Begin typing your search above and press return to search.

'చైనా'లో 'ది ఒడిస్సీ' మార్గాన్ని అనుసరిస్తున్న 'రామాయణం'!

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన `ది ఒడిస్సీ` చిత్రం చైనా మార్కెట్‌లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

By:  Sivaji Kontham   |   16 Aug 2026 9:49 AM IST
చైనాలో ది ఒడిస్సీ మార్గాన్ని అనుసరిస్తున్న రామాయణం!
X

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన `ది ఒడిస్సీ` చిత్రం చైనా మార్కెట్‌లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ చిత్రాన్ని చైనా వ్యాప్తంగా ఏకంగా 20,000 స్క్రీన్లలో విడుదల చేయడమే కాకుండా.. అక్కడున్న 800 ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్లన్నింటిలోనూ అత్యంత భారీగా రిలీజ్ చేసి సరికొత్త రికార్డులకు తెరలేపారు. ఈ వ్యూహాత్మక విడుదల కారణంగానే `ది ఒడిస్సీ` బాక్సాఫీస్ వద్ద ఆల్-టైమ్ రికార్డు ఓపెనింగ్స్ రాబట్టిందని చైనా ట్రేడ్ చెబుతోంది. చైనాలో మొద‌టి రోజే ది ఒడిస్సీ ఏకంగా 47000 షోలు ప‌డ‌గా 15 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసిన‌ట్టు స‌మాచారం. అందుకే ఇప్పుడు ఇదే మోడల్‌ను నమూనాగా తీసుకుంటూ నితేష్ తివారీ-రణ్‌బీర్ కపూర్ ల అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం` కూడా చైనాలో భారీ స్థాయి విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

దాదాపు పదేళ్ల క్రితం నితేష్ తివారీ తెరకెక్కించిన `దంగల్` చిత్రం చైనా బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక విజయం సాధించి అక్కడి ప్రేక్షకులకు ఆయనను సుపరిచితం చేసింది. ఇప్పుడు ఆ నమ్మకంతోనే `రామాయణ: పార్ట్ 1` చిత్రాన్ని చైనాలో `ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్` అనే ప్రత్యేకమైన టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ `సోనీ పిక్చర్స్` అక్కడ ఈ చిత్రాన్ని పంపిణీ చేసే బాధ్యతను స్వీకరించింది. `ది ఒడిస్సీ` తరహాలోనే చైనాలోని ప్రధాన ఐమ్యాక్స్ స్క్రీన్లన్నింటినీ దక్కించుకుని అంతర్జాతీయంగా భారీ మార్కెట్‌ను కొల్లగొట్టాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ భారీ విడుదలకు సన్నాహకంగా చైనాలో గ్రాండ్ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. సెప్టెంబర్ 24న జరిగే ప్రతిష్టాత్మక `పింగ్ యావో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్` లో దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రెస్ మీట్ .. సినిమా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 1 నుండి ప్రారంభమయ్యే చైనా `గోల్డెన్ వీక్` వేడుకల సందర్భంగా ప్రధాన నగరాల్లో భారీ ప్రచార పర్యటనలు (ప్రావిన్స్ టూర్స్) చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

విడుదల తేదీల విషయానికి వస్తే.. `రామాయణ: పార్ట్ 1` అంతర్జాతీయ మార్కెట్లలో శుక్రవారం నవంబర్ 6న విడుదల కానుండగా... భారతదేశంలో దీపావళి కానుకగా నవంబర్ 8న థియేటర్లలోకి రానుంది. ఈ ఎపిక్ డ్రామాలో రణ్‌బీర్ కపూర్ (రాముడిగా), యశ్ (రావణాసురుడిగా), సాయి పల్లవి (సీతగా) నటిస్తుండగా.. సన్నీ డియోల్, అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంపై వచ్చిన సీజీఐ విమర్శలపై రణ్‌బీర్ కపూర్ స్పందిస్తూ.. ఏళ్ల తరబడి కష్టపడిన టెక్నీషియన్ల పనితనాన్ని సులువుగా విమర్శించవద్దని.. సోషల్ మీడియా `సిజి క్రిటిక్స్` కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

అయితే క్రిస్టోఫర్ నోలన్ ఉపయోగించే 70ఎంఎం ఫిల్మ్ ఐమ్యాక్స్ సాంకేతికతకు .. డిజిటల్ ఐమ్యాక్స్‌తో తెరకెక్కిన `రామాయణం` స్క్రీన్ లుక్-మేకింగ్‌కు సాంకేతికంగా వ్యత్యాసం ఉన్నా.. `ది ఒడిస్సీ` అనుసరించిన బిజినెస్ మోడల్ మాత్రం భారతీయ సినిమాకు ఒక ఆదర్శంగా నిలిచే ఛాన్సుంది. చైనాలో ఉన్న 800 ఐమ్యాక్స్ థియేటర్ల నెట్‌వర్క్‌ను సద్వినియోగం చేసుకుంటూ `రామాయణం`అక్కడ ఏ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.