Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: `రామాయ‌ణం` కోడ్‌ని డీకోడ్ చేయ‌లేని ద‌ర్శ‌కులు!

నేడు భార‌తీయ పురాణాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర‌వ్వ‌డానికి రామాయ‌ణం, అందులోని పాత్ర‌లు ఒక కార‌ణం.

By:  Sivaji Kontham   |   28 March 2026 7:00 PM IST
ట్రెండీ టాక్‌: `రామాయ‌ణం` కోడ్‌ని డీకోడ్ చేయ‌లేని ద‌ర్శ‌కులు!
X

శ్రీ‌రాముడి ఆద‌ర్శ‌వంత‌మైన వ్య‌క్తిత్వం ప్ర‌పంచాన్ని ఎప్పుడూ ఆక‌ర్షిస్తూనే ఉంటుంది. నేడు భార‌తీయ పురాణాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర‌వ్వ‌డానికి రామాయ‌ణం, అందులోని పాత్ర‌లు ఒక కార‌ణం. భారతీయ చలనచిత్ర, టెలివిజన్ రంగంలో శ్రీరాముడి పాత్ర చిత్రణ కేవలం కథా గమనం మాత్రమే కాదు.. అది ఆయా కాలాల్లోని సామాజిక ఆకాంక్షలకు, రాజకీయ పరిణామాలకు ఒక నిలువుటద్దం. 1931లో వచ్చిన మూకీ చిత్రం `చంద్రసేన` నుండి మొదలైన ఈ పౌరాణిక ప్రయాణం, నేటి ఆధునిక కాలంలోని `ఆదిపురుష్` వరకు ఎన్నో మార్పులకు లోనైంది. వెండితెరపై రాముడు కేవలం ఒక దైవంగానే కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజం ఆశించే ఆదర్శాలకు ప్రతిరూపంగా కనిపిస్తూ వచ్చాడు.

1987లో దూరదర్శన్‌లో ప్రసారమైన రామానంద్ సాగర్ `రామాయణ్` సీరియల్ భారతీయ చరిత్రలోనే ఒక అపూర్వమైన సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించింది. ఆ రోజుల్లో ఆదివారం ఉదయం పూట దేశవ్యాప్తంగా వీధులన్నీ కర్ఫ్యూ విధించినట్లుగా నిర్మానుష్యంగా మారేవి. ప్రజలు తమ టీవీ సెట్లకు పూలమాలలు వేసి భక్తితో ఆరాధించేవారు. శ్రీరాముడిగా అరుణ్ గోవిల్ నటన ఎంతటి ప్రభావాన్ని చూపిందంటే.. నిజజీవితంలో కూడా ప్రజలు ఆయనను సాక్షాత్తు దైవంగా భావించి పాదాభివందనం చేసేవారు. ప్రాంతీయ, భాషా, కుల భేదాలను మరిచి దేశమంతటినీ ఏకం చేసిన శక్తిగా ఈ సీరియల్ నిలిచింది.

రామానంద్ సాగర్ రామాయణం సృష్టించిన కోడ్ ఎంత బలంగా ప‌ని చేసిందంటే.. ఆ తర్వాత దశాబ్దాల వరకు దర్శకులు రాముడి పాత్రను తాకడానికి కూడా సాహసించలేదు. ప్రజల మనసులో రాముడు `మర్యాద పురుషోత్తముడు`గా, ధర్మానికి నిలువుటద్దంగా ప్రతిష్ఠితమై ఉన్నాడు. 2015లో వచ్చిన `సీయ కే రామ్` సీత దృక్కోణంలో కథను చెప్పి ఆకట్టుకున్నా కానీ.. రామానంద్ సాగర్ సృష్టించిన ప్రభావాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఈ కాలంలోనే రాముడి పాత్ర‌ చిత్రణ చుట్టూ మతపరమైన సమీకరణలు.. రాజకీయ మేల్కొలుపు కూడా మొదలవ్వడం గమనార్హం.

సాంకేతికత పెరిగిన తర్వాత ఆధునిక అభిరుచులకు అనుగుణంగా వెండితెర కోసం పురాణాలను మలిచే క్రమంలో వివాదాలు కూడా మొదలయ్యాయి. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన `ఆదిపురుష్` దీనికి ఒక ప్రధాన ఉదాహరణ. బాహుబలిగా మెప్పించిన ప్రభాస్ ఈ పాత్రకు సరిపోతారని భావించినా విజువల్ ఎఫెక్ట్స్, డైలాగులు , పాత్రల ఆహార్యం విషయంలో ప్రేక్షకుల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. 80వ దశకంలో ప్రజాభిప్రాయం నెమ్మదిగా ఉండేది.. కానీ నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కారణంగా ఏ చిన్న లోపమైనా క్షణాల్లో జాతీయ స్థాయి చర్చగా మారుతోంది.

పవిత్ర గ్రంథాలను తిరిగి చెప్పేటప్పుడు సృజనాత్మక స్వేచ్ఛకు, సాంస్కృతిక సున్నితత్వానికి మధ్య ఉన్న సన్నని గీతను దాటడం ఎంత ప్రమాదకరమో ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి. భవిష్య‌త్ కాలంలో నితేష్ తివారీ రామాయణ, రాజమౌళి `వారణాసి` వంటి చిత్రాలు రాముడిని ఎలా చూపిస్తాయో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాలం మారుతున్నా.. మాధ్యమం మారుతున్నా శ్రీరాముడి కథ మాత్రం భారతీయుల మనసులో ఎప్పటికీ చర్చలను.. భక్తిని .. కొత్త ఆలోచనలను రేకెత్తిస్తూనే ఉంటుంది.