Begin typing your search above and press return to search.

అంత‌ర్జాతీయ‌ ఆడియన్స్‌కి 'రామాయ‌ణం' ఎలా ఉంటే న‌చ్చుతుంది?

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'రామాయణం' గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

By:  Sivaji Kontham   |   18 Sept 2026 5:27 PM IST
అంత‌ర్జాతీయ‌ ఆడియన్స్‌కి రామాయ‌ణం ఎలా ఉంటే న‌చ్చుతుంది?
X

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'రామాయణం' గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించే ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్‌లో కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. దేశీయ ప్రేక్షకుల అభిరుచికి.. అంతర్జాతీయ ప్రేక్షకుల ఆలోచనా విధానానికి ఉండే వ్యత్యాసాన్ని గ్రహించి మేకర్స్ ఈ తెలివైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారతీయ భాషల్లో విడుదలయ్యే వెర్షన్లతో పోలిస్తే.. ఇంగ్లిష్ వెర్షన్‌ను దాదాపు 30 నిమిషాలు తక్కువ నిడివితో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొన్ని పాటలతో పాటు ఇంటర్నేషనల్ ఆడియెన్స్ నేరేషన్ స్పీడ్‌కు సరిపోయేలా కొన్ని సన్నివేశాలను కూడా తొలగించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం భారతీయ సంస్కృతికి తగ్గట్టుగా పాటలు, మ్యూజిక్‌కు పూర్తి ప్రాధాన్యం ఇస్తార‌ని స్పష్టమవుతోంది.

నిజానికి అంతర్జాతీయ ప్రేక్షకుల అభిరుచిని అందుకోవాలంటే 'రామాయణం' ఇంగ్లిష్ వెర్షన్ క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' లేదా 'డన్‌కిర్క్' తరహాలో ఇంటెన్స్ థ్రిల్స్‌తో సాగితేనే కనెక్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గ్రీక్ పురాణాల ఆధారంగా వచ్చిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. మన భారతీయ పురాణేతిహాసమైన రామాయణంలో సూప‌ర్ హీరోయిక్ అంశాలకు (ఫిక్షన్ ఎలిమెంట్స్) అవకాశం ఉండటం వల్ల దీనికి ఇంకా అద్భుతాలు సృష్టించే సత్తా ఉంది.

అయితే ఇది పూర్తిగా దర్శకుడు నితీశ్ తివారీ నేరేషన్ స్కిల్స్ , ఎడిటర్ల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. సుత్తి లేకుండా పాయింట్‌కు కట్టుబడి కథను నడిపించినప్పుడే గ్లోబల్ ఆడియెన్స్ ని మెప్పించ‌గ‌లం. గ్రీకు పురాణాల్లో కనిపించని ఎన్నో ఆదర్శ భావాలు, నీతి నియమాలు, యుద్ధ నిరతి, స్నేహ ధర్మం వంటి యూనివర్సల్ అప్పీల్ ఉన్న బలమైన ఎలిమెంట్స్ రామాయణంకి పెద్ద ప్ల‌స్.

ఏ ఆడియెన్‌కు ఏది నచ్చుతుందో బేరీజు వేసుకుంటూ ద‌ర్శ‌కుడి విజ‌న్ కి త‌గ్గ‌ట్టు ఎడిటర్లు తెలివిగా కంటెంట్‌ను మలచడమే ఈ ప్రాజెక్ట్ విజయానికి కీలకమని చెప్పవచ్చు. ఆయా దేశాల ప్రేక్షకులకు తగినట్లుగా కథను ఆవిష్కరిస్తేనే.. మన పురాణేతిహాసం అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.