప్రత్యేక ప్రీమియర్ షోల నుంచి ఇప్ప‌టికే స‌మీక్ష‌లు కూడా వెలువ‌డ్డాయి. విజువల్ ఎఫెక్ట్స్, మేకింగ్ స్కేల్, నటీనటుల పనితీరు గురించి కొంత చ‌ర్చ సాగింది.

తాజా స‌మాచారం మేర‌కు భారతదేశంలో కూడా టికెట్ ప్రీ-సేల్స్ జోరందుకున్నాయి. బుక్ మై షో వేదికగా నిన్న ఒక్కరోజే ఏకంగా 50 వేల పైచిలుకు టిక్కెట్లు అమ్ముడవ్వడం భారతీయ ఆడియన్స్‌లో ఉన్న ఉత్సుకతకు అద్దం పడుతోంది. అయితే సరిగ్గా విడుదల ముంగిట బుక్‌మైషోలో ఈ సినిమా పేరును `నమిత్ మల్హోత్రాస్ రామాయణ` నుంచి కేవలం `రామాయణ` అని మార్చడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పవిత్రమైన ఈ ఇతిహాసానికి ఒక వ్యక్తి పేరును తగిలించడంపై గతంలోనే తీవ్ర విమర్శలు రావడమే కాకుండా.. `వాల్మీకి రామాయణం` అని పేరు పెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు న‌మిత్ పేరు తొల‌గింపు- టైటిల్ మార్పు వెనుక రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సినిమాలో న‌టించిన న‌టీమ‌ణులు చేసిన వ్యాఖ్యల చుట్టూ ముసిరిన వివాదాలు, ట్రైలర్ పైనా వ్యక్తమైన భిన్నాభిప్రాయాల నుంచి దృష్టి మళ్లించి అడ్వాన్స్ బుకింగ్స్‌ను కాపాడుకోవడానికి నిర్మాతలు చేసిన డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నమని కొందరు భావిస్తుంటే.. మరికొందరు ఇది కేవలం యాప్‌లోని సాంకేతిక లోపం మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ఈ వివాదాలు -మార్కెటింగ్ వ్యూహాలు సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్‌గా నిలుస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

సవాళ్లు - వివాదాలు ఎలా ఉన్నా కానీ.. సాంకేతికంగా ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు నితీష్ తివారీ, న‌మిత్ చెబుతున్నారు. ప్రఖ్యాత డిఎన్‌ఇజి విజువల్ ఎఫెక్ట్స్, ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మర్, భారతీయ దిగ్గజం ఏఆర్ రెహమాన్‌ల సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. బహు భాషల్లో, ఐమాక్స్ , 3డి ఫార్మాట్లలో నవంబర్ 5 న గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తున్న ఈ పౌరాణిక చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.