రామాయణ: కాంట్రవర్సీ మధ్య మరో మెలోడీ.. 'జతగూడే' ఎలా ఉందంటే?
తెలుగు లిరిక్స్ విషయానికి వస్తే రాకేందు మౌళి అందించిన సాహిత్యం తెలుగు నేటివిటీకి చక్కగా సెట్ అయింది.
By: M Prashanth | 29 Oct 2026 6:58 PM ISTనితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణం' నుంచి వచ్చిన 'మంగళ్ రంగ్' పాటపై అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ట్యూన్లో ఖవ్వాలీ ఛాయలు ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. తెలుగులో 'రంగులు రంగులే' పేరుతో ఈ పాట విడుదలైంది. ఈ విమర్శల మధ్య ఇప్పుడు మరో కొత్త మెలోడీని తీసుకొచ్చారు. హిందీలో 'జుడీ జోడీ' పేరుతో వచ్చిన ఈ పాటను తెలుగులో 'జతగూడే'గా విడుదల చేశారు.
తెలుగు లిరిక్స్ విషయానికి వస్తే రాకేందు మౌళి అందించిన సాహిత్యం తెలుగు నేటివిటీకి చక్కగా సెట్ అయింది. సీతారాముల మధ్య ఉన్న ప్రేమను, ఏడేడు జన్మల బంధాన్ని అందమైన పదాలతో వర్ణించారు. శిరీష భాగవతుల తన గాత్రంతో పాటకు మంచి ఫీల్ తీసుకొచ్చారు. హిందీ వెర్షన్లో శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకు తెలుగులో శిరీష గొంతు కూడా బాగా కుదిరింది.
పాటలో మధ్య మద్యలో కొన్ని డైలాగ్స్ కూడా కంటెంగ్ కి తగ్గట్టుగా ఉన్నాయి. వ్వు లేని స్వర్గమైనా శూన్యంతో సమానం అంటూ సాగే లైన్లు పాత్రల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా స్పష్టంగా ఆవిష్కరించాయి. సంగీతం పరంగా చూస్తే రెహమాన్ ఇందులో రొటీన్ దేవాలయాల కీర్తనల శైలిని ఎంచుకోలేదు. తనదైన క్లాసికల్ టచ్‌తో పాటు ఆధునిక ఆర్కెస్ట్రేషన్ను జోడించారు.
అయితే సాంప్రదాయ పాటల్లో ఉండే భారీ నాదస్వరం, తాళాల హోరును ఆశించే వారికి ఇది కాస్త నిదానంగా సాగే మెలోడీలాగే అనిపిస్తుంది. భారీ హంగుల కంటే సున్నితమైన భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చేలా బాణీని రూపొందించారు. ఇక 'మంగళ్ రంగ్'లో ఖవ్వాలీ ఛాయలు ఉన్నాయని విమర్శించినవారికి ఈ పాట మాత్రం కాస్త భిన్నమైన ఫీల్ ఇస్తుంది.
ముఖ్యంగా రాకేందు మౌళి రాసిన పదాలు తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా అనిపించేలా ఉన్నాయి. అయితే ఇది పూర్తిగా సెలబ్రేషన్ మూడ్‌లోకి తీసుకెళ్లే పాట కంటే, సినిమాలో సందర్భానుసారంగా వచ్చే ఆహ్లాదకరమైన గీతంగా అనిపిస్తోంది. సీతారాముల మధ్య ప్రేమను చెప్పడానికి రెహమాన్ ఎంచుకున్న ఈ సాఫ్ట్ ట్యూన్ బాగానే కుదిరింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'రామాయణం' లాంటి ఎపిక్ చిత్రాలకు తెలుగు మార్కెట్ చాలా కీలకం. ముఖ్యంగా సాయి పల్లవి సీతగా నటిస్తుండటంతో ఇక్కడ అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే 'రంగులు రంగులే' పాటలో సీతారాముల కల్యాణానికి సంబంధించిన విజువల్స్ చూపించారు. ఇప్పుడు 'జతగూడే' ఏ స్థాయిలో హైలెట్ అవుతుందో చూడాలి. ఇక సినిమా నవంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది.
