Begin typing your search above and press return to search.

నోల‌న్ 'ది ఒడిస్సీ'ని మించిన టార్గెట్.. 40 భాష‌ల్లో 'రామాయ‌ణం'!

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన దృశ్యకావ్యం `ది ఒడిస్సీ` బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది.

By:  Sivaji Kontham   |   12 Oct 2026 9:00 PM IST
నోల‌న్ ది ఒడిస్సీని మించిన టార్గెట్.. 40 భాష‌ల్లో రామాయ‌ణం!
X

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన దృశ్యకావ్యం `ది ఒడిస్సీ` బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. సుమారు $250 మిలియన్ల (దాదాపు రూ. 2,100 కోట్లు) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం... ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్‌లో ఏకంగా $1.78 బిలియన్లకు పైగా (సుమారు రూ.15,000 కోట్ల వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ప్రధానంగా ఇంగ్లీష్‌తో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌ను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. అయితే హాలీవుడ్ స్థాయిని మించి భారతీయ సనాతన ఇతిహాసాన్ని ప్రపంచ నూతన దిశకు పరిచయం చేసేలా నితిన్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం`. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మహాకావ్యం ఏకంగా 40 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండటం విశేషం.

భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇప్పటివరకు వచ్చిన కొన్ని భారీ చిత్రాల భాషల విస్తృతి.. వాటి బాక్సాఫీస్ వసూళ్లు పరిశీలిస్తే పాన్-ఇండియా స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి సినిమాల ప్రయాణం స్పష్టమవుతుంది. రాజమౌళి విజువల్ వండర్ `బాహుబలి` సిరీస్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం వంటి ప్రధాన భాషల్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,800 కోట్లకు పైగా వసూలు చేయగా.. ప్రశాంత్ నీల్ - యష్ కాంబినేషన్‌లో వచ్చిన `కేజీఎఫ్`(కేజీఎఫ్‌ చాప్ట‌ర్ 1 & 2) ప‌లు భాషల్లో సుమారు 1,200 కోట్లకు పైగా రాబట్టింది. అలాగే సుకుమార్ - అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన `పుష్ప 2` బాక్సాఫీస్ వద్ద సుమారు 1,800 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది. ఇక బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్-జవాన్ సినిమాలు తలా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేయగా, ఇటీవల వచ్చిన `ధురంధర్ 2` కూడా సుమారు 1,700 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. దురంధ‌ర్ 1, దురంధ‌ర్ 2 క‌లుపుకుని 3000 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం.

ఈ చిత్రాలన్నీ పరిమిత భాషల్లో (గరిష్టంగా 5 నుంచి 6 భాషల్లో) విడుదలై అంత భారీ వసూళ్లను సాధించగా.. ఇప్పుడు ఏకంగా 40 భాషల్లో విడుదలవుతున్న `రామాయణం` సరికొత్త గ్లోబల్ రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. `ది ఒడిస్సీ` సినిమా కేవలం కొన్ని ముఖ్యమైన భాషల్లో మాత్రమే విడుదలై అంత భారీ వసూళ్లు సాధించినా.. `రామాయణం` మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రతిమూలకు చేరేలా ఏకంగా 40 భాషల్లో డబ్ అవుతోంది. కేవలం ఒక దేశం లేదా కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా ప్రపంచంలోని ప‌లు ప్రాంతాల ప్రేక్షకులను వారి సొంత భాషల్లోనే పలకరించాలనే ఈ భారీ ప్రణాళిక సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్తోంది.

ఈ గ్లోబల్ ప్రమోషన్స్- వైవిధ్యమైన రిలీజ్ వెనుక అంతర్జాతీయ దిగ్గజ పంపిణీ సంస్థ `సోనీ పిక్చర్స్` భాగస్వామ్యం ఉంది. సోనీ పిక్చర్స్ లాంటి అగ్ర పంపిణీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండటంతో హాలీవుడ్ మేటి చిత్రాలకు దీటుగా `రామాయణం`పై అంతర్జాతీయ స్థాయిలో అపూర్వమైన క్రేజ్ ఏర్పడుతోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.

మొదటి భాగం నవంబర్ 5న (నవంబర్ 4 సాయంత్రం నుంచి ప్రత్యేక పెయిడ్ ప్రీమియర్లతో) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. 40 భాషల్లో విడుదలవుతున్న ఈ అద్భుత దృశ్యకావ్యం కేవలం `ది ఒడిస్సీ` వసూళ్ల రికార్డులను అందుకోవడమే కాకుండా... గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.