జై జై రామ్: రెహ్మాన్ మ్యాజిక్‌తో శ్రీరాముని తత్వ గీతం వినేకొద్దీ పరవశమే
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ `రామాయణం` చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా `జై జై రామ్` తెలుగు లిరికల్ పాటను విడుదల చేశారు.
By: Sivaji Kontham | 25 Sept 2026 5:45 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ `రామాయణం` చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా `జై జై రామ్` తెలుగు లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదలైన తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. స్వర మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. భక్తిభావం ఉట్టిపడేలా సాగే ఈ గీతం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీపాలి సహాయ్ - రాఘవ్ కౌశిక్ ఆలపించిన ఈ పాటకు రాకేందు మౌళి అద్భుతమైన తెలుగు సాహిత్యాన్ని అందించారు.
సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ మాట్లాడుతూ.. ఒక సాధారణ ప్రార్థనలోని పవిత్రతను కాపాడుతూనే సినిమా స్థాయికి తగ్గట్టుగా దీనిని గ్రాండ్‌గా మలిచామని తెలిపారు. సాంప్రదాయ హారతిలోని ఆధ్యాత్మిక సారాన్ని.. సినిమాటిక్ ఎలివేషన్‌తో ఉండే భారీతనాన్ని ఈ పాట అద్భుతంగా మిక్స్ చేసి అందిస్తుందని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ కేవలం భారీ విజువల్స్ పైనే కాకుండా.. గాఢమైన భావోద్వేగాలు- భక్తిపై ఆధారపడి ఉంటుందని నిర్మాత నమిత్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కేవలం ఆరు రోజుల్లోనే ఒక బిలియన్ వ్యూస్‌ను దాటి సంచలనం సృష్టించగా.. తాజాగా విడుదలైన పూర్తి పాట సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
నితీశ్ తివారీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా- కన్నడ స్టార్ యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ మైథలాజికల్ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తుండగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు.
విశ్వవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు పెంచేస్తున్న ఈ అద్భుతమైన పౌరాణిక దృశ్యకావ్యం వచ్చే దీపావళి 2026 కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. శ్రీరాముని తత్వాన్ని చాటే ఈ దివ్యమైన గీతం ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి! 2027 దీపావళికి రామాయణం రెండో భాగం విడుదలవుతుంది. ఈ భారీ ఇతిహాస చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు నితీష్ తివారీ బృందం అహోరాత్రులు తీవ్రంగా శ్రమిస్తోంది. అంతర్జాతీయ స్థాయి విజువలైజేషన్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్ల బృందం పని చేస్తున్న విషయం తెలిసిందే.
