Begin typing your search above and press return to search.

రామాయ‌ణం.. డ్యామేజ్ కంట్రోల్ ప్ర‌య‌త్న‌మా?

ఈ త‌రం ఫిలిం మేక‌ర్స్ సినిమా తీయాల‌నుకోవ‌డం బాగానే ఉంది కానీ.. ఆ క‌థ‌లోని ఆత్మ‌ను ప‌ట్టుకోకుండా, భారీత‌నం మీద దృష్టిసారించి నేల‌విడిచి సాము చేస్తే ఏమ‌వుతుందో ఇప్ప‌టికే ఆదిపురుష్ రూపంలో ఒక ఉదాహ‌ర‌ణ ఉంది

By:  Garuda Media   |   5 April 2026 10:08 AM IST
రామాయ‌ణం.. డ్యామేజ్ కంట్రోల్ ప్ర‌య‌త్న‌మా?
X

ఎంతో బాక్సాఫీస్ పొటెన్షియాలిటీ ఉన్న రామాయ‌ణ గాథ‌ మీద.. ఈ త‌రం ఫిలిం మేక‌ర్స్ సినిమా తీయాల‌నుకోవ‌డం బాగానే ఉంది కానీ.. ఆ క‌థ‌లోని ఆత్మ‌ను ప‌ట్టుకోకుండా, భారీత‌నం మీద దృష్టిసారించి నేల‌విడిచి సాము చేస్తే ఏమ‌వుతుందో ఇప్ప‌టికే ఆదిపురుష్ రూపంలో ఒక ఉదాహ‌ర‌ణ ఉంది. రామాయ‌ణం జోలికి ఎందుకు వెళ్లామా అని దాని మేక‌ర్స్ ఎప్ప‌టికీ రిగ్రెట్ అయ్యేలా చేసింది ఆ సినిమా ఫ‌లితం. అవ‌స‌రం లేని భారీత‌నం.. వెర్రిత‌ల‌లు వేసిన క్రియేటివిటీ.. అస‌హ‌జ‌మైన గ్రాఫిక్స్.. అన్నీ క‌లిసి ఆదిపురుష్‌ను భారీ డిజాస్ట‌ర్‌గా మార్చాయి. ఐతే ఎప్ప‌ట్నుంచో బాలీవుడ్లో ప్లానింగ్‌లో ఉన్న మ‌రో రామాయ‌ణం రెండేళ్ల ముందు ముందుకు క‌దిలింది. నితీశ్ తివారి ద‌ర్శ‌క‌త్వంలో న‌మిత్ మ‌ల్హోత్రా నిర్మాత‌గా మొద‌లైన ఈ చిత్రంలో ర‌ణ‌బీర్ క‌పూర్, సాయిప‌ల్ల‌వి సీతారాముల పాత్ర‌లు పోషిస్తున్నారు. గ‌త ఏడాది రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ రామాయ‌ణం మీద అంచ‌నాల‌ను భారీగా పెంచింది.

కానీ ఇటీవ‌ల రిలీజైన రాముడి పాత్ర‌కు సంబంధించిన గ్లింప్స్ మాత్రం ఈ సినిమా మీద మిశ్ర‌మ అభిప్రాయాలను క‌లిగిస్తోంది. ఇందులో భారీత‌నం ఓకే అనిపించినా.. ఆదిపురుష్‌లో ఉన్న కృత్రిమ‌త్వం ఇక్క‌డా కొన‌సాగ‌డంతో సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ త‌ప్ప‌లేదు. ఆదిపురుష్‌లో మాదిరే విచిత్ర జీవులు ఇందులోనూ క‌నిపించాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఆశించినంత గొప్ప‌గా లేవనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. గ్లింప్స్ కోసం ఏఐ మీద ఎక్కువ ఆధార‌ప‌డ్డార‌నే కామెంట్లు కూడా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున క‌నిపిస్తున్నాయి. రామాయ‌ణ క‌థ‌లో ఉన్న గొప్ప‌ద‌నాన్ని ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేయ‌కుండా.. ఆదిపురుష్ త‌ర‌హాలోనే భారీత‌నం, ఎఫెక్ట్స్ మీద దృష్టిసారించ‌డం ఎందుక‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. సోష‌ల్ మీడియాలో చాలా వ‌ర‌కు గ్లింప్స్ మీద నెగెటివిటీనే క‌నిపిస్తుండ‌గా.. నిర్మాత న‌మిత్ డ్యామేజ్ కంట్రోల్‌కు రెడీ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ సినిమాకు రూ.700 కోట్ల‌తో ఓటీటీ డీల్ వ‌స్తే.. ఇంకా ఎక్కువ మొత్తం వ‌స్తుంద‌నే ఉద్దేశంతో ఆ డీల్‌ను నిర్మాత తిర‌స్క‌రించిన‌ట్లుగా మీడియాకు లీక్స్ ఇచ్చారు. ఇది నిజ‌మైన వార్తేనా.. లేక సినిమా మీద నెగెటివిటీ త‌గ్గించి, బ‌జ్ పెంచ‌డానికి ఇలా ట్రై చేస్తున్నారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది సోష‌ల్ మీడియాలో.